ఇండోనేసియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌ల్లో మృతులు వెయ్యికిపైనే
శ్రీలంక అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధాని మోదీ
జకార్తా/న్యూఢిల్లీ: ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంకల్లో ఇటీవల సంభవించిన వర్షాలు, వరదలకు సంభవించిన ఘటనల్లో మరణాలు వెయ్యి దాటేశాయి. గల్లంతైన వారి సంఖ్య వందల్లో ఉంది. ఆయా దేశాల్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వరదలు, కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో కనీసం 604 మంది చనిపోయారని అధ్యక్షుడు ప్ర»ొవొ సుబియాంతో తెలిపారు.
వేలాది మంది నిరాశ్రయులుగా మారారని, ఇంకా 464 మంది జాడ తెలియాల్సి ఉందని వెల్లడించారు. గత వారం వరదలు సంభవించిన కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ సహాయక బృందాలు చేరుకునేందుకు వీలు కావడం లేదన్నారు. రోడ్లు, సమాచార వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించారు. తీవ్రంగా దెబ్బతిన్న నార్త్ సుమత్ర, వెస్ట్ సుమత్ర, ఆసెహ్ ప్రావిన్స్‌లను ఆయన సోమవారం పర్యటించి, బాధితులను పరామర్శించారు.
అదేవిధంగా, థాయ్‌లాండ్‌లో సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 176 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 1.5 లక్షల కుటుంబాలపై వర్షాల ప్రభావం పడింది. దీంతో, ప్రభుత్వం మొదటి విడతలో తీవ్రంగా నష్టపోయిన 26 వేల మందికి 74 లక్షల డాలర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు, శ్రీలంకలో దిత్వా తుపాను సంబంధిత ఘటనల్లో 366 మంది చనిపోగా 367 మంది గల్లంతయ్యారని అధికారులు సోమవారం ప్రకటించారు.
సుమారు 2.18 లక్షల మందికి ప్రభుత్వం తుఫాను షెల్టర్లలో ఆశ్రయం కలి్పంచింది. తేయాకు తోటలు ఎక్కువగా ఉండే కొండప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. భారత ప్రధాని మోదీ సోమవారం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకెతో ఫోన్‌లో మాట్లాడారు. దిత్వా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలకు అవసరమైన సాయం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. భారత ప్రభుత్వం శ్రీలంకకు ఇప్పటికే రెండు విడతలుగా ఆహారం, అత్యవసర వస్తు సామగ్రితోపాటు సిబ్బందిని కూడా పంపించడం తెల్సిందే.


