కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత | Union Minister JP Nadda Hospitalised at AIIMS Delhi Following Health Concerns | Sakshi
Sakshi News home page

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత

Aug 14 2026 12:44 PM | Updated on Aug 14 2026 1:01 PM

JP Nadda Hospitalised After Health Concerns

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు.  దీంతో ఆయనను ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)కు తరలించారు. వైద్యులు ఆయనకు పలు వైద్య పరీక్షలు నిర్వహించగా, అందులో భాగంగా కరోనరీ యాంజియోగ్రఫీ పరీక్ష కూడా చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. 

ఎయిమ్స్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జేపీ నడ్డాకు ఆగస్టు 13న(గురువారం) అస్వస్థత కారణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండె సంబంధిత సమస్యలను గుర్తించేందుకు కరోనరీ యాంజియోగ్రఫీతో పాటు పలు పరీక్షలు చేపట్టారు.

కార్డియాలజీ విభాగంలో పరిశీలన
ప్రస్తుతం జేపీ నడ్డా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయనను ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. “జేపీ నడ్డాకు అసౌకర్యంగా అనిపించడంతో పరీక్షలు నిర్వహించాం. కరోనరీ యాంజియోగ్రఫీ సహా పలు పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కార్డియాలజీ విభాగంలో పరిశీలనలో ఉన్నారు” అని ఎయిమ్స్‌ తన ప్రకటనలో వెల్లడించింది.

ఇంకా వైద్యుల పర్యవేక్షణలో..
నడ్డా ఆరోగ్య పరిస్థితిపై అధికారిక వర్గాలు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెబుతున్నాయి. వైద్యుల సూచనల మేరకు ఆయనకు చికిత్స, పర్యవేక్షణ కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా గతంలో బాధ్యతలు నిర్వహించిన నడ్డా(65).. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో చురుకుగా పాల్గొన్న ఆయన.. అటు జంతర్‌ మంతర్‌ నిరసనల సమయంలో సీజేపీ ప్రతినిధులతోనూ కేంద్రం తరఫున చర్చల్లో పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులు, అభిమానులు నడ్డా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement