తిరుపతి జిల్లా: ఎనిమిదేళ్లుగా ప్రేమించిన ప్రియునికి మరో వారం రోజుల్లో వేరే అమ్మాయితో వివాహం జరుగుతుండటంతో, తట్టుకోలేక యువతి బెంగళూరులో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెకు చెందిన షాలిని(21), పనపాకం హరిజనవాడకు చెందిన ఎస్. చందు 8వ తరగతి నుంచి ప్రేమించుకుంటున్నారు.
వీరి ప్రేమ విషయం తెలిసిన షాలిని కుటుంబ సభ్యులు ఆమెను బెంగళూరు పంపించి, అక్కడ ప్రైవేటు కళాశాలలో చేర్పించారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న షాలినీని, చందు అక్కడికి వెళ్లి ఆమెను కలుస్తూనే ఉండేవాడు. తల్లిదండ్రులు అతనికి మరో అమ్మాయితో వివాహం నిశ్చయం చేశారు. వారంలో ప్రియుడికి పెళ్లి కాబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోయిన షాలిని, సోమవారం బెంగళూరులోని తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. భయపడిన చందు ప్రస్తుతం పరారయ్యాడు.


