ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రచారం
సర్‌లో తొలగించిన 44.10 లక్షల ఓటర్లకు నోటీసులు.. 45 రోజుల్లోగా పరిష్కారం
18 ఏళ్లు నిండిన వారికి కొత్తగా ఓటు
జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ సూచన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (ఎస్‌ఐఆర్)లో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సవరణలపై ఓటర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఆయన గురువారం వీడియా కాన్ఫెరెన్స్ ద్వారా క్లెయిమ్స్, అభ్యంతరాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ప్రచారం కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి ఆఫీసర్లు, రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు హాజరై ఓటరు జాబితా ధ్రువీకరణ, ఫారాలు, మార్గనిర్దేశాలతో పౌరులకు సహాయం చేయాలని కోరారు. ఇప్పటికే 44.10 లక్షల మంది తొలగించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అభ్యంతరాల పరిశీలనకు 45 రోజుల సమయం ఉందని తెలిపారు.
కొత్త ఓటర్ల నమోదు
18 ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకోసం విస్తృత ప్రచారం చేయాలని, కళాశాలలు, విద్యా సంస్థల వద్ద శిబిరాలను ఏర్పాటు చేసి, కొత్త ఓటర్ల నమోదు చేపట్టాలని చెప్పారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6 సమర్పించేలా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రోత్సహించాలన్నారు. ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లలో అక్షర దోషాల సవరణకు ఈసీఐ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ జరపాలని చెప్పారు. 48 గంటలకు పైబడి పెండింగ్‌లో ఉన్న బీఎల్‌ఓ కాల్స్ నాన్–రెస్పాన్స్ కేసులను, ఎన్జీపీఎస్ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.


