ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
నిరవధికంగా వాయిదా పడిన ఉభయ సభలు
ఈసారి రాజ్యసభ, లోక్‌సభల్లో భారీగా పడిపోయిన ఉత్పాదకత
దిగువ సభలో 19 శాతం, ఎగువ సభలో 39 శాతం
నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయ విరాళాల చోరీపై విపక్షాల నిరసనలు
చర్చ లేకుండానే బిల్లులకు ఆమోదం.. మొత్తం 12 బిల్లులు పాస్
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయ విరాళాల చోరీపై నిరసనలు, నినాదాలు, అధికార, విపక్షాల మధ్య వాగ్వాదాలు, సవాళ్లతో దద్దరిల్లిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈసారి వర్షాకాల సమావేశాలు దాదాపు నిష్ఫలంగా మిగిలిపోయాయి. రాజ్యసభ, లోక్‌సభల్లో ఉత్పాదకత కనిష్ట స్థాయికి పడిపోయింది.
ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను నిమిషాల వ్యవధిలోనే ఆమోదించడం గమనార్హం. నిత్యం పార్లమెంట్‌లో ప్రతిష్టంభన నెలకొనడం, సభలు పదేపదే వాయిదా పడడం పరిపాటిగా మారింది. ఇందుకు ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని అధికార పక్షం తేలి్చచెప్పింది. అధికార పక్ష వైఖరి వల్లే వర్షాకాల సమావేశాలు స్తంభించిపోయాయని ప్రతిపక్ష ఎంపీలు మండిపడ్డారు. ప్రధానమంత్రి గానీ, హోంమంత్రి గానీ ఒక్కసారి కూడా సభా కార్యకలాపాలకు హాజరుకాకపోవడం ‘అపూర్వం’ అని ఎద్దేవా చేశారు.
ఒక్క బిల్లుపైనే ఉభయ సభల్లో చర్చ
పార్లమెంట్ 25 రోజులపాటు సమావేశం కాగా, లోక్‌సభ 19 శాతం పనితీరును నమోదు చేసింది. రాజ్యసభలో అది 39 శాతంగా నమోదైంది. వర్షాకాల సమావేశాల్లో లోక్‌సభలో 12, రాజ్యసభలో 12 బిల్లులు ఆమోదం పొందాయి. అయితే, కేవలం ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు–2026’పై మాత్రమే ఉభయ సభల్లోనూ చర్చలు జరిగాయి. ఇతర బిల్లులు పెద్దగా చర్చకు నోచుకోలేదు. పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై పోలీసుల దమనకాండ, అయోధ్య రామమందిర విరాళాల అపహరణపై ఉభయ సభల్లో తీవ్రస్థాయిలో రగడ జరిగింది.
విద్యార్థులపై పోలీసుల దాడి పట్ల ప్రభుత్వం సమాధానం చెప్పాలని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు నిలదీశాయి. ప్రతిపక్షాల నినాదాలు, వాదోపవాదాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ సభల కార్యకలాపాలకు ప్రతిరోజూ అంతరాయం కలిగింది. పార్లమెంట్ భవనం ప్రధాన ద్వారం వద్ద ప్రతిపక్షాలు నిత్యం నిరసన వ్యక్తంచేశాయి. అదే ప్రదేశంలో అధికార ఎన్డీఏ ఎంపీలు కూడా నిరసనకు దిగారు. కనీసం రెండు సందర్భాల్లో ఇరు వర్గాలు ముఖాముఖి తలపడ్డాయి. నీట్ పేపర్ లీక్ విషయంలో విద్యార్థుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.
స్పీకర్ తేనీటి విందుకు విపక్షాల గైర్హాజరు
లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేసిన సాంప్రదాయ తేనీటి విందును కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు బహిష్కరించాయి. ఈ కార్యక్రమానికి విపక్షాల నుంచి డీఎంకే నాయకురాలు కనిమొళి హాజరయ్యారు. స్పీకర్ చాంబర్‌లో జరిగిన తేనీటి విందులో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర సీనియర్ నాయకులు, మంత్రులు పాల్గొన్నారు.
రాజ్యసభలో చైర్మన్ ఏర్పాటు చేసిన తేనీటి విందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈసారి కీలక బిల్లులపై విస్తృత చర్చలు జరగకపోవడంతో ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాల వైఖరిలో మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
సభ గౌరవాన్ని నిలబెట్టాలి: రాధాకృష్ణన్
రాజ్యసభలో చివరి రోజు జీరో అవర్, ప్రశ్నోత్తరాలను రద్దుచేశారు. గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. అనంతరం చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ మాట్లాడారు. ఈ సమావేశాల సమయంలో సభా కార్యకలాపాలకు అంతరా యం కలిగిన తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులు ఈ మహోన్నత సభ గౌరవాన్ని నిలబెట్టాలని, భారత ప్రజాస్వామ్య అత్యున్నత సంప్రదాయాలకు అనుగుణంగా తమ పార్లమెంటరీ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు.
జూలై 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాల్లో, అంతరాయాల కారణంగా ఉత్పాదకత కేవలం 39 శాతంగా ఉన్నప్పటికీ, 12 బిల్లులు ఆమోదం పొందడం లేదా వెనక్కి పంపడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశాలు నిరంతర గందరగోళం, తరచూ అంతరాయాలతో నిండిపోయి, సభా కార్యకలాపాల ను పదేపదే పట్టాలు తప్పించడం విచారకరమని అన్నారు. విలువైన సభా సమయం వృథా కావడం వల్ల జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై అర్థవంతమైన చర్చ, వాదోపవాదాలు జరగలేదని వెల్లడించారు. మనమందరం సమష్టిగా సభా కార్యకలాపాల్లో పాల్గొని, విలువైన సూచనలు ఇచ్చి, అర్థవంతమైన చర్చలు జరిపి ఉంటే పరిస్థితులు కచి్చతంగా భిన్నంగా ఉండేవని వ్యాఖ్యానించారు. వందేమాతరం అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
లోక్‌సభలో వందేమాతరం ఆరు చరణాల ఆలాపన
లోక్‌సభ గురువారం ఉదయం ప్రారంభమైన వెంటనే జాతీయ గీతం వందేమాతరంలోనిమొత్తం ఆరు చరణాలను వినిపించారు. లోక్‌సభ చరిత్రలో జాతీయ గీతాన్ని పూర్తిగా వినిపించడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. సభ పనితీరు, ఉత్పాదకతను వివరిస్తూ సాధారణంగా చేసే ముగింపు ప్రసంగాన్ని స్పీకర్ చదివి వినిపించలేదు. చివరి రోజు కూడా సభలో ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ, మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు హాజరయ్యారు.
అంకెల్లో సభ
→ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ మొత్తం 37 గంటల 49 నిమిషాలు మాత్రమే
పనిచేసింది. 39.17 శాతం ఉత్పాదకత నమోదయ్యింది.
→ మొత్తం 285 స్టార్డ్ ప్రశ్నలను లేవనెత్తారు. 380 జీరో అవర్ సమర్పణలు, 380 ప్రత్యేక ప్రస్తావనలు ఉన్నాయి. వాటిలో 16 ప్రశ్నలు, 52 జీరో అవర్ సమర్పణలు, 93 ప్రత్యేక ప్రస్తావనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోగలిగారు.
→ లోక్‌సభ 19 రోజులు సమావేశమైంది. కేవలం 15 గంటల 36 నిమిషాలపాటు పని చేసింది. ఉత్పాదకత గత రెండు దశాబ్దాల్లో అత్యల్పంగా 19 శాతమే నమోదు కావడం గమనార్హం.


