పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ..ప్రస్తుతం ఈ మాజీ క్రికెటర్ అంశం పాకిస్థాన్ లోనే కాకుండా ఇతర దేశాలలోనూ చర్చనీయాంశం అయ్యింది. పాకిస్థాన్ మాజీ ప్రధానిని జైలులోనే చంపేశారని పుకార్లు రావడంతో ఆ దేశంలో నిరసనలు చెలరేగాయి. ఇమ్రాన్ ఖాన్ ని కలవడానికి అనుమతి ఇవ్వాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ ను ఆమె సోదరి ఉజ్మా ఖానుమ్ జైలులో కలిసింది.
మాజీ క్రికెటర్, పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నాడా లేదా అనే అంశం ప్రస్తుతం ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. జైలులో ఉన్న ఆయనను కలవడానికి కొంతకాలంగా అక్కడి అధికారులు నిరాకరించడం, దీనికి తోడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని పుకార్లు రేగడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇవ్వాలని, ఆయనను కలవడానికి అనుమతించాలని పట్టుబట్టడంతో ఎట్టకేలకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆయన కుటుంబ సభ్యులకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది.
మంగళవారం సాయంత్రం ఇమ్రాన్ ఖాన్ ని ఆమె సోదరి డాక్టర్ ఖానుమ్ జైలులో కలిసింది. అతనితో 20 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ" దేవుడి దయ వల్ల ఇమ్రాన్ ఖాన్ బాగానే ఉన్నారు. కానీ మానసికంగా ఆయనను చాలా వేధిస్తున్నారు. ప్రతిరోజు సెల్ లో నిర్భంధిస్తున్నారు. ఆయనను ఎవరితోనూ కలవనివ్వడం లేదు. కేవలం కొద్దినిమిషాలు మాత్రమే ఆయనను బయిటకి వదులుతున్నారు". అని తెలిపింది.
తాను జైలులో ఉండడానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కారణమని ఆయన ఇమ్రాన్ అన్నారని ఆమె తెలిపింది. మెుత్తానికి ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నాడని తెలియడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని 2023లో అరెస్టు చేశారు. దేశద్రోహం, హింస, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం ఇలా ఆయనపై 121 కేసులు మోపారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్ లో హింస చేలరేగింది. ఆయన మద్ధతు దారులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టడంతో 500మందికి పైగా పీటీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.


