తీరంలో అలజడి | Sea has entered the shore of the Konaseema district port | Sakshi
Sakshi News home page

తీరంలో అలజడి

Aug 14 2026 3:02 AM | Updated on Aug 14 2026 3:01 AM

Sea has entered the shore of the Konaseema district port

ఉప్పొంగి ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం  

కోనసీమ జిల్లా ఓడలరేవు తీరంలో 50 అడుగుల మేర కోత  

కడలిలో కలిసిన తాటిచెట్లు.. కూలిన పర్యాటక రిసార్ట్స్‌ ప్రహరీ.. విశాఖ జిల్లా యారాడలోనూ ‘అల’కల్లోలం  

అల్లవరం/పెదగంట్యాడ: సముద్రం అలకల్లోలం సృష్టించింది.  అమావాస్య కావడంతో బుధవారం రాత్రి, గురువారం వేకువన భారీ అలలు ఉప్పొంగాయి. కడలి ముందుకు చొచ్చుకొచ్చింది. ఫలితంగా గ్రామాల్లో ప్రజలు భీతిల్లారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు తీరంలోభారీ కెరటాల తాకిడికి 50 అడుగుల మేర తీరం కోతకు గురైంది. తీరానికి రక్షణ వలయంగా ఉన్న తాడిచెట్లూ కడలిలో కలసిపోయాయి. పర్యాటకుల కోసం నిర్మించిన సముద్ర రిసార్ట్స్‌ భవనం ప్రహరీ కుప్ప కూలింది. రిసార్ట్స్‌కు ఆనుకుని ఉన్న రొయ్యల చెరువుకు భారీ గండి ఏర్పడింది. 

రిసార్ట్స్‌కు తాడిచెట్లు రక్షణగా ఉండటంతో ప్రస్తుతం తాత్కాలికంగా ముప్పు తప్పింది. అయితే, ఇదే తరహాలో అలలు ఎగసిపడితే మాత్రం సముద్ర రిసార్ట్స్‌ ఏ సమయంలోనైనా కూలిపోయే పరిస్థితి నెలకొంది. ఓడలరేవు తీరం వద్ద ఏటా జూలై, ఆగస్టు నెలల్లో సముద్ర అలల భారీగా ఎగసిపడుతున్నాయి. తీరాన్ని కోతకు గురిచేస్తున్నాయి. 2019 సెప్టెంబర్‌ 12న ఇక్కడ సముద్రం మహోగ్రరూపం దాల్చింది. రెండు రోజుల పాటు భారీ కెరటాలతో సుమారు వంద మీటర్ల మేర సముద్రం ముందుకు వచ్చింది. దీంతో, తీరం పొడవునా ఉన్న రోడ్డు కడలిలో కలసిపోయింది. సరుగుడు తోటలు, తాడిచెట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 

అదే తరహాలో గురువారం తెల్లవారుజామున సముద్రం తీరంపై విరుచుకుపడింది. ఓడలరేవు తీరంలో చమురు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓఎన్‌జీసీ ఆన్‌షోర్‌ టెర్మినల్‌ రక్షణకు తీరం పొడవునా వైనతేయ గోదావరి నదీ ముఖద్వారం నుంచి కొమరగిరిపట్నం యడ్లరేవు వరకూ గ్రోయిన్ల నిర్మాణం చేపట్టింది. ఇవి సముద్ర రిసార్ట్స్‌కు ఇరువైపులా ఉన్నాయి. అయినప్పటికీ భారీ అలలు విరుచుకుపడ్డాయి.  తీరం పొడవునా సాగు చేస్తున్న ఆక్వా చెరువుల కట్టలు వలయం ధ్వంసమయ్యాయని స్థానికులు చెబుతున్నారు.  

» యారాడ తీరంలోనూ సముద్రం ఉప్పొంగింది. యారాడ గ్రామానికి వెళ్లే రహదారిపైకి నీరు చేరింది.  దీంతో గ్రామస్తులు భయాందోళనకు లోనయ్యారు.. జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ గురువారం ఉదయం కిందిస్థాయి అధికారులను అప్రమత్తం చేశారు.. రోడ్డుపై పేరుకుపోయిన మట్టి, ఇసుక తిన్నెలను జేసీబీ సాయంతో శుభ్రం చేయించారు. అలాగే పర్యాటకులు ఎవరూ యారాడ తీరానికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement