ఇస్లామాబాద్: కుక్క తోక వంకర అనే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోంది. ఉగ్రవాదం విషయంలో బహిరంగ వేదికలపై తమ దేశం వ్యతిరేకం అంటూనే.. అంతర్గతంగా మాత్రం టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైనప్పటికీ.. తాజాగా మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆ దేశ సైన్యం భద్రతా సంస్థలు కలిసి రెండో తరం ఉగ్రవాద నాయకత్వాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందుకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుంటున్నట్టు తెలిసింది. వీరిలో సీనియర్ ఉగ్రవాద కమాండర్ల కుమారులు, వారి దగ్గరి బంధువులు ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి. వీరంతా భారత్ టార్గెట్‌గా దాడులకు ప్లాన్ చేస్తున్నారనే సమాచారం బయటకు వచ్చింది.
నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), పాకిస్తాన్ ఆర్మీ అధికారుల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తదుపరి తరం నాయకత్వంగా వర్ణించబడిన ఉగ్రవాద సంస్థల సీనియర్ కమాండర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. జమ్ముకశ్మీర్‌లోకి పెద్ద ఎత్తున చొరబాట్లను ప్లాన్ చేయడం, భవిష్యత్తులో ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడమే ముఖ్య లక్ష్యమని చర్చించుకున్నట్టు తెలిసింది. అయితే, జమ్ముకశ్మీర్‌లో ఇప్పటికే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించడానికి లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైష్-ఏ-మొహమ్మద్ (జెఎమ్) కలిసి పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.
పహల్గాం తరహా ప్లాన్?
మరోవైపు.. సీనియర్ లష్కరే కార్యకర్తలు తల్హా సయీద్, సైఫుల్లా కసూరి, జైష్ కమాండర్ అబ్దుర్ రౌఫ్‌తో ఇటీవలే బహవల్‌పూర్‌కు చేరుకున్నారు. అక్కడే జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌తో తల్హా సయీద్, సైఫుల్లా కసూరి రహస్య సమావేశం నిర్వహించారని నిఘా వర్గాలు తెలిపాయి. కాగా, పహల్గాం దాడికి ముందు కూడా ఇలాంటి సమావేశాలు జరిగాయని నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ సమావేశం ఇది రెండు ఉగ్రవాద సంస్థల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచుతుందనే అనుమానాలను బలపరుస్తోంది.
హఫీజ్ సయీద్, మసూద్ అజార్ వంటి సీనియర్ ఉగ్రవాద నాయకుల నుండి వారి వారసుల వైపు ISI ఇప్పుడు దృష్టిని మళ్లిస్తోందని భద్రతా సంస్థలు చెబుతున్నాయి. నాయకత్వం, కార్యకలాపాల కొనసాగింపును నిర్ధారించడానికి రెండో తరం ఉగ్రవాద కార్యకర్తలను ప్రోత్సహించడం, నిధులు సమకూర్చడం ఈ వ్యూహంలో భాగంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఇందుకు అత్యంత ప్రముఖ వ్యక్తులలో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా ఉన్నారు. సైద్ధాంతికంగానే కాకుండా సంస్థాగత నిర్వహణ, నిధుల నెట్‌వర్క్‌లు మరియు అంతర్జాతీయ సంబంధాలలో కూడా అతన్ని క్రమపద్ధతిలో తీర్చిదిద్దుతున్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
అదేవిధంగా, మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రౌఫ్ అస్గర్‌కు ISI మద్దతు, శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. కాగా, అస్గర్.. జైష్-ఎ-మొహమ్మద్‌లో కార్యకలాపాలను ప్లాన్ చేయడం, ఉగ్రవాద మాడ్యుల్స్ సిద్ధం చేయడం, సరిహద్దు కార్యకలాపాలను సమన్వయం చేయడం వంటి పెద్ద నాయకత్వ పాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రౌఫ్ అస్గర్ గతంలో అనేక ఉగ్రవాద దాడుల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో పాక్ చర్చలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనే చర్చ మొదలైంది.


