న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనుల హక్కులు, ఉద్యోగ అవకాశాల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మా తనూజ రాణి.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జీవో నెం.3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయులు సహా కీలక ప్రభుత్వ ఉద్యోగాల్లో గిరిజనులకు 100 శాతం స్థానిక రిజర్వేషన్, ప్రాతినిధ్యం కల్పించే విధంగా తగిన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కేలా ప్రత్యేక విధానం అవసరమని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే 1/70 భూ బదలాయింపు చట్టం గిరిజనుల భూమి, జీవనాధారం, హక్కులను కాపాడే అత్యంత కీలకమైన చట్టమని ఎంపీ వివరించారు. షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనుల భూములు అన్యాక్రాంతం కాకుండా 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, గిరిజన రాజ్యాంగ హక్కులకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు.


