కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు బిగ్ రిలీఫ్ లభించింది. తొక్కిసలాట బాధిత కుటుంబాలకు తమిళనాడు సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయంలో ఈ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. కరూర్ బాధిత కుటుంబాలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం సరైంది కాదని ఈ ఉద్యోగాలు చెల్లవని ఈ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది.
కాగా గతేడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో టీవీకే నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో తొక్కిసలాట జరిగి 41మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలో గత నెలలో సీఎం విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబాలలోని 32 మందికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలను అందించారు.
ఆ నియామకాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు కరూర్ బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ అందించిన ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు చెల్లవని స్పష్టం చేసింది. రాజ్యాంగ పరిమితులకు లోబడే వ్యవహరించాలని ఆదేశించింది. బాధితులకు ఆర్ధిక సాయం అందించవచ్చు. కానీ ఉద్యోగం ఇవ్వడం సమంజసం కాదని తెలిపింది. ప్రభుత్వ బస్సుల్లో మరణించినవారికి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉద్యోగం అనేది అర్హత, నిర్దేశిత నియామక ప్రక్రియ (TNPSC వంటి పరీక్షలు) ద్వారా రావాలే తప్ప, ఇలా ఉచితంగా పంచేది కాదని స్పష్టం చేసింది.
ఇది సాధారణ అభ్యర్థుల సమానత్వ హక్కును దెబ్బతీస్తుందని పేర్కొంది. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం ఎంతైనా ఆర్థిక సాయం అందించుకోవచ్చని, కానీ రాజ్యాంగ నిబంధనలు, పరిమితులను దాటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని కోర్టు తేల్చి చెప్పింది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పెట్టేది కాదని వ్యాఖ్యానిస్తూ కరూర్ బాధితులకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవని తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టేవిధించింది. దీంతో కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట లభించింది.


