‘సీరియస్‌ ఇన్సిడెంట్‌..’ ఎయిరిండియా ఘటనలో కొత్త ట్విస్ట్‌ | Air India Flight 300 Foot Fall: Technical Glitches Raise Fresh Concerns | Sakshi
Sakshi News home page

‘సీరియస్‌ ఇన్సిడెంట్‌..’ ఎయిరిండియా ఘటనలో కొత్త ట్విస్ట్‌

Aug 11 2026 7:17 AM | Updated on Aug 11 2026 7:22 AM

Air India Flight 300 Foot Fall: Technical Glitches Raise Fresh Concerns

ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్‌ ఇండియా విమానం గాల్లో ఒక్కసారిగా 300 అడుగుల ఎత్తు కోల్పోయిన ఘటనలో కొత్త అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. తొలుత తీవ్ర టర్బులెన్స్‌ కారణంగా భావించిన ఈ ఘటనలో.. విమానంలోని సాంకేతిక వ్యవస్థల పనితీరుపై ఇప్పుడు దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. ప్రయాణ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, నమోదైన హెచ్చరికలు పలు ప్రశ్నలకు తావిస్తున్నాయి. అసలు ఏం జరిగిందన్నది తేల్చేందుకు ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (AAIB) లోతైన విచారణ కొనసాగిస్తోంది.

ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏ320 విమానం AI2379 ఆగస్టు 4న ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ప్రయాణం సాధారణంగానే సాగుతుండగా.. అకస్మాత్తుగా విమానం ఎత్తు కోల్పోయింది. క్షణాల్లో జరిగిన ఈ పరిణామంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే పైలట్లు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్‌ అయింది.

ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది కలిపి 17 మంది గాయపడ్డారు. విమానం ఒక్కసారిగా కిందకు జారిన సమయంలో క్యాబిన్‌లో గందరగోళ పరిస్థితి నెలకొందని ప్రయాణికులు తెలిపారు. కొందరు సీట్ల నుంచి కదిలిపోయారని, ఆకస్మిక కుదుపులతో భయానికి గురయ్యారని చెప్పారు.

సాంకేతిక లోపాలపై దర్యాప్తు
ఈ ఘటనపై దర్యాప్తులో భాగంగా విమానంలోని పలు సాంకేతిక అంశాలు ఇప్పుడు పరిశీలనలోకి వచ్చాయి. ప్రయాణ సమయంలో విమాన వ్యవస్థలు ఎలా స్పందించాయి? ఏ హెచ్చరికలు నమోదయ్యాయి? ఎత్తు కోల్పోయిన సమయంలో కంట్రోల్‌ సిస్టమ్స్‌ పనితీరు ఎలా ఉంది? అనే అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

ఆటోపైలట్‌ డిస్‌కనెక్ట్‌.. మాన్యువల్‌ కంట్రోల్‌లోకి పైలట్‌
దర్యాప్తు వివరాల ప్రకారం.. విమాన ప్రయాణ సమయంలో ఆటోపైలట్‌ వ్యవస్థ డిస్‌కనెక్ట్‌ అయినట్లు తెలుస్తోంది. దీంతో కో–పైలట్‌ మాన్యువల్‌గా విమాన నియంత్రణ చేపట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్లైట్‌ కంట్రోల్‌ వ్యవస్థకు సంబంధించిన హెచ్చరికలు కనిపించినట్లు సమాచారం. కొన్ని ఇండికేటర్‌ స్విచ్‌లు తాత్కాలికంగా పనిచేయకపోవడం వంటి అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

హైడ్రాలిక్‌ వ్యవస్థలపైనా అనుమానాలు
విమాన నియంత్రణలో కీలకమైన హైడ్రాలిక్‌ వ్యవస్థల్లోనూ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. విమానం దిశను నియంత్రించడం, రెక్కల కదలికలు, ల్యాండింగ్‌ వ్యవస్థల పనితీరులో హైడ్రాలిక్‌ వ్యవస్థల పాత్ర కీలకం. అయితే ఈ వైఫల్యాలు విమానం 300 అడుగుల ఎత్తు కోల్పోవడానికి కారణమయ్యాయా? లేదంటే ఇతర సాంకేతిక సమస్యలతో కలిసి ప్రభావం చూపించాయా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

‘సీరియస్‌ ఇన్సిడెంట్‌’గా డీజీసీఏ గుర్తింపు
ఈ ఘటనను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) తీవ్ర ఘటనగా వర్గీకరించింది. దీనిపై AAIB దర్యాప్తు చేపట్టింది. విమానంలోని ఫ్లైట్‌ డేటా రికార్డర్‌, కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌, ఇతర సాంకేతిక వ్యవస్థలను అధికారులు విశ్లేషిస్తున్నారు. విమానం ఎప్పుడు ఎత్తు కోల్పోయింది? ఆ సమయంలో ఏ వ్యవస్థలు పనిచేశాయి? లోపాలు ఏ క్రమంలో వచ్చాయి? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఎయిర్‌బస్‌, ఫ్రాన్స్‌ నిపుణుల సహకారం
ఏ320 విమానం కావడంతో తయారీ సంస్థ ఎయిర్‌బస్‌ నిపుణులు కూడా విచారణలో భాగమవుతున్నారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఫ్రాన్స్‌కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ BEA సాంకేతిక సహకారం అందించనుంది. విమాన సాఫ్ట్‌వేర్‌, కంట్రోల్‌ సిస్టమ్స్‌, హార్డ్‌వేర్‌ పనితీరును నిపుణులు పరిశీలించనున్నారు.

పైలట్ల పరీక్షలపైనా దృష్టి
ఘటన తర్వాత నిబంధనల ప్రకారం ఇద్దరు పైలట్లకు మాదకద్రవ్య పరీక్షలు నిర్వహించారు. పైలట్‌ ఇన్‌ కమాండ్‌ నమూనాలో వచ్చిన ప్రాథమిక ఫలితం(విఫలమైనట్లు వచ్చింది!)పై మరింత నిర్ధారణ అవసరమని అధికారులు తెలిపారు. తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రాలేమని స్పష్టం చేశారు. ఇద్దరు పైలట్లను తాత్కాలికంగా ఫ్లయింగ్‌ డ్యూటీల నుంచి తప్పించారు.

విమానం ఎత్తు కోల్పోయి కుదుపులకు లోనుకావడానికి కేవలం వాతావరణ పరిస్థితులే కారణమా? లేదంటే సాంకేతిక లోపాలు కూడా ప్రభావం చూపించాయా? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఒకేసారి పలు విమాన వ్యవస్థలకు సంబంధించిన అంశాలు తెరపైకి రావడంతో దర్యాప్తు మరింత కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement