బాధితులే నిందితులా?.. పరాకాష్టకు కుట్ర రాజకీయాలు | YS Jaganmohan Reddy Fires On Chandrababu govt | Sakshi
Sakshi News home page

బాధితులే నిందితులా?.. పరాకాష్టకు కుట్ర రాజకీయాలు

Aug 14 2026 5:26 AM | Updated on Aug 14 2026 5:40 AM

YS Jaganmohan Reddy Fires On Chandrababu govt

కర్నూలులోని బళ్లారి చౌరస్తా వద్ద మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం

పరాకాష్టకు కుట్ర రాజకీయాలు   

బీసీ నాయకులనూ వదలని వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు

నిప్పులు చెరిగిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

రెడ్‌బుక్‌ రాజ్యాంగంతోనే ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసు

అర్ధరాత్రి 2.45 గంటలకు ఆయన్ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? 

ఆయన ఏమైనా ఉగ్రవాదా? పగటి పూట నోటీసు ఇస్తే సరిపోయేది కదా? 

విరూపాక్షి ఇంట్లో పోలీసులు దొంగల్లాగా సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేశారు? 

మా పార్టీ నాయకులు, కార్యకర్తలపై వారే దాడి చేసి వారే కేసులు పెట్టారు.

నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసులు వెన్నుపోటు పారీ్టకి కొమ్ము కాస్తున్నారు 

ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసుల్లో పోలీసులు చేసిన ఆరు తప్పులకు సాక్ష్యమిదిగో

విరూపాక్షితో ములాఖత్‌ సందర్భంగా జైలులో నిలబెట్టి వీడియోలు తీసి నన్ను అవమానించారు

ఇలా ఎందుకు చేశారని సూపరింటెండెంట్‌ను అడిగితే పై నుంచి ఆదేశాలని చెప్పారు 

అంటే చంద్రబాబే ఉద్దేశపూర్వకంగా నన్ను అవమానించారు.. ఆయన శాడిజం పరాకాష్టకు చేరింది 

ఈ రోజు మీరు వేస్తున్న విష బీజాలు రేపు రెట్టింపు అవుతాయని గుర్తు పెట్టుకోండి

బీసీ నాయకులపై చంద్రబాబు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజు, ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి, ఆలూరు ఎమ్మెల్యే బి.విరూపాక్షి, ఏలూరు ఎంపీగా పోటీ చేసిన కారుమూరి సునీల్, గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తఫాలపై ఏ రకంగా అక్రమ కేసులు పెట్టారో చూస్తున్నాం.
– వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు: వెన్నుపోటు పార్టీ రెడ్‌బుక్‌ రాజ్యాంగం సాక్షిగా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అన్యాయంగా అరెస్టు చేసిందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలు పరాకాష్టకు చేరాయని, బాధితులే నిందితులవుతున్నారని.. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నేతలే లక్ష్యంగా కక్షసాధింపులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే విరూపాక్షి తన పార్టీ కార్యకర్తను కాపాడుకోవడానికి వెళితే ఆయనపైనే ఏకంగా మూడు కేసులు నమోదు చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బాధితుల పక్షాన ఎవరైనా గట్టిగా నిలదీస్తే.. వారు ఎమ్మెల్యేలైనా కూడా లెక్కలేకుండా అర్ధరాత్రి పూట పోలీ­సులే దొంగలు, బందిపోటు గూండాల మాదిరిగా ఇంట్లోకి చొరబడి సీసీ టీవీ కెమెరాలు దొంగిలించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలన్నారు. గాంధీ పుట్టిన దేశంలో ఇలాంటి దుర్బర పరిస్థితులు నెలకొనడం బాధాకరమని చెప్పారు. చంద్రబాబు ప్రభు­త్వం అక్రమ కేసు పెట్టడంతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, పార్టీ నాయకులను వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం 3.50 గంటల ప్రాంతంలో ములాఖత్‌లో కలుసుకున్నారు. అరగంటపాటు వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. తానున్నానని, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? 
‘‘ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేగా విరూపాక్షి గెలుపొందారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఇంట్లోకి అర్ధరాత్రి 2.45 గంటల సమయంలో పోలీసులు అక్రమంగా చొరబడి నిద్ర పోతున్న ఆయన్ను అరెస్టు చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఇది జరిగింది. ఎమ్మెల్యే ఇంట్లోకి పోలీసులు దొంగల్లా చొరబడి.. సీసీ కెమెరాలను దొంగిలించి.. డోర్లు పగలగొట్టి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది? మనుషుల సంచారం లేని రాత్రి సమయంలో పోలీసులు ఎమ్మెల్యేను అపహరించుకుపోవడం దారుణం. ఎమ్మెల్యే ఏమైనా ఉగ్రవాదా? పగటి పూట నోటీసు ఇస్తే ఎమ్మెల్యే స్టేషన్‌కు వచ్చి వివరణ ఇవ్వడా? విరూపాక్షికి సంబంధించి ఒక కేసులో 34 మందిపై, రెండో కేసులో మరో 14 మందిపై కేసు పెట్టారు. మూడో కేసులో మరో 12 మందిని ఇరికించారు. వీరిలో ప్రస్తుతం ఎమ్మెల్యే విరూపాక్షి సహా మొత్తంగా 38 మంది రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో ఎమ్మెల్యేతోపాటు ఆయన కొడుకు, ఆయన తమ్ముడు, ఆయన తమ్ముడి కొడుకుసహా కేసు పెట్టి జైలుపాలు చేశారు. మరో తమ్ముడి కొడుకును ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కుటుంబాన్ని ఇరికించే కార్యక్రమం చేస్తున్నారు. 

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

పోలీసుల ఆరు తప్పులు.. 
ఎమ్మెల్యే విరూపాక్షిపై పెట్టిన కేసుల్లో పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఈ క్రమంలో వారు ఆరు తప్పులు చేసి అడ్డంగా ఇరుక్కున్నారు. (ఇందుకు సంబంధించి ఫోన్‌ కాల్‌ హిస్టరీ, ఫొటోలు, వీడియోలు చూపారు)   
1     బాధితులపై దాడి చేసి.. వారిపైనే కేసులు పెట్టడం మొదటి తప్పు. 
ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం సంగాలకు చెందిన గిరి అనే పార్టీ కార్యకర్త తన ఇంటిపై దాడి జరుగుతోందని, అందుకు సంబంధించి తన ఇంటి ఫొటోలు, వీడియోలను ఎమ్మెల్యేకు ఆగస్టు 1వ తేదీన రాత్రి 7.45 గంటలకు పంపారు. ఎమ్మెల్యే వెంటనే 7.47 గంటలకు చిప్పగిరి ఎస్‌ఐకి ఫోన్‌ చేసి గిరిని కాపాడాలని కోరారు. ఆ వెంటనే ఆలూరు సీఐకి కూడా ఫోన్‌ చేస్తే కలువలేదు. తిరిగి 8.03 గంటలకు సీఐకి ఫోన్‌ చేసి కాపాడాలని కోరినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో 8.08 గంటలకు గిరి.. ఎమ్మెల్యేకు మరోసారి ఫోన్‌ చేసి కాపాడకపోతే చంపేస్తారని చెప్పాడు. మానవత్వం ఉన్న ఎమ్మెల్యే స్వయంగా సంగాలకు వెళ్లి.. అక్కడ పరిస్థితులను తెలుసుకొని గిరిని తన వెంట తీసుకెళ్లాడు. దీంతో ఎమ్మెల్యే తప్పు చేశారని ఆయనపై కేసు పెట్టడం పోలీసుల మొదటి తప్పు 
2  నేమకల్లులో ఎమ్మెల్యే కారుపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ క్రమంలో నేమకల్లులో ఓ టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపి ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చింపారని చెప్పి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. ఇక్కడ పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే రెండో కేసు పెట్టి మరో తప్పు చేశారు. 
3    ఎమ్మెల్యే కారుపైనే దాడి చేసి.. ఆయన తమ్ముడి చేయి విరగ్గొట్టి, దాడి చేసిన వారి జోలికి వెళ్లకుండా ఎమ్మెల్యేపైనే మూడో కేసుపెట్టి పోలీసులు మూడో తప్పు చేశారు.  
4  టీడీపీ నాయకుల చేతిలో గాయపడిన సంగాల గిరి, చేయి విరిగిపోయిన తమ్ముడిని ఎమ్మెల్యే విరూపాక్షి చిప్పగిరి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు పెట్టాలని కోరినా పోలీసులు కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం నాలుగో తప్పు. ఇక్కడ ఎమ్మెల్యేపైనే రివర్స్‌ కేసు పెట్టారు. 
5  సంగాల, నేమకల్లులలో జరిగిన సంఘటనలపై ఎవరూ ఫిర్యాదు చేయకున్నా.. పోలీసులే కేసులు కట్టడం ఐదో తప్పు. 
6  ఎమ్మెల్యే విరూపాక్షి ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకొళ్లి.. పోలీసులే సీసీటీవీ కెమెరాలను దొంగల్లా తీసుకెళ్లడం ఆరో తప్పు. 

