ఆస్తి కోసం బంధాలను మరిచిపోయిన ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. మంచాన పడ్డ తండ్రికి వైద్యం చేయిస్తానంటూ అందరినీ నమ్మబలికి తన వెంట తీసుకెళ్లాడు. ఆపై ప్రాణం పోయాక.. ఛీ కొట్టే పనికి తెగబడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటకు చేరడంతో వైరల్ అవుతోంది.
యూపీ లక్నోలోని ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే కొడుకు మహేంద్ర, కోడలు లక్ష్మి ఛత్రపాల్‌ను వేధించసాగారు. దీంతో ఆయన తన ముగ్గురు కుమార్తెల వద్ద ఉంటూ జీవనం సాగించారు. ఈ క్రమంలో.. ఓరోజు తన ఆస్తిని కూతుళ్లకు సమానంగా పంచుతున్నానని, కొడుకు-కోడలును బహిష్కరిస్తున్నట్లు పత్రిక ప్రకటన కూడా ఇచ్చారు. ఈ పరిణామంతో మహేంద్ర, అతని భార్య రగిలిపోయారు.
అయితే జులై 7న ఛత్రపాల్ ఆరోగ్యం క్షీణించడంతో మహేంద్రకు అతని సోదరి సమాచారం ఇచ్చింది. దీంతో మహేంద్ర తన కుటుంబంతో కలిసి గ్రామానికి వచ్చి, వైద్యం చేయిస్తానంటూ తండ్రిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ రెండు రోజులకే అంటే జులై 9న ఛత్రపాల్ మృతి చెందారు.
తండ్రి అంత్యక్రియల కోసం గ్రామానికి చేరుకున్న కుమార్తెలకు మరో షాక్ ఎదురైంది. బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మహేంద్ర తన మృత తండ్రి బొటనవేలిని ఖాళీ కాగితాలపై ముద్రిస్తున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ పత్రాలపై తీసుకున్న వేలిముద్రలను భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకుంటారోనని అనుమానం వ్యక్తం చేశారు.
ఆపై ఊహించిందే జరిగింది. ఆస్తంతా తనదేనంటూ గొడవకు దిగాడు మహేంద్ర. దీంతో ఛత్రపాల్ కూతుళ్లు పోలీసులను ఆశ్రయించారు. తండ్రి శవంతో ఖాళీ పేపర్లపై వేలిముద్ర వేయించుకున్న దృశ్యాల్ని పోలీసులకు సమర్పించారు. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.


