AP: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ లేఖ | YSRCP Writes Letter to AP State Election Commission Over Voter Deletion Concerns | Sakshi
Sakshi News home page

AP: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ లేఖ

Aug 13 2026 3:48 PM | Updated on Aug 13 2026 4:22 PM

YSRCP Writes A Letter To State Election Commission
  • మ్యాపింగ్ లేని ఓటర్ల వెరిఫికేషన్‌పై సవరణలు చేయాలి
  • ఏ ఒక్క నిజమైన ఓటరు ఓటు హక్కు కోల్పోకూడదు
  • ఓటు హక్కు పరిరక్షణకు ఏకరూప ఆదేశాలు ఇవ్వాలి
  • స్థానికంగా లేని ఓటర్ల స్థానంలో బంధువుల పత్రాల సమర్పణకు అవకాశమివ్వాలి
  • రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈఓ), ఈసీఐకి వైఎస్‌ఆర్‌సీపీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లేఖ

తాడేపల్లి: విధానపరమైన లోపాలు, సాంకేతిక ఇబ్బందులు లేదా నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం వల్ల ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా తమ ప్రాథమిక ఓటు హక్కును కోల్పోకూడదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తూ మూడు కీలక విజ్ఞప్తులను ప్రధానంగా ప్రస్తావించారు. 

ఉపాధి, విద్య, వలసల కారణంగా స్థానికంగా అందుబాటులో లేని ఓటర్ల తరఫున వారి తల్లిదండ్రులు లేదా రక్తసంబంధీకులు తగిన అధికార పత్రాలతో (Authorisation) ఆధారాలు సమర్పించే వెసులుబాటు కల్పించాలని కోరారు. అలాగే, ఓటర్లకు జారీ చేసే నోటీసుల్లో తనిఖీ వేదిక, తేదీ, సమయం, సంబంధిత అధికారి వివరాలను కచ్చితంగా పేర్కొనేలా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అంతిమ చట్టబద్ధమైన నిర్ణయం సంబంధిత ERO/AERO వద్దే ఉన్నప్పటికీ, ఓటర్లు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా స్థానిక బిఎల్ఓ (BLO)ల ద్వారానే పత్రాల స్వీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి ప్రక్రియను మరింత సరళతరం చేయాలని అభ్యర్థించారు. నిజమైన ఓటర్ల హక్కులను పరిరక్షించేందుకు ఈ మూడు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ఆదేశాలు జారీ చేయాలని ఆయన లేఖ ద్వారా ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. 
ఈ సందర్భంగా లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారంటే...

వీరి ద్వారా పత్రాల సమర్పణకు అవకాశం కల్పించాలి
చదువు, ఉద్యోగాలు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లు నోటీసులో పేర్కొన్న తేదీన స్వయంగా హాజరు కాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా వారి తల్లిదండ్రులు లేదా రక్తసంబంధీకులు సరైన ఆధారాలు, అధికార పత్రంతో వారి తరఫున అవసరమైన పత్రాలను సమర్పించేందుకు అనుమతించాలి.

నోటీసుల్లో తనిఖీ వేదికను తప్పనిసరిగా పేర్కొనాలి
ఓటరుకు నోటీసు ఇచ్చినప్పుడు ఎక్కడికి రావాలో స్పష్టంగా తెలియకపోవడం సరికాదు. ప్రతి నోటీసులో కచ్చితమైన తనిఖీ వేదికతో పాటు తేదీ, సమయం, సంబంధిత అధికారి వివరాలను తప్పనిసరిగా పేర్కొనాలి. ప్రతి ఓటరు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లే పరిస్థితి లేకుండా సంబంధిత బీఎల్ఓల ద్వారా పత్రాలను స్వీకరించేలా, ప్రాథమిక మరియు క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించేలా ప్రక్రియను సులభతరం చేయాలి. తుది నిర్ణయం ఈఆర్వో, ఏఈఆర్వోల పరిధిలోనే ఉన్నప్పటికీ బీఎల్ఓ స్థాయిలో సదుపాయం కల్పిస్తే ఓటర్లు తమ సమస్యలను స్థానికంగానే వేగంగా పరిష్కరించుకోగలరు. మ్యాపింగ్ కాలేదనే కారణంతో లేదా రికార్డుల్లో తేడాలు ఉన్నాయనే కారణంతో నిజమైన ఓటర్లు ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఓటర్ల ధ్రువీకరణ విషయంలో బీఎల్ఓలకు స్పష్టమైన మార్గదర్శకాలు, ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలి.

మూడు అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ఆదేశాలు ఇవ్వాలి
తల్లిదండ్రులు, రక్తసంబంధీకుల ద్వారా పత్రాల సమర్పణకు అవకాశం ఇవ్వడం, నోటీసుల్లో తనిఖీ వేదిక–తేదీ–సమయం స్పష్టంగా పేర్కొనడం, ప్రతి ఓటరు స్వయంగా ఉన్నతాధికారి వద్దకు వెళ్లేలా కాకుండా, సంబంధిత బిఎల్ఓ (BLO) ద్వారా పత్రాలను స్వీకరించడం మరియు ప్రాథమిక/క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టేలా ఈ ప్రక్రియను ఓటర్లకు మరింత సులభతరం చేయాలని కోరారు.

మరోవైపు అంతిమ చట్టబద్ధమైన నిర్ణయం సంబంధిత ERO/AERO వద్దే ఉన్నప్పటికీ, బీఎల్ఓ స్థాయి సదుపాయం ద్వారా ఓటర్లు తమ సమస్యలను స్థానికంగా మరియు వేగంగా పరిష్కరించుకోవడానికి వీలవుతుందని... ఈ నేపధ్యంలో ఈ అంశాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అదే విధంగా విధానపరమైన ఇబ్బందులు, నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడం లేదా నోటీసుల్లో స్పష్టత లేకపోవడం వల్ల ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప ఆదేశాలు జారీ చేయాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement