‘లీగల్ కాక్రోచెస్‌ ఏకమైతే?.. నల్సార్ వివాదంపై అభిజిత్ సంచలనం! | CJP founder Abhijeet Dipke recalls first post amid CJI-NALSAR row | Sakshi
Sakshi News home page

‘లీగల్ కాక్రోచెస్‌ ఏకమైతే?.. నల్సార్ వివాదంపై అభిజిత్ సంచలనం!

Aug 14 2026 5:18 AM | Updated on Aug 14 2026 5:22 AM

CJP founder Abhijeet Dipke recalls first post amid CJI-NALSAR row

న్యూఢిల్లీ: బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా , నల్సార్ లా యూనివర్సిటీ వివాదంపై ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పందించారు. గతంలో  కాక్రోచ్‌ జనతా పార్టీ ఉద్యమానికి పునాది వేసిన నినాదాన్ని ఇప్పుడు న్యాయవ్యవస్థకు ముడిపెడుతూ ఆయన సరికొత్త సామాజిక చర్చకు తెరలేపారు.

నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని ఆ వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు వ్యతిరేకించారు. ఆ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరుతూ 2026 బ్యాచ్‌కు చెందిన దాదాపు 70 మంది విద్యార్థులు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్లకు అధికారికంగా విజ్ఞప్తి లేఖను సమర్పించారు. ఆ తర్వాత, వీరి నిర్ణయానికి మద్దతుగా తదుపరి బ్యాచ్‌లకు చెందిన మరో 380 మంది విద్యార్థులు కూడా డిమాండ్‌పై సంతకాలు చేశారు. ఆ రకంగా, ఆ తర్వాత మొత్తం మీద వ్యతిరేకత వ్యక్తం చేసిన విద్యార్థుల సంఖ్య దాదాపు 450 కి చేరింది.

ఈ క్రమంలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) నల్సార్ 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లు ఎవరినీ లాయర్లుగా ఎన్‌రోల్ చేసుకోవద్దంటూ అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లను ఆదేశించింది. ఈ సామూహిక నిషేధంపై తీవ్ర విమర్శలు రావడంతో, కొన్ని గంటల వ్యవధిలోనే బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా ఆ ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు.  విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే నిషేధాన్ని ఎత్తేసినట్లు ఆయన పేర్కొన్నారు.

బీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై అభిజీత్ దిప్కే ఎక్స్ వేదికగా స్పందించారు. ‘న్యాయవాద రంగంలోని కాక్రోచ్‌లు అంతా ఒకటైతే ఎలా ఉంటుంది?’ అంటూ ప్రశ్నించారు. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ దేశ యువతను ఉద్దేశించి కాక్రోచ్‌ అని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆ సమయంలో అమెరికాలో ఉన్న దిప్కే.. ‘దేశంలోని బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది?’ అంటూ ప్రారంభించిన సోషల్ మీడియా పోస్ట్, ఆ తర్వాత 'కాక్రోచ్‌ జనతా పార్టీ' ఏర్పాటుకు బీజం పడింది. పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలపై ఈ సంస్థ దేశవ్యాప్తంగా నిర్వహించిన భారీ విద్యార్థి నిరసనల కారణంగానే అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ అదే సీజేఐ వివాదంలోకి రావడంతో అభిజీత్ దిప్కే ఈ 'లీగల్‌ కాక్రోచ్‌ 'ను వాడారు. అంతేకాకుండా 2012 నుండి బీసీఐ చైర్మన్‌గా కొనసాగుతున్న మనన్ కుమార్ మిశ్రా రాజీనామా చేయాలంటూ సరికొత్త ప్రచారానికి ఆయన తెరలేపారు.  

బీసీఐ నిషేధాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ, ఆ లేఖను పూర్తిగా వెనక్కి తీసుకోలేదని సీజేపీ ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్ ఆరోపించారు. నిరసన తెలిపిన విద్యార్థులు, వారికి సహకరించిన అధ్యాపకులపై విచారణ జరిపి పేర్లు సేకరించాలని బీసీఐ కొత్త లేఖలో పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. శాంతియుతంగా అసమ్మతిని వ్యక్తం చేసిన విద్యార్థులపై జరుగుతున్న వేధింపులను ఆపాలని, బీసీఐ తన ఆదేశాలను పూర్తిగా ఉపసంహరించుకోకపోతే లా విద్యార్థులు, సీనియర్ న్యాయవాదులతో కలిసి బీసీఐ కార్యాలయం, చైర్మన్ నివాసం వద్ద భారీ నిరసనలు చేపడతామని సీజేపీ హెచ్చరించింది. మనన్ కుమార్ మిశ్రా అధికార బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, తాము ఈ అణచివేతపై నిశ్శబ్దంగా ఉండబోమని సీజేపీ స్పష్టం చేసింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement