ప్రైవేటు భూ వివాదంలో కలెక్టర్‌కు ఏం పని..? | High Court strongly objects to Tirupati Collectors conduct | Sakshi
Sakshi News home page

ప్రైవేటు భూ వివాదంలో కలెక్టర్‌కు ఏం పని..?

Aug 14 2026 3:10 AM | Updated on Aug 14 2026 3:10 AM

High Court strongly objects to Tirupati Collectors conduct

భూమన, అనుచరులను గూండాలని కలెక్టర్‌ ఎలా సంబోధిస్తారు?

కలెక్టర్‌ దారుణమైన భాషను ఉపయోగించారు 

తిరుపతి కలెక్టర్‌ తీరును తీవ్రంగా ఆక్షేపించిన హైకోర్టు 

భూమన, ఆయన కుటుంబ సభ్యులపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు

పోలీసులకు హైకోర్టు ఆదేశాలు

సాక్షి, అమరావతి: తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై చంద్రబాబు ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను హైకోర్టు గురువారం తీవ్రంగా ఆక్షేపించింది.  తిరుపతి రూరల్‌ మండలం, తణపల్లి పరిధిలోని సర్వే నంబర్‌ 478లోని అప్రూవ్డ్‌ ప్రైవేట్‌ లేఔట్‌లోకి భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ కలెక్టర్‌ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో భూమన, ఆయన కుటుంబ సభ్యులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. 

ప్రైవేట్‌ లేఔట్‌లోకి అక్రమంగా చొరబడి ఉంటే, దాని యజమాని కింది కోర్టులో సూట్‌ దాఖలు చేసుకునే వారని పేర్కొంటూ, దీంట్లో కలెక్టర్‌ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశి్నంచింది. ఈ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని పోలీసులకు సూచించిన హైకోర్టు, దర్యాప్తునకు సహకరించాలని భూమన, ఆయన కుటుంబ సభ్యులను ఆదేశించింది.ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.  

కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌పై హైకోర్టును ఆశ్రయించిన భూమన 
భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన అనుచరులు అప్రూవ్డ్‌ లేఔట్‌లోకి అక్రమంగా ప్రవేశించి  యంత్రాల సహాయంతో మామిడి తోటల మొక్కలను ధ్వంసం చేశారని, అలాగే తన సొంత పొలానికి రోడ్డు వేసుకుని అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారని, దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్‌ గత నెల 22న జిల్లా ఎస్‌పీని లిఖితపూర్వకంగా ఆదేశించారు.  

ఈ ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన సతీమణి రేవతి, కుమారుడు అభినయ్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్‌ లక్ష్మణరావు విచారణ జరిపారు. భూమన తరఫున సీనియర్‌ న్యాయవాది చిత్తర్వు నాగేశ్వరరావు, న్యాయవాది యుగంధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా భూమన, ఆయన కుటుంబ సభ్యులపై ప్రభుత్వం విషం చిమ్ముతోందన్నారు. 

లేఔట్‌ యజమాని ఫిర్యాదు చేయనప్పుడు కలెక్టర్‌ ఎలా జోక్యం చేసుకుంటారు? 
‘‘ఓ ప్రైవేట్‌ అప్రూవ్డ్‌ లేఔట్‌ వివాదంలో కలెక్టర్‌కు ఏ సంబంధం ఉంది?  ప్రైవేటు భూ వివాదంలో జోక్యం చేసుకునే అధికార పరిధి కలెక్టర్‌కు ఎక్కడ ఉంది? భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన అనుచరులను గూండాలని కలెక్టర్‌ తన ప్రొసీడింగ్స్‌లో పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరం. ఏ ఆధారంతో కలెక్టర్‌ వారిని గూండాలని సంబోధిస్తారు? కలెక్టర్‌ చాలా దారుణమైన భాష ఉపయోగించారు. ప్రైవేటు అప్రూవ్డ్‌ లేఔట్‌ యజమాని ఫిర్యాదు చేయనప్పుడు ఆ వ్యవహారంలో కలెక్టర్‌ ఎలా జోక్యం చేసుకుంటారు?’’ అని  తిరుపతి జిల్లా కలెక్టర్‌ను ఉద్దేశించి హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఫిర్యాదుదారుగా కలెక్టర్‌ని పేర్కొనడంపై కూడా  విస్మయం వ్యక్తం చేసింది.  కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్‌పీని కలెక్టర్‌ కోరితే, ఫిర్యాదుదారుగా కలెక్టర్‌ను ఎలా పేర్కొంటారని ప్రశ్నించింది. బహుశా కలెక్టర్‌ మన శాఖకు చెందిన వారు కాదు కదా అన్న ఉద్దేశంతో,  ఎస్‌పీని కాకుండా కలెక్టర్‌ను  ఫిర్యాదుదారుగా పోలీసులు పేర్కొని ఉంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది. ఎస్‌పీని ఫిర్యాదుదారుగా చేర్చేంత ధైర్యం కింది స్థాయి పోలీసులకు ఎక్కడ ఉంటుందని వ్యాఖ్యానించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement