సంగ్రూర్: కెనడాలో పంజాబ్‌కు చెందిన యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆపై గుట్టుగా భారత్‌కు చేరుకున్న నిందితుడిని సంగ్రూర్(పంజాబ్) పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి చెందిన మన్‌ప్రీత్ సింగ్.. గత ఏడాది అక్టోబర్ 20న కెనడాలో అమన్‌ప్రీత్ కౌర్ (27) అనే యువతిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘాతుకం తరువాత భారత్‌కు చేరుకున్న ఇతను, సంగ్రూర్‌లోని మృతురాలి కుటుంబాన్ని కలుసుకున్నాడు. కెనడాలో తనపై ఉన్న హత్య కేసును వెనక్కి తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరిస్తూ వస్తున్నాడు.ఈ నేపధ్యంలో మృతురాలి తండ్రి ఇందర్‌జిత్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు తాజాగా మన్‌ప్రీత్ సింగ్‌ను అదుపులోనికి తీసుకున్నారు.
ప్రేమ నిరాకరించిందని..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు అమన్‌ప్రీత్ కౌర్ టొరంటోలోని ఈస్ట్ యార్క్‌లో నివసిస్తూ, ఓ ఆసుపత్రిలో పర్సనల్ సపోర్ట్ వర్కర్‌గా పనిచేసేది. నిందితుడు మన్‌ప్రీత్ అదే ప్రాంతంలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్న మన్‌ప్రీత్, అక్టోబర్ 21న ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు.
నయాగరా సమీపంలో మృతదేహం
అమన్‌ప్రీత్ కౌర్ అదృశ్యమైనట్లు ఆమె సోదరి గురుసిమ్రాన్.. కెనడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దర్యాప్తులో నయాగరా ఫాల్స్ సమీపంలో అమన్‌ప్రీత్ మృతదేహం కనిపించగా, దానిని స్వాధీనం చేసుకున్నారు. కాగా అప్పటికే నిందితుడు భారత్‌కు పారిపోయాడని అక్కడి అధికారులు నిర్ధారించారు. భారత్ చేరుకున్న మన్‌ప్రీత్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా మృతురాలి సోదరిని, ఆమె కుటుంబాన్ని కేసు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు.
కేసు వెనక్కి తీసుకోకుంటే..
అంతటితో ఆగని మన్ ప్రీత్ అక్టోబర్ చివరి వారంలో మరణాయుధంతో సంగ్రూర్‌లోని మృతురాలి ఇంటిలోనికి చొరబడి, కేసు వెనక్కి తీసుకోవాలని వారిని హెచ్చరించాడు. దీంతో భయపడిన బాధిత కుటుంబం ఇంటిలో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంది. అయితే మన్‌ప్రీత్ గత నవంబర్ 30, జనవరి 10 తేదీల్లో అర్ధరాత్రి వేళ వారి ఇంటికి వెళ్లి, ఆ సిసిటీవీ కెమెరాలతో సెల్ఫీలు దిగి, వాటిని కుటుంబ సభ్యులకు పంపి, వారిని మరింత భయభ్రాంతులకు గురిచేశాడు.
మార్ఫింగ్ ఫోటోలతో..
మృతురాలి కుటుంబపు పరువు తీయాలనే ఉద్దేశంతో మన్‌ప్రీత్ నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి, అమన్‌ప్రీత్ మార్ఫింగ్ ఫోటోలను అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆధారంగా, జనవరి 14న సంగ్రూర్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), ఐటీ చట్టం కింద నిందితునిపై కేసు నమోదు చేశారు. పలు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని జనవరి 15న అరెస్టు చేశామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: పుడుతూనే మధుమేహం.. ‘కొత్త కారణం’తో కలవరం