ఏదైనా ఫిర్యాదు వస్తే ప్రాథమిక విచారణ చేసి పోలీసులు కేసులు పెట్టాలి. మా ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసు పేరుతో వ్యవస్థను నడిపాం. చంద్రబాబు ప్రభుత్వంలో అవేమీ లేకుండా బాధితులెవరూ ఫిర్యాదు ఇవ్వకున్నా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు.   

చంద్రబాబూ ఏ స్థాయికి దిగజారి రాజకీయాలు చేస్తున్నావో తెలుసుకో.. 
వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడానికి వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు దిగజారి రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు పెట్టడానికి ఏకంగా టీడీపీ కార్యకర్త పది మంది చూస్తుండగా తన భార్య బట్టలు చింపే వరకు దిగజారారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం అవుతోంది. టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపే వీడియో బయటకు రావడంతో రాష్ట్రం నివ్వెర పోయింది. చివరికి ఆ ఆడబిడ్డతో తప్పుడు మాటలు చెప్పించే పని చేయడం అన్యాయం. రాష్ట్రం ఎంత దిగజారి పోయిందో చెప్పడానికి చంద్రబాబునాయుడు కుట్ర రాజకీయాలే నిదర్శనం. మీరే దాడి చేసి.. మీరే చేయి విరగ్గొట్టి.. మా పార్టీ నేతపై మీరే అక్రమ కేసులు పెడితే ప్రజాస్వామ్యం బతుకుతుందా? సంగాల గిరిపై దాడి, ఎమ్మెల్యే తమ్ముడి చేయి విరిగ్గొట్టిన సంఘటనల్లో పోలీసులు కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులే సీసీ టీవీలను మాయం చేశారంటే పరిస్థితి ఎంతదాకా వచ్చిందో ఇట్టే తెలుస్తోంది. 

బీసీ నాయకత్వంపై చంద్రబాబు కుట్రలు 
పేరు పొందిన బీసీ నాయకులపై చంద్రబాబునాయుడు కుట్రలు పన్ని అక్రమ కేసులు పెడుతున్నారు. బీసీలను ఎదగనీయకుండా లక్ష్యంగా చేసుకున్నారు. శ్రీకాకుళంలో మత్స్యకార బీసీ నాయకుడు సీదిరి అప్పలరాజుపై ఆయన 18 ఏళ్ల కుమారుడి బైక్‌ యాక్సిడెంట్‌ను వక్రీకరించి కుట్ర, హత్యాయత్నం కింద అక్రమ కేసు పెట్టారు. శ్రీకాకుళం జైలులో ఉన్న అప్పలరాజును నేను చూడడానికి వెళితే ప్రజలు విపరీతంగా వచ్చిన నేపథ్యంలో ఆమదాలవలస సమన్వయకర్త కళింగ చింతాడ రవి మహిళా ఎస్‌ఐని చంపబోయాడని అక్రమ కేసు పెట్టారు. బుద్ధుంటే పోలీసులు ఇలాంటి కేసులు ఎలా కడతారు? వేల మందిలో మహిళలను ఎలా చంపుతారు? కర్నూలులో బోయ కులస్తుడు, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిపై చంద్రబాబునాయుడు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి. ఇబ్బంది పెడుతున్నారో చూస్తున్నాం. గుంటూరులో మైనార్టీ నాయకుడు ముస్తాఫాపై ఏరకంగా అక్రమ కేసు పెట్టారో చూశాం. ముస్తాఫా కుటుంబీకులు డబ్బులు ముందుగానే ఇచ్చినా, తీసుకున్న వారు డబ్బులు ఇవ్వకపోగా పొగాకు కూడా ఇవ్వలేదు. ఈ కేసులో ముస్తాఫా బా«ధితుడు అయితే అతనిపైనే కేసులు పెట్టడం అన్యాయం. అలాగే ఏలూరు ఎంపీగా పోటీ చేసిన యాదవ నేత కారుమూరి సునీల్‌.. లిక్కర్‌ టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టారు.  
నన్నూర్‌ టోల్‌గేట్‌ వద్ద వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌ వెంటే ముందుకు సాగుతున్న అశేష జనవాహినిలో ఓ భాగం   

చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట  
గ్రిల్‌ వద్ద నిలబెట్టి వీడియోలు తీసి అవమానించారు.. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్ర రాజకీయాలకు హద్దే లేకుండా పోతోంది. దిగజారి కక్ష సాధింపులకు దిగుతున్నారు. జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖత్‌లో కలుసుకోవడానికి వెళ్లిన నన్ను అవమానించారు. సాధారణంగా జైలులోకి ప్రవేశించిన తర్వాత వెళ్లిన వారిని కూర్చోబెట్టి వీడియో, ఫోటోలు తీసి పంపిస్తారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నన్ను మాత్రం గ్రిల్‌ వెలుపల నిలబెట్టి ఫొటోలు, వీడియోలు తీసి అవమానించారు. ఎందుకిలా చేశారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నిస్తే.. పై నుంచి వచ్చిన ఆదేశాలతో ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. దీన్నిబట్టి వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉద్దేశ పూర్వకంగానే నన్ను అవమానించాడు. ఇది దారుణం. ఇది చంద్రబాబు శాడిజానికి పరాకాష్ట.  

అన్యాయంగా కేసులు.. అరెస్టులు
ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులపై అన్యాయంగా పోలీసులు కేసులు పెట్టారు. కేసుల నమోదు, ఎఫ్‌ఐఆర్‌లు డొల్లతనంగా ఉన్నాయి. ఒక ఫిర్యాదులో ఉన్న నలుగురి పేర్లు.. అదే ఫిర్యాదులో వేరే నిందితులుగా చూపారు. ఏ–10 యాదవల్లి ప్రేమకుమార్‌ను ఏ–22గా కూడా చూపారు. ఏ–17 మాల గాదిలింగను ఏ–25గా.. ఏ–19 సత్తిరెడ్డిని ఏ–23గా ఎ.సత్యనారాయణరెడ్డి అని చూపారు. ఏ–18 కురవ లింగప్పను మళ్లీ ఏ–24 గా చూపించారు. వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కక్ష సాధింపు పరాకాష్టకు చేరింది. ఎల్లకాలం వెన్నుపోటు పార్టీ ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని గట్టిగా చెబుతున్నా. మీరు ఈరోజు ఏవైతే దుష్ట సంప్రదాయాల విష బీజాలు విత్తుతున్నారో.. రేపు అవే రెండింతలై మిమ్మల్ని చుట్టుకుంటాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి చూస్తూ చూస్తూ ఉండగానే రెండేళ్లయిపోయింది. కళ్లు మూసుకొని కళ్లు తెరిచే సరికి ఇంకో మూడేళ్లు కూడా అయిపోతాయి. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబునాయుడు నాటిన విష బీజాలు రెండింతలవుతాయని ఆయన గుర్తుంచుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, పేర్నినాని.. వైఎస్సార్‌సీపీ కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎస్వీమోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, ఇషాక్‌బాషా, మధుసూదన్, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

పోటెత్తిన జనసునామీ!
కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  కర్నూలు కదిలింది.. ఓర్వకల్లు హోరెత్తింది.. రహదారులు జనసంద్రాలయ్యాయి..! కర్నూలు – హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జన ప్రభంజనం కనిపించింది. తుంగభద్ర, హంద్రీ ప్రవాహంతో పోటీ పడుతూ యువ తరంగం ఉవ్వెత్తున ఎగిసింది. పోలీసుల ఆంక్షలు, చెక్‌ పోస్టులు, అడ్డంకులను చేధించుకుని ఇసుకేస్తే రాలనంతగా తరలి వచ్చింది. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తమ కష్టాలు చెప్పుకునేందుకు.. తమ గోడు వెళ్లబోసుకునేందుకు.. న్యాయం కోసం మొరపెట్టుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆడబిడ్డ నిధి అందని మహిళలు.. తల్లికి వందనం మిస్సయిన తల్లులు.. ఉద్యోగం లేక, నిరుద్యోగ భృతి లేక అల్లాడుతున్న యువత.. దగా డీఎస్సీలో మోసపోయామని ఆవేదన చెందుతున్న ఉద్యోగార్థులు.. కరువుసీమలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే నాథుడు లేక విలవిల్లాడుతున్న రైతులు.. కర్నూలులో హైకోర్టు కోసం న్యాయవాదులు.. కష్టాల్లో ఉన్న డాక్యుమెంట్‌ రైటర్లు.. సూపర్‌సిక్స్‌.. సూపర్‌సెవెన్‌ హామీలను నమ్మి మోసపోయామని వాపోతున్న వివిధ వర్గాల ప్రజలు.. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య.. ఒక్కటే ఆశ.. జగన్‌ తమ గోడు వింటారన్న నమ్మకం! తమకు అండగా ఉంటారన్న నమ్మకం ! వీరి ఆవేదనకు తోడుగా.. తమ అభిమాన నేతను ఒక్కసారి చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పోటెత్తిన జనంతో ఓర్వకల్లు నుంచి కర్నూలు వరకు జనసునామీ కని­పించింది. జననేత పర్యటన ఆసాంతం ‘జెన్‌ జీ’ యూత్‌ జో­ష్‌ వెల్లువెత్తింది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా.. ఎండ తీ­వ్ర­త ఠారెత్తిస్తున్నా.. 38 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందు­కు ఐదు గంటలకు పైగా సమయం పట్టేంతగా జనప్రవా­హం ఉప్పొంగింది. కర్నూలు–హైదరాబాద్‌ జాతీయ రహదా­రి, బైపాస్‌ రోడ్డు, నగర పురవీధులు ఎటుచూసినా జ­నసంద్రమే. యువత, మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తే­డా లేకుండా జగన్‌కు ఘనస్వాగతం పలికారు. గజమాలలు.. పూలవర్షాలు.. ‘జై జగన్‌’ నినాదాలతో కర్నూలు దద్దరిల్లింది. 

జనమే జనం.. జననేతకు బ్రహ్మరథం.. 
ఉదయం 11 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైఎస్‌ జగన్‌కు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఎయిర్‌పోర్టు నుంచి కర్నూలు– హైదరాబాద్‌ జాతీయ రహదారి కూడలికి చేరుకునేందుకే అరగంటకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత పూడిచెర్ల క్రాస్, రాక్‌ గార్డెన్, హెచ్‌ 8 హోటల్‌ జంక్షన్, నన్నూరు, నన్నూరు టోల్‌ ప్లాజా, ప్రజా నగర్,  కర్నూలు రింగ్‌ రోడ్డు జంక్షన్, వెంకన్నబావి, గుత్తి పెట్రోల్‌ బంక్‌ జంక్షన్, కల్లూరు, షరీఫ్‌ నగర్, హ్యాంగవుట్‌ హోటల్‌ సెంటర్, జిల్లా రిజిస్ట్రేషన్‌ ఆఫీస్, చెన్నమ్మ సర్కిల్, కేశవ గ్రాండ్‌ హోటల్‌ జంక్షన్, బళ్లారి చౌరస్తా, ఆటోనగర్, సంతోష్‌ నగర్, పంచలింగాల సర్కిల్, పంచలింగాలపల్లె మీదుగా జిల్లాజైలు వరకు దాదాపు 38 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగింది. జగన్‌ను చూసేందుకు కర్నూలు, నంద్యాల పరిసర జిల్లాల నుంచి వచ్చిన జనంతో కర్నూలు నగరం జనసంద్రాన్ని తలపించింది.  
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు వద్ద భారీగా తరలి వచ్చిన జనసందోహానికి అభివాదం చేస్తున్న జననేత 

వైఎస్‌ జగన్‌కు డీఎస్సీ అభ్యర్థుల మొర
మెగా డీఎస్సీ పేరిట తమను దగా చేశారంటూ.. అన్ని అర్హతలు ఉండి డీఎస్సీలో ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు.  జాతీయ రహదారిపై ప్రజానగర్‌ వద్ద వీరంతా ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమకు అండగా నిలిచిన వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు. తప్పకుండా మీకు అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయం వద్ద్ద వైఎస్‌ జగన్‌ను కలిసిన డాక్యుమెంట్‌ రైటర్లు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం తమ పొట్టకొడుతోందంటూ వాపోయారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు సంతోష్‌నగర్‌ వద్ద కలిసి విజ్ఞాపన పత్రం అందించారు. కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ కర్నూలు జిల్లాకు చెందిన పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వర్షాలు  పడవని, కరువుతో సీమ ప్రజలు అల్లాడిపోతుంటారని వాపోయారు. సూపర్‌సిక్స్, సూపర్‌ సెవెన్‌ హామీలు నమ్మి మోసపోయిన వివిధ వర్గాల ప్రజలు దారి పొడవునా వైఎస్‌ జగన్‌ను కలిసి తమ వినతులు అందజేశారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో వైఎస్‌ జగన్‌ను సుగాలీ ప్రీతి తల్లి పార్వతి దేవి కలిసి తమగోడు చెప్పుకున్నారు. తనకోసమే పార్టీ పెట్టానని చెప్పుకున్న జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు తనకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వడం లేదని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం తనను అన్ని విధాలుగా వంచించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా మంచి జరిగిందంటే అది మీ హయాంలో మాత్రమేనని పార్వతి గుర్తుచేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement