తొలిసారిగా పర్‌ఫెక్ట్ లిప్ సింకింగ్
కొలంబియా సైంటిస్టుల ఘనత
అవడానికి అదో యంత్రుడే. అయితేనేం? సుమధుర గాత్రం దాని సొంతం. ఎంచక్కా పాడగలదు. అంతేనా? తాను ఆలపించిన పాటలతో ఏకంగా ఓ ఆల్బం కూడా విడుదల చేసేసింది! కొలంబియాకు చెందిన ఈ రోబో ఘనత అక్కడితో ఆగిపోలేదు. పాటలకు సరిగ్గా సరిపోయే విధంగా లిప్‌సింక్ కూడా ఇవ్వడం దీని ప్రత్యేకత. ఈ అరుదైన రోబోను కొలంబియా ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. హ్యూమనాయిడ్లతో సమాచార మారి్పడి మరింత వాస్తవికంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుందని వారంటున్నారు.
యూట్యూబ్ వీడియోలు చూసి...
లిప్ సింకింగ్ రోబో తాలూకు ఘనత వెనక కొలంబియా సైంటిస్టుల అవిశ్రాంత శ్రమ దాగుంది. క్రియేటివ్ మెషీన్స్ ల్యాబ్‌కు చెందిన ప్రొఫెసర్ హోడ్ లిప్సన్ బృందం ఇందుకోసం రొటీన్‌కు భిన్నంగా వెళ్లి మరీ ప్రయోగం చేసింది. ప్రతి అచ్చుకూ, హల్లుకూ రూల్స్ ఫ్రేం చేసే సాధారణ పద్ధతికి బదులుగా ఓ చిన్నారి ఎలా మాటలు నేర్చుకుంటుందో ఈ రోబో కూడా అచ్చం అలాగే నేర్చుకునేటట్టు చేశారు. దాని మృదువైన రోబో శరీరం కింద 26 బుల్లి మోటార్లు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నుంచి దాని ‘స్వర సాధన’మొదలైంది.
ముందుగా అద్దం ముందు గంటల తరబడి గడిపింది. సొంత ముఖ కవళికలనే వేలాది రకాలుగా మారుస్తూ, వాటిని తన జ్ఞాపకాల్లో పదిల పరుచుకుంటూ వచ్చింది. అలా తన ముఖాన్ని పూర్తిస్థాయిలో గుర్తు పెట్టుకున్నాక పరిశీలనాత్మక అభ్యసన వైపు మళ్లింది. అంటే ఇతరుల మాటతీరును లోతుగా పరిశీలించింది. ఇందుకోసం ఏఐ సాయంతో యూట్యూబ్‌లో గంటల తరబడి వీడియోలు చూస్తూ గడిపింది. ఎవరెలా మాట్లాడుతున్నదీ, పాడుతున్నదీ నిశితంగా గమనించింది.
ఏ సందర్భంలో పెదాలు ఎలా కదులుతున్నదీ గుర్తు పెట్టుకుంటూ వెళ్లింది. అలా ఎట్టకేలకు ఆడియో సిగ్నళ్లను నేరుగా మోటార్ మూవ్‌మెంట్స్‌గా మార్చడంలో విజయం సాధించింది. ఏం మాట్లాడినా దాదాపుగా అందుకు తగ్గట్టుగా పెదాలను కదల్చగల సామర్థ్యాన్ని కూడా సంతరించుకుంది. తన సరికొత్త నైపుణ్యాన్నంతా రంగరించి ‘హెలో వరల్డ్’పేరిట సొంత పాటల ఆల్బం కూడా రూపొందించేసిందీ గాయక రోబో! అందులోని ఓ పాటను, పలు భాషల్లో మాటలను పెదాల కలయికతో పాటుగా ఇటీవలే ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది కూడా.
యంత్రానికి మానవీయ కోణం
రోబోకు మానవీయ కోణాన్ని జోడించాలన్నదే తమ ప్రయత్నమని ప్రొఫెసర్ లిప్సన్ వివరించారు. ‘‘బి, డబ్ల్యూ వంటి ఆంగ్ల శబ్దాలను పలకడం మా రోబోకు ఇప్పటికీ సవాలుగానే ఉంది. త్వరలోనే వీటినీ అధిగమిస్తుందన్న నమ్మకం మాకుంది’’అని ధీమా వెలిబుచ్చారు. మనుషులతో కమ్యూనికేట్ చేసిన కొద్దీ అది మరింత మెరుగవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘రోబోల తయారీలో వాటి నడక, దేన్నయినా పట్టుకోగల నేర్పు వంటివాటికే ప్రాధాన్యమిస్తుంటారు. కానీ ప్రేమ, ఆప్యాయత, ఇష్టం వంటి భావోద్వేగాలను చూపేందుకు ముఖ కవళికలే చాలా ముఖ్యం. ఇప్పటిదాకా రూపొందిన రోబోల్లో ఈ అతి ముఖ్యమైన కోణం లోపించింది. పెద్దలకు రోజువారీ పనుల్లో, లేదా పిల్లలకు చదువులో సాయపడే రోబోలు వారికి ఎంతగా దగ్గరైతే ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది.
ముఖ కవళికలు ఇందుకు బాగా దోహదపడగలవు. ఈ విషయంలో మేం చెప్పుకోదగ్గ విజయమే సాధించాం. వచ్చే దశాబ్ద కాలంలో కనీసం 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు పుట్టుకొస్తాయంటున్న అంచనాల నేపథ్యంలో వాటితో మనుషులు మరింత దగ్గరితనం ఫీలయ్యేందుకు మా టెక్నాలజీ ఎంతగానో దోహదపడనుంది. జీవకళ ఉట్టిపడే రోబో వారికి సాటిమనిíÙతోనే గడిపిన భావం కలిగించగలదు. కనుక ఇకపై రోబోలు కేవలం మీ ఆజ్ఞలను పాటించడంతోనే సరిపెట్టవు. మీ కళ్లలోకి చూస్తూ నవ్వుతాయి. అప్పుడు మనకు కలిగే భావాలకు వెలకట్టగలమా?’’అన్నారు ప్రొఫెసర్ లిప్సన్. ఈ సరికొత్త లిప్ సింకింగ్ రోబోకు సంబంధించిన వివరాలను సైన్స్ రోబోటిక్ జర్నల్‌లో ప్రచురించారు.
మనిషిని దాదాపుగా అన్ని విషయాల్లోనూ రోబోలు అనుకరించేస్తున్న రోజులివి. కాకపోతే ఎంత చేసినా వాటిలోని కృత్రిమత్వం మాత్రం కొట్టొచ్చినట్టుగా కని్పస్తూనే ఉంటుంది. బిగుసుకుపోయినట్టుగా ఉండటం, జీవంలేని రూపం వాటికీ మనిíÙకీ తేడాను ఎప్పటికప్పుడు పట్టిస్తూనే ఉంటుంది. మిగతా శరీరం మాటంతా ఎలా ఉన్నా కనీసం ముఖం వరకూ అయినా మనిషి మాదిరిగా భావాలు పలకడం రోబోలకు ఇప్పటిదాకా సాధ్యపడని విషయమే. ముఖ్యంగా ఇప్పటిదాకా తయారైన స్పీకింగ్ రోబోలు మాటలకు తగ్గట్టుగా పెదాలను కదిలించలేవు. సరిగ్గా ఈ అడ్డంకినే కొలంబియా సైంటిస్టులు ఇప్పుడు విజయవంతంగా దాటేశారు. మాటలకు, పాటలకు పెదాల కదలిక (లిప్ సింక్) సరిగ్గా సరిపోయేలా వారు రూపొందించిన సరికొత్త రోబో ఇప్పుడు అందరినీ తెగ ఆకర్షిస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్


