వెలిగొండ నిర్వాసితుల నిరీక్షణ | Tension in Markapuram as residents of Veligonda project protest | Sakshi
Sakshi News home page

వెలిగొండ నిర్వాసితుల నిరీక్షణ

Aug 14 2026 2:57 AM | Updated on Aug 14 2026 2:57 AM

Tension in Markapuram as residents of Veligonda project protest

మార్కాపురంలో ఉద్రిక్తత

మంత్రులకు తమ గోడు విన్నవించేందుకు 4 గంటలకుపైగా కలెక్టరేట్‌ వద్ద పడిగాపులు

మార్కాపురం టౌన్‌: జిల్లా కేంద్రం మార్కాపురం కలెక్టరేట్‌ వద్ద గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఐదుగంటల పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్షకు వచ్చిన మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణరెడ్డి  మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కలెక్టర్‌ కార్యాలయం లోపలకు వెళ్లారు. ఇది తెలుసుకున్న గొట్టిపడియ, సుంకేశుల, కలనూతల, గుండంచర్ల తదితర ముంపు గ్రామాల నిర్వాసితులు భారీ సంఖ్యలో కలెక్టరేట్‌ వద్దకు చేరుకున్నారు. 

సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరీక్షించారు. దీంతో పెద్దసంఖ్యలో పోలీసులు...నిర్వాసితులను లోపలకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. పలుమార్లు పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. రాత్రి ఏడు గంటల సమయంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బయటకు రాగా, నిర్వాసితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు.  

తమ డిమాండ్లను పరిçష్కరించకుండా ఇళ్లు ఖాళీ చేయాలని చెబితే తామెక్కడ ఉండాలని, దీంతోపాటు నీళ్లొదిలే తేదీని కటాఫ్‌ తేదీగా తీసుకుని 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని, పునరావాస కాలనీలో సౌకర్యాలు కల్పించాలని నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. ఎట్టకేలకు రాత్రి 8 గంటలు దాటిన తర్వాత బయటకు వచ్చిన మంత్రులకు నిర్వాసితులు తమ కష్టాలు చెప్పుకున్నారు.  

సీఎం దృష్టికి తీసుకెళ్తా: మంత్రి రామానాయుడు 
నిర్వాసితుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వచ్చే వారంలో రూ.300 కోట్లు, నెలాఖరులోపు మరో రూ.300 కోట్లు నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ నెలాఖరులోపు గ్రామాలను ఖాళీ చేయాలని, ఏమైనా సమస్యలుంటే స్పెషల్‌ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement