కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి వైఎస్సార్ సీపీ ఎంపీలు, టీచర్ ఎమ్మెల్సీల వినతి
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమస్య పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారని ధ్వజం
పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ బిల్లుతో పాటు అన్ని మార్గాల్లోనూ ఒత్తిడి తెస్తామని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఇన్ సర్వీస్ టీచర్లకు ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) నుంచి మినహాయింపు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే 30 ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారికి మళ్లీ టెట్ నిర్వహించడం సరికాదని కేంద్రం దృష్టికి తెచ్చింది. టెట్ నిబంధన వల్ల ఆంధ్రప్రదేశ్‌లో సుమారు లక్ష మంది, దేశవ్యాప్తంగా దాదాపు 28 లక్షల మంది ఇన్‌సర్వీస్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపింది.
వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాశ్‌రెడ్డి, గురుమూర్తి, గొల్ల బాబూరావు నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ(టీచర్) ఎమ్మెల్సీలు టి.కల్పలతారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై ఈమేరకు వినతిపత్రం అందచేశారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రం దృష్టికి సమస్యను తెచ్చినట్లు చెప్పారు. అనంతరం వారంతా ఆంధ్రప్రదేశ్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమిస్తాం
సంబంధిత సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులను అన్ని సబ్జెక్టులతో టెట్ పరీక్ష రాయాలనడం ఎంతవరకు సమంజసమని ఎంపీలు ప్రశ్నించారు. టెట్ నుంచి సీనియర్, ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఉపాధ్యాయుల సమస్యపై కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు డిమాండ్ చేశారు. టీచర్ల ఓట్లతో గెలిచిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమస్యను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు.
రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టడంతోపాటు అన్ని పార్లమెంటరీ మార్గాలను ఉపయోగించి ఉపాధ్యాయుల తరఫున పోరాడతామని ప్రకటించారు. ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న టీడీపీ కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారిపై టెట్ బలవంతంగా రుద్దడం వారి వృత్తిని అవమానించడమేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.
విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన సమయంలో ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టెట్ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని టీచర్ ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి హెచ్చరించారు.
ప్రభుత్వంపై ఒత్తిడితేవాలని వినతి
ఇన్‌సర్వీస్ టీచర్లను టెట్ నుంచి మినహాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ ఏపీ వైఎస్సార్‌టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ జంషీద్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటనాథరెడ్డి, గౌరవ అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమరనాథరెడ్డి, కడప, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.సంగమేశ్వరరెడ్డి ఢిల్లీలో ఎంపీలు గొల్ల బాబూరావు, డాక్టర్ మద్దిల గురుమూర్తి, టీచర్ ఎమ్మెల్సీలకు వినతిపత్రాన్ని అందచేశారు. సుదీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్నామని, కొన్ని వేల మంది రెండు మూడేళ్లలో రిటైర్ కాబోతున్న విషయాన్ని ఎంపీల దృష్టికి తెచ్చారు.


