నిబంధనను తప్పనిసరి చేయనున్న ఎయిర్‌ఇండియా, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్
న్యూఢిల్లీ: ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ఎయిర్‌ఇండియా, ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు కీలక నిర్ణయాన్ని అమలుచేయనున్నాయి. ఇకపై దేశీయ, అంతర్జాతీయ విమానాలు నడిపి ల్యాండ్ అయ్యాక నిర్దేశిత స్థావరాల్లో పైలట్లకు మత్తుపదార్థాల నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు రెండు సంస్థలు గురువారం ప్రకటించాయి.
పది రోజుల క్రితం ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ఇండియా విమానం మార్గమధ్యంలో హఠాత్తుగా 300 అడుగుల దిగువకు దూసుకురావడంతో విమానంలోని ప్రయాణికుల్లో కొందరు గాయపడ్డారు. ఈ ఘటనలో ఆ విమానంలో ‘పైలట్–ఇన్–కమాండ్’గా విధుల్లో ఉన్న పైలట్‌కు మత్తుపదార్థాల నిర్ధారణ పరీక్ష చేయగా పాజిటివ్‌గా వచ్చింది.
గంజాయి సేవించినట్లు పరీక్షలో తేలడంతో విమానయాన సంస్థలు అప్రమత్తమయ్యాయి. టాటా గ్రూప్‌కు చెందిన ఈ రెండు సంస్థల్లో మొత్తంగా 5,000 మంది పైలట్లు ఉన్నారు. వీరందరికీ విమానం నడిపాక ప్రతిసారీ డ్రగ్ టెస్ట్ చేయనున్నారు. గురుగ్రామ్‌లోని ఎయిర్‌ఇండియా అకాడమీతోపాటు పైలట్లకు బ్రీఫింగ్ సెంటర్లు, ఎయిర్‌లైన్ ఆఫీస్‌లు, పైలట్ల హోమ్ బేస్‌లలో కుదిరిన చోట వీళ్లకు టెస్ట్‌లు చేయనున్నారు.
గత నిబంధనల ప్రకారం ఏదైనా విమానయాన సంస్థలోని పైలట్లకు ఏడాదికి ర్యాండమ్‌గా 10 శాతం మందికి చొప్పున డ్రగ్ టెస్ట్ చేసేవాళ్లు. ఇకపై అందరికీ టెస్ట్ నిర్వహిస్తారు. ఫుకెట్–ఢిల్లీ విమాన ఘటనతో పైలట్ల మానసిక, శారీరక దృఢత్వంపై మరోసారి చర్చ మొదలైంది. వీటికి చెక్‌పెట్టేందుకు సైకోయాక్టివ్ సబ్‌స్టాన్సెస్ టెస్ట్‌లు ఎప్పటికప్పుడు చేసేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు సిద్ధపడ్డాయి. తమ ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తామని ఈ సందర్భంగా ఎయిర్‌ఇండియా పేర్కొంది.


