‘‘మధ్యలో మీ జోక్యమేంటి?’’.. చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ సీరియస్‌ | CJI Surya Kant Hits Back at BCI Over NALSAR Students Row Support CJP | Sakshi
Sakshi News home page

‘‘మధ్యలో మీ జోక్యమేంటి?’’.. చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ సీరియస్‌

Aug 14 2026 11:34 AM | Updated on Aug 14 2026 11:50 AM

NALSAR Row: CJI Hits Back at BCI Support CJP Students

సాక్షి, న్యూఢిల్లీ: నల్సార్‌ లా వర్సిటీ వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ వివాదంపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ విద్యార్థులే తప్పు చేసినా.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేలా నిరసన తెలిపే హక్కు వాళ్లకు ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంలో బీసీఐ జోక్యం చేసుకోవడం పూర్తిగా అనవసరమని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీలో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పాల్గొనాల్సిన కార్యక్రమంపై నిరసన వ్యక్తం అయ్యింది. జంతర్‌ మంతర్‌ విద్యార్థుల లాఠీఛార్జి పిటిషన్‌ విచారణలో ఆయన వైఖరి సరిగా లేదని.. ఆయన నుంచి పట్టా అందుకోవడం తమకు ఇష్టం లేదని చెబుతూ వర్సిటీ నిర్వాహకులకు వాళ్లు సైన్‌ పిటిషన్‌ అందజేశారు. ఈ వ్యవహారాన్ని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పరువు వ్యవహారంగా తీసుకుంది. 

ఈ నేపథ్యంలో.. 2026 బ్యాచ్‌ న్యాయ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయాలని రాష్ట్ర బార్‌ కౌన్సిళ్లకు బీసీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విద్యార్థులందరినీ ఒకే కోణంలో చూడటం సరికాదని, కొందరి చర్యలకు మొత్తం బ్యాచ్‌ను బాధ్యులను చేయడం అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీఐ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు కాగా.. విచారణ సందర్భంగా బీసీఐ జోక్యంపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

బీసీఐకి నోటీసులు
సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారణ జరిపింది. నల్సార్‌ 2026 బ్యాచ్‌ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ వివాదంపై సుప్రీంకోర్టు బీసీఐకి నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు, ఫ్యాకల్టీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అసలు ఆ ఆదేశాలు ఎందుకు ఇచ్చారో వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది. అయితే ఇప్పటికే వివాదాస్పద ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లు బీసీఐ కోర్టుకు తెలిపింది. ఈ తరుణంలో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

‘‘ఇది విద్యార్థులు–నా మధ్య విషయం’’
నల్సార్‌ విద్యార్థులపై బీసీఐ తీసుకున్న చర్యలపై స్పందించిన సీజేఐ.. ఇది విద్యార్థులకు, తనకు మధ్య ఉన్న అంశమని పేర్కొన్నారు. విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని అన్నారు. నిరసన వ్యక్తం చేశారనే కారణంతో వారి భవిష్యత్‌పై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకోవడం సరికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘విద్యార్థుల హక్కుల పరిరక్షణే ముఖ్యం’’
బీసీఐ చైర్మన్‌ మానన్‌ మిశ్రా కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు. తొందరపాటులో ఆదేశాలు ఇచ్చామని, విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే 40 నిమిషాల్లో సవరించామని పేర్కొన్నారు. బీసీఐ, విద్యార్థుల హక్కుల విషయంలో ఎలాంటి ఘర్షణ లేదని స్పష్టం చేశారు. ‘‘అభిజీత్‌ దీప్కే అయినా, సౌరవ్‌ దాస్‌ అయినా.. మా లక్ష్యం ఒక్కటే. విద్యార్థుల హక్కులను కాపాడటం’’ అని మానన్‌ మిశ్రా వ్యాఖ్యానించారు.

‘కాక్రోచ్‌’ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
ఈ వివాదానికి నేపథ్యం సీజేఐ సూర్యకాంత్‌ గతంలో చేసిన బొద్దింకల వ్యాఖ్యలు. ఆయన చేసిన ‘కాక్రోచ్‌’ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చకు దారితీశాయి. దీనిపై కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నేతృత్వంలో ఆన్‌లైన్‌ ప్రచారం, ఆందోళనలు జరిగాయి.. అయితే తాను నకిలీ డిగ్రీలతో వస్తున్న న్యాయవాదుల్ని ఉద్దేశించే అన్నానని ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చారు.  అయినప్పటికీ జెన్‌జీ ఉద్యమం చల్లారలేదు. తాజా బీసీఐ ఆదేశాల అనంతరం CJP నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. ‘‘అన్ని లీగల్‌ కాక్రోచ్‌లు ఒక్కటైతే?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. బీసీఐ చైర్మన్‌పైనా విమర్శలు కూడా చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

బీసీఐకి సీజేఐ స్పష్టమైన సంకేతం
నల్సార్‌ వ్యవహారంలో సీజేఐ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థుల అభిప్రాయ స్వేచ్ఛ, నిరసన హక్కులను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు న్యాయ వ్యవస్థకు సంబంధించిన సంస్థలు పరస్పర గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరాన్ని ఈ పరిణామం మరోసారి తెరపైకి తెచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement