కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు | Ysrcp Mps And Mlcs Meet Union Minister Pralhad Joshi | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Aug 13 2026 6:33 PM | Updated on Aug 13 2026 6:51 PM

Ysrcp Mps And Mlcs Meet Union Minister Pralhad Joshi

సాక్షి, ఢిల్లీ: ఎన్నికల ముందు ఉపాధ్యాయుల హక్కుల కోసం పోరాడుతామని మాయమాటలు చెప్పి.. వారి ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఇప్పుడు వారి కష్టాలను గాలికొదిలేశారని వైఎస్సార్సీపీ నాయ‌కులు మండిప‌డ్డారు. ఇన్ స‌ర్వీస్ టీచ‌ర్ల‌ను టెట్ ప‌రీక్ష భారం నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు మ‌ద్దిల గురుమూర్తి, గొల్ల బాబూరావు నేతృత్వంలో టీచ‌ర్ ఎమ్మెల్సీలు ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, క‌ల్ప‌ల‌తారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని క‌లిశారు.

టెట్ ప‌రీక్ష ఉత్తీర్ణ‌త కావ‌డం త‌ప్ప‌నిస‌రి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃస‌మీక్షించాల‌ని వారు కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. అనంత‌రం వారు మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకుంటోందని మండిప‌డ్డారు. కేంద్రంలో తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని గొప్పలు చెప్పుకునే వెన్నుపోటు పార్టీ నేతలు, టీచర్లను ఆదుకునేందుకు 'విద్యా హక్కు చట్టాన్ని' ఎందుకు సవరించలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

50 ఏళ్లు వయసు దాటిన టీచర్లను ఉన్నట్టుండి ఇప్పుడు ఆన్‌లైన్‌లో అన్ని సబ్జెక్టులూ పరీక్ష రాయమనడం దారుణమ‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కనీసం రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా ముందుకు రాని పరిస్థితుల్లో, ఉపాధ్యాయుల పక్షాన వైఎస్సార్సీపీ నిలబడిందని చెప్పారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రికి టీచర్ల ఆవేదనను వివరించామ‌ని వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడకపోతే, ఉపాధ్యాయ లోకం తరపున చట్టసభల్లోనూ, న్యాయస్థానాల్లోనూ వైఎస్సార్సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు. వారు ఇంకా ఏం మాట్లాడారంటే..

సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు?: గొల్ల బాబూరావు
కేంద్రంలో చక్రం తిప్పుతున్నామని, తమ మద్దతుతోనే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని చెప్పుకునే కూటమి నేతలు.. మరి ఉపాధ్యాయులను ఈ 'టెట్' భారం నుంచి ఎందుకు కాపాడలేకపోతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో సుమారు లక్ష మంది, దేశవ్యాప్తంగా లక్షలాది మంది టీచర్లు ఈ ఎగ్జామ్ వల్ల తీవ్ర ఆందోళనకు గురవుతూ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఒకసారి ఎగ్జామ్ పాసై, ఉద్యోగంలో చేరి 20-30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకుని 50 ఏళ్లు దాటిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ పరీక్ష రాయమనడం ఉపాధ్యాయుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే.

టీచర్ల ఓట్లతో గెలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌లకు సూటిగా సవాల్ చేస్తున్నా.. మీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు? ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న మీరు పార్లమెంట్‌లో 'విద్యా హక్కు చట్టం' సెక్షన్ 23 కి సవరణలు ఎందుకు తీసుకురారు? వెంటనే ఈ వయసు పైబడిన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇప్పించాలి. లేదంటే వైఎస్సార్సీపీ తరపున మా పోరాటం ఆగదు.

టీచ‌ర్ల ఓట్ల‌తో గెలిచి.. ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారు: గురుమూర్తి
మొన్నటి ఎన్నికల్లో టీచర్ల ఓట్లు వాడుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వారిని గాలికొదిలేసింది. అధికార పక్షం పట్టించుకోకపోయినా, మా అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకే మేము ఢిల్లీకి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిసి టీచర్ల కష్టాలను వివరించాం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న వెన్నుపోటు పార్టీ.. టీచర్ల బాధలు చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణం.

50 ఏళ్లు దాటిన వారిని ఆన్‌లైన్ ఎగ్జామ్ రాయమనడం, 60 శాతం మార్కులు వస్తేనే క్వాలిఫై అనడం ఎంతవరకు సమంజసం? రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను ఇలాగే గాలికి వదిలేస్తే.. వైఎస్సార్సీపీ చూస్తూ ఊరుకోదు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతాం, జీరో అవర్‌లో లేవనెత్తుతాం. అవసరమైతే కోర్టుల్లో కూడా ఉపాధ్యాయుల పక్షాన న్యాయపోరాటం చేస్తాం.

ఇన్-సర్వీస్ టీచ‌ర్ల‌కి అండగా వైఎస్సార్సీపీ: ఎంవీ రామచంద్రారెడ్డి
ఉపాధ్యాయ సంఘాలన్నీ మా వద్దకు వచ్చి ఈ టెట్ పరీక్ష వల్ల వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మొరపెట్టుకున్నారు. వెంటనే మేము ఈ విషయాన్ని వైఎస్‌ జగన్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన సూచనలతోనే దేశ రాజధానిలో కేంద్ర మంత్రులను కలుస్తున్నాం. రాష్ట్రంలో లక్ష మంది, దేశవ్యాప్తంగా దాదాపు 28 లక్షల మంది టీచర్లు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అన్ని సబ్జెక్టులు చదివి పరీక్ష రాయమనడం సీనియర్ టీచర్లకు శిక్ష లాంటిది. చట్ట సవరణ చేసి వయసు పైబడిన ఉపాధ్యాయులకు ఈ పరీక్ష నుంచి వెంటనే మినహాయింపు ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం టీచర్లను పట్టించుకోకపోయినా, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులందరికీ వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.

పరీక్ష తప్పనిసరి అయితే వారి సబ్జెక్టులోనే పెట్టాలి: పర్వత రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి
విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్.. ఉపాధ్యాయుల కష్టాలపై ఎందుకు మౌనంగా ఉన్నారు? 2011కి ముందు సర్వీసులో చేరిన వారికి టెట్ నిబంధనలు లేవు. 1990ల నుంచి సర్వీస్ లో ఉన్న వాళ్ళని ఇప్పుడు ఉన్నట్టుండి టెట్ క్వాలిఫై కావాలని షరతు పెట్టడం టీచర్లను అవమానించడమే. ఒక ఉపాధ్యాయుడు తాను బోధించే సబ్జెక్టులో కాకుండా, అన్ని సబ్జెక్టులలో పరీక్ష రాసి తీరాలని బలవంతం చేయడం క్రూరమైన చర్య.

సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. మీకు నిజంగా ప్రేమ ఉంటే, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదు? ఒకవేళ పరీక్ష తప్పనిసరి అయితే వారి సబ్జెక్టులోనే, అది కూడా ఆఫ్‌లైన్‌లో పెట్టాలి. విద్యాశాఖ మంత్రి తక్షణమే స్పందించి కేంద్రం వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించాలి.

ఉద్యోగాలు పోతాయని భయపెడుతున్నారు: కల్పలతా రెడ్డి
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ క్వాలిఫై కావడానికి 2028 ఆగస్టు 31 వరకు గడువు ఉంది. కానీ, ఉన్నట్టుండి ఇప్పుడే టెట్ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు పెట్టడంతో టీచర్లలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఉద్యోగాలు పోతాయనో, ప్రమోషన్లు ఆగిపోతాయనో భయపెడుతున్నారు. 50 ఏళ్లు దాటిన సీనియర్ టీచర్లకు ఆన్‌లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు.

దీనివల్ల వారు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు, దాని ప్రభావం నేరుగా విద్యార్థుల చదువులపైనా పడుతోంది. కూటమి ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి, టీచర్లకు భరోసా కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయింపునిస్తూ ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని సవరించాలి. ఉపాధ్యాయ లోకానికి మేమంతా తోడుగా ఉంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement