భారత వలసదారులపై కోపమెందుకు? | Anger toward Indian immigrants in US Here are main drivers | Sakshi
Sakshi News home page

భారత వలసదారులపై అమెరికాకు కోపమెందుకు?

Jan 16 2026 11:18 AM | Updated on Jan 16 2026 12:24 PM

Anger toward Indian immigrants in US Here are main drivers

అమెరికా అభివృద్ధిలో భాగస్వాములైన భారతీయ వలసదారులు ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా అత్యంత శాంతియుతమైన, విజయవంతమైన వర్గంగా పేరుగాంచిన భారతీయులపై ఇటీవల కాలంలో ఆన్‌లైన్ వేదికగా, రాజకీయంగా అసహనం పెరుగుతోంది. అమెరికాను వివిధ సంస్కృతుల కలయికగా అభివర్ణించే ‘మెల్టింగ్ పాట్’(Melting Pot- వివిధ సంస్కృతుల సమ్మేళనం) సిద్ధాంతానికి ఈ పరిణామాలు సవాలుగా మారుతున్నాయి.

ఆన్‌లైన్ వేదికలపై..

2025 నుంచి సోషల్ మీడియాలో భారతీయులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హెచ్‌-1బీ వీసా నిబంధనలపై జరుగుతున్న చర్చలు ద్వేషపూరిత వ్యాఖ్యలకు దారితీస్తున్నాయి. అమెరికా టెక్ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులు స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే తప్పుడు ప్రచారం ఊపందుకుంది. దీనికి తోడు కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగ మార్కెట్‌లో వస్తున్న మార్పులు కూడా వలసదారులపై వ్యతిరేకత పెరగడానికి కారణమవుతున్నాయి.

రాజకీయ దుమారం

ప్రస్తుత అమెరికా రాజకీయ పరిణామాలు భారతీయుల్లో మరింత అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. అక్కడి వైస్‌ ప్రెసిడెంట్‌ జేడీ వాన్స్‌ (JD Vance) గతంలో చేసిన ‘అధిక సంఖ్యలో ఉన్న వలసల వల్ల అమెరికా ప్రయోజనాలు నీరుగారుతున్నాయి’ అనే వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే, ఈ క్రమంలో ఆయన భార్య భారత సంతతికి చెందిన ఉషా వాన్స్‌ కూడా ఆన్‌లైన్‌లో ట్రోల్‌ అయ్యారు. నిక్ ఫ్యుయెంటెస్ వంటి తీవ్రవాద భావజాలం ఉన్న వ్యక్తులు ఉషా వాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. దీనిపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకుడు వివేక్ రామస్వామి ఘాటుగా స్పందించారు. ఇటువంటి ద్వేషపూరిత భావజాలానికి పార్టీలో చోటు ఉండకూడదని స్పష్టం చేశారు.

చారిత్రక పునరావృతం

చరిత్రను గమనిస్తే అమెరికాలో ఆర్థిక మాంద్యం లేదా ఉద్యోగాల కోత ఉన్న సమయాల్లో వలసదారులపై దాడులు పెరగడం కొత్తేమీ కాదు. గతంలో ఐరిష్, ఇటాలియన్, జపనీస్ వలసదారులు కూడా ఇటువంటి వివక్షను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం భారతీయుల పట్ల కనిపిస్తున్న అసహనం కూడా అటువంటి ఆర్థిక అభద్రతాభావం నుంచే పుట్టుకొస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా గణాంకాల ప్రకారం వివక్ష ఇలా..

49 శాతం భారతీయ అమెరికన్లు గడిచిన ఏడాది కాలంలో ఏదో ఒక రూపంలో వివక్షను ఎదుర్కొన్నారు. చర్మం రంగు, భాష యాస, మతపరమైన ఆచారాల ఆధారంగా భారతీయులను వేరుగా చూస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలుస్తున్న భారతీయ నిపుణులపై ఈ విధమైన అసహనం ప్రదర్శించడం ఇరు దేశాల సంబంధాలపైనే కాకుండా, అమెరికా ప్రజాస్వామ్య విలువలపై కూడా ప్రభావం చూపుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం వలసదారులను విమర్శించడం ఆపేయాలని, ఆన్‌లైన్‌లో ద్వేషాన్ని అరికట్టాలని పౌర సమాజం కోరుతోంది.

ఇదీ చదవండి: వన్ ప్లస్ సీఈఓపై అరెస్ట్ వారెంట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement