ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీం కోర్టు
పోలీసు కస్టడీలో యువకుడి మృతిని దాస్తున్నారని మండిపాటు
కప్పిపుచ్చేందుకు కట్టుకథలు చెబుతున్నారంటూ డీజీపీపై ఆగ్రహం
కస్టడీలో హింసకు బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తప్పవని హెచ్చరిక
మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల మధ్యంతర పరిహారం
అక్టోబర్ 13 నాటికి సీబీఐ నివేదిక కోర్టు ముందుంచాలని ఆదేశం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఇటీవల వెలుగుచూసిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు మాదిరిగానే ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించిన శ్రవణ్ (28) అనే యువకుడి మృతి కేసును సుప్రీంకోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఏవైనా ఆరోపణలతో పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఒకవేళ కస్టడీలో మృతి చెందితే, చట్టం ఎంత కఠినంగా ఉంటుందో స్పష్టం చేసింది. శ్రవణ్ అనే యువకుడి మృతి వెనుక జరిగిన కుట్రను, పోలీసుల కప్పిపుచ్చే ధోరణిని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత ధర్మాసనం.. డీజీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మొత్తం ఘటనపై సీబీఐతో దర్యాప్తుకు ఆదేశించింది. మధ్యంతర నష్టపరిహారంగా బాధితుడి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పోస్టుమార్టంతో వెలుగులోకి నేరం
ఆరు లీటర్ల మహువా (నాటు సారాయి) కలిగి ఉన్నాడనే అభియోగంతో ఎక్సైజ్ చట్టం కింద శ్రవణ్ అనే యువకుడిని 2024 జనవరి 18న ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బిలాస్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అక్కడ శ్రవణ్ ఆరోగ్యం క్షీణించడంతో జనవరి 21న సిమ్స్ (సీఐఎంఎస్) ఆçసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మరుసటి రోజు ఉదయం శ్రవణ్ ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహంపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో తేలింది. తల వెనుక భాగంలో బలమైన గాయం, మెడ, తొడ భాగాలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గట్టి వస్తువుతో తలపై కొట్టడం వల్ల తలెత్తిన సమస్యల కారణంగా గుండెపోటు (కార్డియో – రెస్పిరేటరీ) వచ్చి చనిపోయాడని ఆ నివేదికలో స్పష్టమైంది.
కుటుంబ సభ్యుల న్యాయ పోరాటం
శ్రవణ్ మృతిపై సీఆర్‌పీసీ సెక్షన్ 176 కింద జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నేతృత్వంలో విచారణ జరిగింది. తలకు బలమైన గాయం వల్లే శ్రవణ్ మరణించాడని నిర్ధారిస్తూ బిలాస్‌పూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 2024 జూలైలో నివేదిక సమర్పించారు. అయినప్పటికీ ఈ కేసులో బాధ్యులైన అధికారులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో శ్రవణ్ భార్య, కుమార్తెలు ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇంటి యజమానిని కోల్పోయిన తమకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అయితే, కస్టడీలోనే శ్రవణ్‌ను హింసించారని తేలినప్పటికీ అందుకు బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం, హైకోర్టు కేవలం రూ.లక్ష మాత్రమే నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించడంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పోలీసుల వాదనలపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం
శ్రవణ్ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం.. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే జ్యుడీషియల్ ఎంక్వైరీ నివేదిక తమకు అందకపోవడం వల్లే క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఛత్తీస్‌గఢ్ డీజీపీ కోర్టులో వాదించారు. దీన్ని ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. హైకోర్టు విచారణ సమయంలోనే జ్యుడీషియల్ ఎంక్వైరీ జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని, నివేదిక కూడా రికార్డుల్లో ఉందని గుర్తు చేసింది. డీజీపీ వాదన ‘పచ్చి అబద్ధం, అత్యంత హేయమైనది’ అని మండిపడింది.
కోర్టుల కళ్లలో మట్టికొట్టే ప్రయత్నం
‘న్యాయ విచారణ నివేదిక వచ్చినా రాష్ట్ర అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, దాన్ని దాచి పెట్టాలని చూడటం ముమ్మాటికీ అదొక కప్పిపుచ్చే కథ కిందకే వస్తుంది. కోర్టుల కళ్లలో మట్టి కొట్టే ప్రయత్నం ఇది’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రవణ్ అకాల మరణంతో ఏకైక ఆధారం కోల్పోయిన బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నష్టపరిహారాన్ని తక్షణమే చెల్లించాలని ఆదేశించింది.
అధికారుల పాత్రపైనా సీబీఐ దర్యాప్తు
నిజాలు నిగ్గు తేల్చడానికి శ్రవణ్ మృతి ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జ్యుడీషియల్ నివేదిక వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా దోషులను కాపాడేందుకు ప్రయత్నించిన రాష్ట్ర స్థాయి అధికారుల పాత్రపై కూడా విచారణ జరపాలని సీబీఐకి స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను వారం రోజుల్లో సీబీఐ డైరెక్టర్‌కు అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు నివేదికను అక్టోబర్ 13న జరిగే తదుపరి విచారణ నాటికి కోర్టు ముందుంచాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది.


