రోబో సలహాలు.. మంచివే! | Robo advisors expand access to wealth | Sakshi
Sakshi News home page

రోబో సలహాలు.. మంచివే!

Mar 2 2026 5:32 AM | Updated on Mar 2 2026 5:32 AM

Robo advisors expand access to wealth

దేశంలో వేగంగా పెరుగుతున్న రోబో అడ్వైజర్లు

ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియ మొత్తం ఆటోమేటిక్‌గానే...

తక్కువ వ్యయాలతో సలహా, నిర్వహణ సేవలు

యాప్‌లతో ఈజీ కావటంతో ఆకర్షితులవుతున్న యువత

తొలిసారిగా ఇన్వెస్ట్‌ చేసే వారు, బిజీగా ఉండే ప్రొఫెషనల్స్‌కి బెటర్‌  

మీరు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారా? సలహాదారులను ఆశ్రయిస్తున్నారా? వారికి చెల్లించాల్సిన ఫీజు ఎక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా? సలహాదారులు ఎందుకులే... అనుకుంటూ మీకు తోచినట్లు ఇన్వెస్ట్‌మెంట్లు చేసి చేతులు కాల్చుకుంటున్నారా? పోనీ సలహాదారులు చెప్పినట్లే చేసినా కూడా వారి ఫీజులు పోను పెద్దగా రిటర్న్స్‌ రావటం లేదా? ‘నేను పెట్టేది తక్కువ మొత్తమే కదా!  ఆర్థిక సలహాదారులు ఎందుకులే’ అని అనుకుంటున్నారా? ఇలాంటి వాటన్నిటికీ సమాధానమే కొత్తతరం రోబో అడ్వైజర్లు. చౌకగా పోర్టుఫోలియోలను నిర్వహించుకోవటమే కాదు... ఆకర్షణీయమైన లాభాలూ సొంత చేసుకోవచ్చు. ఈ తరం ఎక్కువగా ఆసక్తి చూపుతున్న రోబో అడ్వైజర్ల గురించి సమగ్రంగా చెప్పేదే ఈ ‘వెల్త్‌ స్టోరీ’...

దశాబ్దాలుగా ఇన్వెస్టింగ్‌ చేయడమంటే ఆర్థిక సలహాదారును కలవడమే కాదు. చాంతాడంత ఫారాలూ నింపాల్సి వచ్చేది. అడ్వైజరీ ఫీజులు ఎక్కువే. దీంతో ఇదంతా చాలా పెద్ద వ్యవహారంగా ఉంటూ వస్తోంది. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీలు రోబో అడ్వైజర్లను తెచ్చాయి. వీటి సాయంతో అత్యంత చౌకగా పోర్ట్‌ఫోలియోలను నిర్మించుకోవటమే కాదు. నిర్వహణ పనులు కూడా అవే చేసిపెడుతున్నాయి.  
    
ఎవరీ రోబో అడ్వైజర్లు.. 
రోబో అడ్వైజర్లంటే మరెవరో కారు..(కావు). అల్గోరిథమ్‌లను ఉపయోగించి పోర్ట్‌ఫోలియోలను రూపొందించడంతో పాటు నిర్వహణ సేవలూ అందించే ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫారాలు. పోర్ట్‌ ఫోలియో నిర్వహణకు సంబంధించి ఇవి ప్రధానంగా ఇన్వెస్టర్‌ రిస్కు సామర్థ్యాలను తెలుసుకునేందుకు కొన్ని ప్రశ్నలు వేస్తాయి. వాటి సమాధానాలను బట్టి ఏ సాధనానికి ఎంత కేటాయించాలనేది వివిధ మోడల్స్‌ని బట్టి సూచిస్తాయి. అలాగే పెట్టుబడి వ్యయాలు తక్కువగా ఉండే సాధనాలను ఎంపిక చేస్తాయి. ఆటోమేటిక్‌గా రీబ్యాలెన్స్‌ చేస్తాయి. 

అంతర్జాతీయంగా చూస్తే... బెటర్‌మెంట్, వెల్త్‌ఫ్రంట్, ఫిడిలిటీ గో, సోఫైలాంటి ప్లాట్‌ఫామ్‌లు ఈ విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. ఈ మోడల్‌లో తమ ఆదాయం, లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాల్లాంటి ప్రశ్నలకు ఇన్వెస్టర్లు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా ఈ రోబో వ్యవస్థ ఒక డైవర్సిఫైడ్‌ పోర్ట్‌ఫోలియోను సిఫార్సు చేస్తుంది. ఈ ప్రక్రియలో మనిషి జోక్యం చాలా తక్కువ. అంతా సిస్టం చూసుకుంటుంది. అందుకే ఖర్చూ తక్కువగా ఉంటుంది.  

అసలెలా పని చేస్తాయి.. 
ఈ రోబో అడ్వైజర్లు ముందుగా రిస్క్‌ ప్రొఫైలింగ్‌ చేస్తాయి. ఈ దశలో మీరు ఎంతకాలం ఇన్వెస్ట్‌ చేయదల్చుకుంటున్నారు? ఒకవేళ మార్కెట్‌ గానీ 10 శాతం పడితే మీరెలా స్పందిస్తారు? మీ ఆదాయం ఎంత మేర స్థిరంగా ఉంటుంది? వంటి ప్రశ్నలు వేస్తాయి. మీరిచ్చే సమాధానాలను బట్టి మీ రిస్కు సామర్థ్యాన్ని అంచనా వేస్తాయి. మీరు ఎక్కువగా రిస్కు తీసుకోవడానికి ఇష్టపడతారా? లేక ఒక మోస్తరుగా తీసుకోగలరా? లేక రిసు్కకు దూరంగా ఉంటారా? అనేది అర్థం చేసుకుంటాయి.  
    
పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఇలా...  
మీరు ఓకే చేశాక... రెండో దశలో అల్గోరిథం మీ రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్, కొన్ని సందర్భాల్లో బంగారం లేదా అంతర్జాతీయ అసెట్స్‌లాంటి సాధనాలకు ఎంతెంత కేటాయించవచ్చనేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ఈక్విటీ మార్కెట్లు పెరిగి, మీరు నిర్దేశించిన స్థాయికన్నా కేటాయింపులు పెరిగిపోతే, సిస్టం ఆటోమేటిక్‌గా రీబ్యాలెన్స్‌ చేస్తుంది. చాలా మటుకు ప్లాట్‌ఫామ్‌లు మీ లక్ష్యాలను ట్రాక్‌ చేసే విధంగా పని చేస్తాయి. రిటైర్మెంట్, పిల్లల చదువులు, ఇంటి కొనుగోలు ఇలాంటి లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడిని నిర్వహిస్తాయి. తద్వారా ఆర్థిక విషయాల్లో స్పష్టతనిచ్చేందుకు ప్రయతి్నస్తాయి.  

కొత్త వారికి లాభాలెన్నో..
→ తక్కువ వ్యయాలు: సంప్రదాయ అడ్వైజరీ సరీ్వసులందించే సంస్థలు ఏటా 1– 2 శాతం చార్జీలు లేదా లావాదేవీలకింత కమీషన్‌ చొప్పున వసూలు చేస్తుంటాయి. అంతా ఆటోమేటెడ్‌గానే ఉంటుంది కాబట్టి రోబో–అడ్వైజర్ల ఫీజులు చాలా తక్కువ ఉంటాయి. ఇలా ఫీజులు తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో మరింత ఎక్కువగా 
రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది.  

→ క్రమశిక్షణ: సాధారణంగా ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు భావోద్వేగాలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. భయం వల్ల కావచ్చు లేదా అత్యాశ వల్ల కావచ్చు, రిటైల్‌ ఇన్వెస్టర్లు సర్వసాధారణంగా ఎక్కువ రేటులో కొని, తక్కువ రేటుకు అమ్మేస్తుంటారు. ఆటోమేటెడ్‌ సిస్టంలలో ఇలాంటి భావోద్వేగాలు ఉండవు. వాటి తాలూకా తప్పిదాలూ ఉండవు. డేటా ఆధారిత అలొకేషన్‌ నిబంధనలను ఇవి పాటిస్తాయి. తద్వారా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగేలా చూస్తాయి.  

→ సరళత్వం: రోబో అడ్వైజర్లు దన్నుగా ఉంటే డజన్ల కొద్దీ మ్యూచువల్‌ ఫండ్లను విశ్లేíÙంచుకోవాల్సిన పనిగానీ... ప్రతి రోజూ మార్కెట్‌ న్యూస్‌ని ట్రాక్‌ చేస్తూ ఉండటం గానీ చేయనక్కర్లేదు.  డైవర్సిఫికేషన్‌ రీబ్యాలెన్సింగ్‌ అంతా కూడా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామే చూసుకుంటుంది.  

→ అందుబాటు స్థాయిలో: సాధారణంగా చాలా తక్కువ మొత్తాలతో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. సంపాదన అప్పుడప్పుడే మొదలుపెట్టినవారికి ఇది ఎంతో అనుకూల అంశంగా ఉంటుంది.  

మన దగ్గర ఇలాంటి సాధనాలున్నాయా?  
భారత్‌లోను ఇప్పుడిప్పుడే ఇలాంటి సరీ్వసులు అందుబాటులోకి వస్తున్నాయి. జెరోధా, గ్రో లాంటి డిస్కౌంట్‌ బ్రోకరేజీలు, ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు.. లక్ష్యాల ఆధారిత ఇన్వెస్టింగ్‌ సాధనాలు, ఇన్వెస్టర్ల అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దిన పోర్ట్‌పోలియోలను అందిస్తున్నాయి. కొన్ని ప్లాట్‌ఫాంలు మోడల్‌ పోర్ట్‌ఫోలియోలను రూపొందిస్తున్నాయి. అర్థయంత్ర, కువేర, ఇండ్‌మనీ, స్క్రిప్‌బాక్స్, ఫండ్స్‌ ఇండియా లాంటివి వివిధ ప్రొఫైల్స్‌కి తగ్గట్లుగా సరీ్వసులు ఇస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా సుమారు 140 రోబో–అడ్వైజరీ స్టార్టప్స్‌ ఉన్నట్లు అంచనా.  

కాకపోతే ఇంకా దేశీయంగా పూర్తి స్థాయిలో అమెరికా మాదిరి ఆటోమేట్‌ చేసిన ఈటీఎఫ్‌ ఆధారిత రోబో ప్లాట్‌ఫాంలు అందుబాటులో లేవు. హైబ్రిడ్‌ మోడల్స్‌ మాత్రం వస్తున్నాయి. ఇవి లక్ష్యాల ఆధారిత మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టింగ్, పెట్టుబడులకు ముందు డిజిటల్‌గా రిస్క్‌ ప్రొఫైలింగ్‌ చేయడం, ఆటోమేటిక్‌గా సిప్‌లను సరి చేయడంలాంటివి చేస్తున్నాయి. దేశీయంగా ఫిన్‌టెక్‌ వినియోగం, సిప్‌ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో రోబో–అడ్వైజరీ సరీ్వసులు మరింత విస్తరిస్తాయనేది సుస్పష్టం.

ఇవి ఎవరికి అనువంటే...
→ తొలిసారిగా ఇన్వెస్ట్‌ చేస్తున్నవారికి 
→ బిజీగా ఉండే ప్రొఫెషనల్స్‌కి 
→ మార్కెట్‌పై పరిమిత స్థాయి పరిజ్ఞానం ఉన్న వారికి 
→ దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవాలనుకునేవారికి 

అయితే, అత్యంత సంపన్న వర్గాల వారికి, సంక్లిష్టమైన విధంగా పన్నులు కట్టాల్సిన వారికి మాత్రం వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మనుషులు అందించే అడ్వైజరీ సరీ్వసులే అవసరం కావచ్చు.

ఇప్పుడిదే ట్రెండు..
యువ ఇన్వెస్టర్లు ఇప్పుడు పేపర్‌ వర్క్, సేల్స్‌మెన్‌ బాదరబందీని కాకుండా సింపుల్‌గా ఉండే యాప్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. రోబో–అడ్వైజర్లు సరిగ్గా ఇందుకు సరిపోతాయి. సాధారణంగా చాలా మటుకు ఇండియన్స్‌ పెట్టుబడి అంటే అదేదో బ్రహ్మపదార్థమనే భావనతో ఇన్వెస్టింగ్‌ని వాయిదా వేస్తుంటారు. రోబో అడ్వైజరీ సాధనాలు ఇలాంటి అపోహలను పోగొట్టి.. పెట్టుబడి పెట్టడాన్ని చాలా సులభతరం చేస్తున్నాయి.  

గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
→ పెట్టుబడులు పెట్టడం మీకు కొత్తయినా, ఎలా మొదలెట్టాలో తెలియకపోయినా, రిస్క్‌ ప్రొఫైలింగ్‌ టూల్‌తో మొదలుపెట్టండి. వైవిధ్యమైన, తక్కువ ఖర్చులు ఉండే ప్రోడక్టులను ఎంచుకోండి. స్వల్పకాలిక గందరగోళం ప్రభావంలో పడకుండా దీర్ఘకాలిక లక్ష్యాలపై ఫోకస్‌ చేయండి.  
→ ముఖ్యంగా రోబో–అడ్వైజర్లంటే మ్యాజిక్‌ చేసేసి, సంపదను సృష్టించే సాధనాలేమీ కాదు. క్రమశిక్షణతో, తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఉపయోగపడే శక్తివంతమైన సాధనాలుగా మాత్రం చూడొచ్చు. అడ్వైజర్లతో గంటల తరబడి, రోజుల తరబడి చర్చిస్తూ కూర్చోడం కన్నా సింప్లిసిటీని కోరుకునే బిగినర్స్‌.. మార్కెట్లలోకి తొలి అడుగు వేసేందుకు ఇది స్మార్ట్‌ మార్గంగా ఉపయోగపడొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement