టెహ్రాన్: ఇరాన్‌లోని ఇస్ఫహాన్ భూగర్భ కాంప్లెక్స్‌లో ఇరాన్ కొత్త యురేనియం సుసంపన్నత కేంద్రాన్ని (uranium enrichment site) అభివృద్ధి చేసినట్లు సమాచారం. అయితే, ఈ కొత్త కేంద్రం పని చేస్తోందా? లేదా? అది కేవలం ఒక "ఖాళీ ప్రదేశమా" అన్నది నిర్ధారించలేకపోతున్నామని ఐక్యరాజ్యసమితి అణు పర్యవేక్షణ సంస్థ (IAEA) తెలిపింది. ఆ కేంద్రం ఎంత ఆధునికమైనదో స్పష్టంగా తెలియదన్న ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రోసీ.. పలు సందేహాలున్నాయన్నారు.
పర్యవేక్షణ సంస్థకు అక్కడ తనిఖీ చేసే అవకాశం దక్కితేనే వీటికి సమాధానం దొరుకుతుందని పేర్కొన్నారు. అది భూగర్భంలో ఉందని.. కానీ మేము ఇంకా ఆ ప్రదేశాన్ని పరిశీలించలేదని తెలిపారు. ట్రంప్ పరిపాలన అధికారులతో చర్చలు జరపడానికి వాషింగ్టన్ సందర్శించిన గ్రోసీ ఈ సందర్భంగా విలేకరులతో చెప్పారు. ఒకవేళ ఇది పూర్తయితే, ఇరాన్‌లో ఇది నాలుగో యురేనియం సుసంపన్నత ప్లాంట్ అవుతుందన్నారు.
ప్రస్తుతం ఇరాన్ వద్ద సుమారు 440 కిలోల 60 శాతం సుసంపన్నం చేసిన యురేనియం ఉన్నట్లు IAEA అంచనా వేస్తోంది. దీనిని 90 శాతానికి (ఆయుధాల తయారీకి అవసరమైన స్థాయికి) చేర్చగలిగితే, అది అణు ఆయుధ తయారీకి సిద్ధమైనట్లే.. ఇది సుమారు 10 అణు బాంబుల తయారీకి సరిపోతుంది. అయితే దీనికి పట్టే కాలాన్ని లెక్కించడం కష్టమని అధికారులు గతంలోనే స్పష్టం చేశారు.
గత ఏడాది 2025 జూన్‌లో ఐక్యరాజ్యసమితి బృందం దానిని పరిశీలించడానికి ఇస్ఫహాన్ వెళ్లాల్సి ఉంది. అయితే, ఇజ్రాయెల్‌తో 12 రోజుల యుద్ధం ప్రారంభమైన తరుణంలో ఆ అణు కాంప్లెక్స్‌పై దాడి జరగడంతో ఆ పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఐఏఈఏ బృందం తమ పర్యటనను రద్దు చేసుకోవాల్సి రావడంతో, అక్కడ సెంట్రిఫ్యూజ్‌ల అమరిక మొదలైందా? లేదా? అన్నది తెలియడం లేదు. "మేము అక్కడికి తిరిగి వెళ్లగలిగినప్పుడు మాత్రమే స్పష్టత లభిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
తమకు అణుబాంబు తయారీ ఉద్దేశం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ, అది బాంబు తయారీకి చాలా దగ్గరగా చేరుకుందనే కారణంతో అమెరికా, ఇజ్రాయెల్‌లు దాడులు చేస్తున్నాయి. అమెరికా దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేశాయని అధ్యక్షుడు ట్రంప్ గతంలో ప్రకటించినప్పటికీ, ఐఏఈఏ మాత్రం అణు ఆయుధ కార్యక్రమంపై తమ వద్ద ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపింది.


