క్షుద్ర పూజలకు అడ్డొస్తున్నాడనే..
బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యకు యత్నం
ముగ్గురు కిడ్నాపర్ల ముఠా అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్, కడప: క్షుద్ర పూజలకు అడ్డుపడుతున్నాడనే వల్లూరులో బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నానికి నిందితులు ఒడిగట్టారని పోలీసులు తెలిపారు. బీటెక్ విద్యార్థి కిడ్నాప్, హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులను వల్లూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి నేరానికి ఉపయోగించిన కారు, వేటకత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కడప ఇన్‌ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, కమలాపురం సీఐ మోహన్, వల్లూరు ఎస్సై శివనాగిరెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి కథనం ప్రకారం..
డబ్బు ఆశ చూపి బాలికతో నగ్న పూజలు
చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన కాణిపాకం విజయ్‌కుమార్ అలియాస్ విజయ్, చిత్తూరు టౌన్ దుర్గానగర్‌కు చెందిన కర్ణం బాల హేమనాథ్ అలియాస్ హేమంత్, అదే ప్రాంతానికి చెందిన కర్ణం హేమనాథ్ బాల సుబ్రహ్మణ్యం ఒక ముఠాగా ఏర్పడ్డారు. గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేయాలని నిర్ణయించారు. వీరు అనంతపురం జిల్లా శెట్టూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక తండ్రితో పరిచయం చేసుకుని డబ్బు ఆశ చూపి నగ్న క్షుద్ర పూజలు నిర్వహించారు.
అనంతరం గుప్తనిధుల విషయమై కడపకు చెందిన వెంకటేష్ యాదవ్‌ను సంప్రదించగా, మరోసారి పూజలు చేయాలని బాలికను కడపకు తీసుకురావాలని సూచించాడు. ఈ క్రమంలో ఈ నెల 9న కారులో బాలికను, ఆమె తల్లిని కడపకు తీసుకొచ్చారు. అయితే వెంకటేష్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో బాలికను, ఆమె తల్లిని వల్లూరులోని విజయ్‌కుమార్ స్నేహితురాలు భాగ్యలక్ష్మి ఇంటికి తీసుకెళ్లారు. అయితే భాగ్యలక్ష్మి కొడుకు నాగ సాయి ప్రణవ్‌కు వీరిపై అనుమానం వచ్చింది. తన తల్లితో విజయ్‌కుమార్ సన్నిహితంగా ఉండటంతో అసలు వచ్చినవారెవరని ఆరా తీశాడు.
దీంతో క్షుద్రపూజలకు ప్రణవ్ అడ్డుగా ఉన్నాడని నిందితులు ఈ నెల 10న అతడిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. సాధ్యం కాకపోవడంతో హతమార్చేందుకు దాడి చేశారు. అయితే ప్రణవ్ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. నిందితులు పరారయ్యారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేసి నిందితులు విజయ్‌కుమార్, హేమంత్, సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే అనంతపురంలో నిర్వహించిన క్షుద్రపూజలపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆ కేసును అనంతపురానికి బదిలీ చేశారు. కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ కేసులో భాగ్యలక్ష్మి, వెంకటేష్ యాదవ్ పాత్రలపై లోతుగా దర్యాప్తు సాగిస్తున్నట్టు పేర్కొన్నారు.


