న్యూఢిల్లీ: అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. సెయింట్ లూయిస్ పార్క్‌లోని ఓ ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌లో అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్కడ పనిచేస్తున్న పలువురు సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు.. ఇద్దరు భారతీయ విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం వీసా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతోనే ఈ ఇద్దరు విద్యార్థులను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఈ విద్యార్థులు తమ వీసా నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నందువల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతర్జాతీయ విద్యార్థులకు ఉపాధి కల్పిస్తున్న ప్రదేశాలపై ఇటీవలి కాలంలో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెంచారు. గత కొన్ని నెలలుగా అనధికారిక ఉపాధి,వీసా నిబంధనల అమలుపై ఐసీఈ అధికారులు పలు రాష్ట్రాల్లో ఈ తరహా చర్యలను ముమ్మరం చేశారు.
BREAKING
ICE reportedly detained two Indian students at an Indian restaurant in St. Louis Park yesterday afternoon.
STUDENTS, BE VERY CAREFUL. DO NOT TAKE UP ANY PART TIME JOBS THAT ARE NOT LEGALLY ALLOWED. pic.twitter.com/WmEwnAAIVf— M9 USA🇺🇸 (@M9USA_) January 16, 2026
విద్యార్థులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారన్న అనుమానంతో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తుండటానికి తోడు తాజా అరెస్టులతో అక్కడి భారతీయ విద్యార్థుల్లో ఆందోళన మరింతగా పెరిగింది. ఈ ఘటన నేపథ్యంలో విద్యార్థి సంఘాలు, నిపుణులు భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, సరైన అనుమతులు లేకుండా క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయడం లాంటి పొరపాట్లు చేయవద్దని సూచిస్తున్నారు. ఇటువంటి ఉల్లంఘనలు.. డిటెన్షన్, వీసా రద్దు లేదా దేశ బహిష్కరణ వంటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: కెనడాలో హత్య చేసొచ్చి.. పంజాబ్‌లో హల్చల్!


