బొగొటా: కొలంబియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నపాటి విమానం కుప్పకూలి 15 మంది మరణించారు. మృతుల్లో కొలంబియా చట్ట సభ్యుడు కూడా ఒకరు ఉన్నారు. తొలుత విమానం అదృశ్యం కాగా.. ఎక్కడో దగ్గర సేఫ్ ల్యాండ్ అయి ఉంటుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరకు విషాదమే మిగిలింది.
బుధవారం ఉదయం 11గం. సమయంలో 15 మందితో కూడిన సటేనా ఎయిర్‌లైన్స్ విమానం కుకుటా నుంచి ఒకానాకు బయల్దేంది. అయితే కాసేపటికే అది ఏటీసీ(air traffic control)తో సంబంధాలు తెగిపోయింది. ఈ క్రమంలో ప్రయాణికుల క్షేమంపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. నార్తె డె సంటాన్‌డెర్ ప్రావిన్స్‌లోని కురాసికా గ్రామం సమీపంలో అది కుప్పకూలింది. అది గమనించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం అందించారు.
ఆ వెంటనే ప్రమాదంపై కొలంబియా పౌరవిమానయాన శాఖ అధికారిక ప్రకటన చేసింది. కొలంబియా-వెనెజువెలా సరిహద్దు ప్రాంతంలో విమానం ప్రమాదానికి గురైందని.. ప్రమాదంలో అంతా మరణించారని.. మృతుల్లో 13 మంది ప్రయాణికులు.. ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారని పేర్కొంది. విమానం ప్రమాదానికి గురైన ప్రాంతం దట్టమైన అటవీ ప్రాంతం. పైగా రెబల్ గ్రూప్స్‌నకు ఆవాసం. దీంతో మృతదేహాల రికవరీ కోసం ఆర్మీని రంగంలోకి దించింది.
ఈ ఘటనలో పార్లమెంటేరియన్ డియోగెనెస్ క్విన్‌టెరో(Diógenes Quintero)తో పాటు మరో రాజకీయ నేత సాలకెడో కూడా ఉన్నారు. కొలంబియాలో అంతర్యుద్ధం కారణంగా నలిగిపోతున్న బాధితుల తరఫున క్విన్‌టెరో పోరాడుతున్నారు. సాలకెడో రాబోయే హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
సటేనా ఎయిర్‌లైన్స్‌ను కొలంబియా ప్రభుత్వమే నడిపిస్తోంది. ఘటనపై దిగ్భ్‌రాంతి వ్యక్తం చేసిన ఎయిర్‌లైన్స్.. దర్యాప్తునకు సహకరిస్తామని అంటోంది. ప్రమాదానికి గురైన బీచ్‌క్రాఫ్ట్ 1900 తేలికపాటి విమానం కండిషన్‌లోనే ఉందని చెబుతోంది.


