న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి గురువారం సాయంత్రం రెండు డ్రోన్లు (మానవరహిత విమానాలు) సంచరించినట్లు భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్ల కదలికలను గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, డ్రోన్ నిరోధక చర్యలను ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతా దళాలు పహారా కాస్తున్నాయి.
ఈ వారంలో సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం నమోదు కావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తొలుత సోమవారం నౌషెరా-రాజౌరీ సెక్టార్‌లో పలు డ్రోన్లు కనిపించడంతో భారత ఆర్మీ అప్రమత్తమై ప్రతిఘటన చర్యలు చేపట్టింది. ఆ తర్వాత మంగళవారం రాజౌరీ జిల్లాలోని కేరి సెక్టార్‌లోనూ డ్రోన్ల కదలికలు కనిపించాయి. మొదటిసారి డ్రోన్లు కనిపించిన వెంటనే భారత్, పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ (DGMOs) మధ్య అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ తన ఆందోళనను, అభ్యంతరాలను పాక్ అధికారులకు స్పష్టంగా తెలియజేసింది.
వరుస డ్రోన్ ఘటనల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పాక్ ప్రతి కదలికను తాము నిశితంగా గమనిస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఆయన మాట్లాడుతూ, ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ‘ఆపరేషన్ సింధూర్’ ఇంకా కొనసాగుతోందని పునరుద్ఘాటించారు. ఇదిలా ఉండగా, గురువారం రాజౌరీ జిల్లాలో భద్రతా దళాలు భారీ ముప్పును తప్పించాయి. అందిన కచ్చితమైన సమాచారం మేరకు కాకోరా గ్రామంలో నిర్వహించిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఒక ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని సురక్షితంగా నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు.


