డీఎస్సీ స్కామ్‌పై నిలదీస్తే అక్రమ కేసులా? | Illegal cases against YSRCP cadres across the state | Sakshi
Sakshi News home page

డీఎస్సీ స్కామ్‌పై నిలదీస్తే అక్రమ కేసులా?

Aug 14 2026 2:41 AM | Updated on Aug 14 2026 2:41 AM

Illegal cases against YSRCP cadres across the state

పోలీసులను ప్రయోగించి చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు 

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ అణచివేత చర్యలు 

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు 

సాక్షి, అమరావతి / నెట్‌వర్క్‌: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా అణచివేస్తోంది. కక్ష సాధింపు చర్యల కోసం పోలీస్‌ యంత్రాంగాన్ని ప్రయోగిస్తోంది. మెగా డీఎస్సీ స్కామ్‌ 2025పై వెల్లువెత్తుతున్న నిరసనలకు సమాధానం చెప్పలేక అక్రమ కేసులు బనాయిస్తోంది. డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని, దీనిపై సీబీఐతో విచారణ నిర్వహించాలనే డిమాండ్లతో మూడు రోజుల పాటు రిలే దీక్షలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ర్యాలీలు విజయవంతం కావడంతో చంద్రబాబు సర్కారు బెంబేలెత్తుతోంది. 

నిరసన ర్యాలీలపై ఉక్కుపాదం మోపుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్‌ అరెస్టులకు దిగింది. రోడ్లపై బారికేడ్లు పెట్టి వైఎస్సార్‌ సీపీ శ్రేణులను నిరోధించేందుకు చేసిన యత్నాలు విఫలమయ్యాయి. వైఎస్సార్‌సీపీ శ్రేణులు, జెన్‌ జీ యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పోలీసు అడ్డంకులను అధిగమించి ర్యాలీలను విజయవంతం చేశారు.  

జాతీయ స్థాయిలో చర్చ.. 
రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్సార్‌సీపీ ర్యాలీలతో దద్దరిల్లాయి. ఈ నిరసనల్లో ప్రధానంగా జెన్‌ జీ యువత, పెద్ద ఎత్తున పాల్గొనడం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. దీంతో తన తనయుడు లోకేశ్‌ రాజకీయ భవితపై కలవరపాటుకు గురైన సీఎం చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని పోలీసులతో అణచివేత చర్యలకు దిగారు. రిలే దీక్షలు, ర్యాలీలను అడ్డుకునేందుకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డినప్పటికీ వారి ప్రయత్నాలు విఫలమవడంతో అక్రమ కేసులు బనాయించే ఎత్తుగడ పన్నారు. 

ఈ నేపథ్యంలో చంద్రబాబు డైరెక్షన్‌లో మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి కార్యకర్తలపై వేధింపులకు దిగారు. పలుచోట్ల అక్రమ కేసులు నమోదయ్యాయి. యువతను మోసం చేసిన చంద్రబాబును ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.  చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే నారా లోకేశ్‌తో రాజీనామా చేయించి డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణకు అంగీకరించాలని, యువతకు నిరుద్యోగ భృతి, ఫీజులు, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.  

కొడాలి నానిని కలిసిన ఎస్‌ఐ వీఆర్‌కు.. 
ఈ నెల 10న గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానిని కలిసిన గుడివాడ ఒకటో పట్టణ ఎస్‌ఐ వైవీవీ సత్యనారాయణ నిరసన ర్యాలీకి అనుమతిలేదని నోటీసు అందించారు.  అనంతరం పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, జెన్‌ జీ యువత, ప్రజలతో కలిసి మాజీ మంత్రి కొడాలి నాని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఎస్‌ఐ సత్యనారాయణను వీఆర్‌కు పంపిస్తూ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.  
» కర్నూలు రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో 53 మంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. 
» వినుకొండలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతోపాటు పలువురు నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 10న వినుకొండలో 144 సెక్షన్‌ అమల్లో ఉండగానే ర్యాలీ చేపట్టినట్లు  పేర్కొన్నారు.  
»  అమలాపురంలో నిరసన ర్యాలీ చేపట్టినందుకు మాజీ మంత్రి విశ్వరూప్, మాజీ ఎంపి చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్‌ సహా 15 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. పోలీస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 30ను ఉల్లంఘించారంటూ కేసు పెట్టారు. 
»  గుంటూరు అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నూరి ఫాతిమా తదితర 17 మంది వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలతో పాటు పోలీస్‌ యాక్టు అమలులో ఉన్నా ర్యాలీ నిర్వహించినట్లు కేసు నమోదు చేశారు. 
»  ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఐదు నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించినందుకు వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. 
»  అనకాపల్లి జిల్లాలో ఈనెల 10న నిరసన ర్యాలీకి పిలుపునిచ్చినందుకు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్, మరో 27 మందిపై శాంతి భద్రతలకు విఘాతం కలిగించారంటూ అక్రమ కేసులు నమోదయ్యాయి.  
»  అనంతపురం జిల్లాలో అక్రమ కేసుల పరంపరం కొనసాగుతోంది. పుట్టపర్తిలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదైంది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలపై తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసులు నమోదయ్యాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement