విదేశీ విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా వీసా నిబంధనలు సవాలుగా మారుతున్నాయి. అమెరికా వీసా విధానంలో వస్తున్న మార్పుల కారణంగా విదేశీ విద్యా రుణాల మార్కెట్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఎడ్యుకేషన్ లోన్ ప్లాట్‌ఫారమ్‌ల గణాంకాల ప్రకారం, 2024తో పోలిస్తే 2025 సంవత్సరంలో విదేశీ విద్యా రుణాలు 30 నుంచి 50 శాతం వరకు క్షీణించాయి.
తగ్గుతున్న రుణాల పరిమాణం
అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆ దేశానికి సంబంధించిన రుణాల పరిమాణం ఏకంగా 60 శాతం పడిపోయింది. విద్యార్థులు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, తూర్పు యూరప్ దేశాల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ అమెరికా యూనివర్సిటీల స్థాయిలో రుణాల పరిమాణం ఉండటం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆర్‌బీఐ డేటా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన విదేశీ రిమిటెన్సుల గణాంకాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. విదేశీ విద్య కోసం భారత్ నుంచి పంపే నిధుల ప్రవాహంలో (రిమిటెన్సులు) స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా జనవరిలో ప్రారంభమయ్యే ‘స్ప్రింగ్ అడ్మిషన్ సీజన్’ను పరిశీలిస్తే.. 2024 జనవరిలో 449 మిలియన్ డాలర్లుగా ఉన్న రిమిటెన్సులు 2025 జనవరి నాటికి 368 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. అంటే ఈ కాలంలో సుమారు 18 శాతం మేర తగ్గుదల నమోదైంది.
అత్యధిక అడ్మిషన్లు జరిగే ఆగస్టు ‘ఫాల్ సీజన్’లో ఈ క్షీణత మరింత తీవ్రంగా ఉంది. 2024 ఆగస్టులో విదేశీ విద్యా అవసరాల కోసం 416 మిలియన్ డాలర్లు భారత్ నుంచి వెళ్లగా, 2025 ఆగస్టు నాటికి ఆ మొత్తం 319 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ సీజన్‌లో ఏకంగా 23 శాతం తగ్గుదల కనిపిస్తోంది. ఇది విదేశీ విద్యా రుణ మార్కెట్‌పై ఉన్న ఒత్తిడిని, విద్యార్థుల విదేశీ ప్రయాణాల్లో వచ్చిన మార్పును స్పష్టంగా సూచిస్తోంది.
(గమనిక: పైన తెలిపిన గణాంకాల్లో విద్యార్థుల జీవన వ్యయం కూడా కలిసి ఉంది)
నిపుణుల హెచ్చరిక
అభివృద్ధి చెందిన దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వల్ల సమీప భవిష్యత్తులో విద్యా రుణాల వృద్ధి మందగించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇన్‌క్రెడ్ ఫైనాన్షియల్ తన ఆస్తుల నిర్వహణలో 24 శాతం విద్యా రుణాలు ఉండటంతో ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రాపర్టీ లోన్ల వంటి ఇతర విభాగాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది. విద్యా రుణాలిచ్చే బోర్డర్‌ప్లస్ కంపెనీ ఒకటి రెండు సంవత్సరాల వరకు కొత్త రుణాల మంజూరు బలహీనంగానే ఉంటుందని తెలిపింది.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి బ్యాంకులు.. అవాన్స్, క్రెడిలా వంటి ఎన్‌బీఎఫ్‌సీలు ఈ విభాగంలో ప్రధానంగా సర్వీసులు అందిస్తున్నాయి. అమెరికా వీసా విధానాల్లో సానుకూల మార్పులు వచ్చే వరకు ఈ రంగంలో ఇదే రకమైన స్తబ్దత కొనసాగే అవకాశం కనిపిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు?


