'స్థూలం'గానూ తెలియదంతే! | Overweight people are more common in the South | Sakshi
Sakshi News home page

'స్థూలం'గానూ తెలియదంతే!

Mar 4 2026 4:36 AM | Updated on Mar 4 2026 4:36 AM

Overweight people are more common in the South

జనంలో ఊబకాయ చికిత్సలపై అవగాహన కొంతే 

పట్టణ భారత్‌లో 7.3 కోట్ల మందికి ఒబేసిటీ సమస్య 

అధిక బరువున్న వ్యక్తులు దక్షిణాదిలోనే ఎక్కువ

శారీరక శ్రమ లేని జీవనశైలి, మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి స్థాయిలు.. వెరసి జీవక్రియ సంబంధిత సమస్యలు జనాన్ని చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఊబకాయం (ఒబేసిటీ), మధుమేహం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. బరువు తగ్గేందుకు శ్రమిస్తున్నప్పటికీ.. ఒబేసిటీ చికిత్సలపై మాత్రం వీరికి అవగాహన తక్కువగా ఉంటోందట. 

మార్చి 4న జరిగే ‘ప్రపంచ ఊబకాయ దినం’సందర్భంగా పరిశోధన సంస్థ కాంటార్‌ ఇండియా విడుదల చేసిన ’జీఎల్‌పీ–1 ఆపర్చునిటీ ఇండెక్స్‌ రిపోర్ట్‌’ ప్రకారం.. పట్టణ ఊబకాయుల్లో 85% మంది అంటే 6.2 కోట్ల మంది బరువు తగ్గడానికి చురుగ్గా ప్రయత్నిస్తున్నారు. 

మధుమేహ నియంత్రణ, బరువు తగ్గింపు కోసం అంతర్జాతీయంగా కొత్త తరం చికిత్సలు ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో.. భారత్‌లోని వ్యాధిగ్రస్తుల్లో అధిక ఆసక్తి ఉన్నప్పటికీ సరైన సమాచారం లేని మార్కెట్‌గా కనిపిస్తోంది. పట్టణవాసుల్లో కేవలం 4.99% మందికి మాత్రమే ప్రస్తుతం గ్లూకగాన్‌–లైక్‌ పెప్టైడ్‌–1 (జీఎల్‌పీ–1) మందుల గురించి అవగాహన ఉంది.  

పట్టణాల్లో ఆరోగ్య సంక్షోభం
» 15 ఏళ్లు పైబడిన పట్టణ భారతీయుల్లో సుమారు 20% (7.3 కోట్లు) మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు అంచనా.  
» దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10.1 కోట్ల మంది డయాబెటిస్‌ బారిన పడ్డారు.  
» 13.6 కోట్ల మంది మధుమేహం వచ్చే ముప్పున్న (ప్రీ–డయాబెటిక్‌) దశలో ఉన్నారు. 
» మధుమేహ వ్యాధిగ్రస్తులు గ్రామీణ భారతంలో 8.3%, పట్టణ ప్రాంతాల్లో 14.2% ఉన్నారు.  
» గ్రామాల కంటే నగరాలు వేగంగా విస్తరించడం, ఐటీ వంటి ఉద్యోగాలతో ఎక్కువ గంటలు కూర్చుని పనిచేయడం, బయట ఆహారం తినే ధోరణి పెరగడం, విలాసవంతమైన జీవనశైలి ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. 

స్పష్టంగా అవగాహన లోపం.. 
»  ప్రస్తుతం అవగాహన పరిమితంగా ఉన్నప్పటికీ సమాచారం తెలిసిన వినియోగదారుల్లో చికిత్సను 
స్వీకరించాలన్న ఆశయం బలంగా ఉంది. 
» జీఎల్‌పీ–1 చికిత్సల గురించి తెలిసిన మధుమేహ రోగులలో 49.2% మంది వీటిని ఉపయోగించే అవకాశం ఉందని తెలిపారు. వీరిలో 44.1% మంది వారానికి ఒకసారి తీసుకునే డోసేజ్‌ ఫార్మాట్‌లకు మొగ్గుచూపుతున్నారు.

ఎక్కడ.. ఎంతమంది?
» సంపన్న వర్గంలోనే అధికం: పట్టణ జనాభాలో అత్యంత సంపన్న గృహాలు 40% ఉన్నాయి. అధిక బరువున్న వారిలో 46% మంది ఈ విభాగం నుంచే ఉన్నారు. ఇదే సంపన్న వర్గంలో 36% మంది గత ఏడాది మధుమేహ సమస్యను ఎదుర్కొన్నారు. జీవనశైలి కారణంగా పెరిగిన ఆరోగ్య ముప్పును ఇది సూచిస్తోంది. 
»  మధ్యవయస్కులు ప్రభావితం: అధిక బరువున్న వారిలో జెన్‌ ఎక్స్‌ (45–60 ఏళ్ల వారు) వాటా 40% ఉంది. కొనసాగుతున్న జీవనశైలి లోపాలు, మానసిక ఒత్తిడి, పని భారం కారణంగా ఈ వయస్సు వారు అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని మధుమేహం కేసుల్లో 73% మంది జెన్‌ ఎక్స్‌ వారే. 
» దక్షిణాదిలోనే ఎక్కువ: దేశంలో అధిక బరువున్న జనాభాలో 36% దక్షిణాదిలోనే ఉన్నారు. అలాగే పట్టణ మధుమేహం కేసుల్లో 43% ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 26%, తెలంగాణలో 17% మందికి ఈ సమస్య ఉంది.

జీఎల్‌పీ–1 అంటే.. 
మన జీర్ణకోశంలో ఉత్పత్తయ్యే ఒక హార్మోన్‌ ఇది. ఆకలిని నియంత్రిస్తుంది. కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఇన్సులిన్‌ విడుదలను ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియను నెమ్మదింపజేయడం, ఆకలిని తగ్గించడం ద్వారా టైప్‌–2 మధుమేహం, ఊబకాయం చికిత్సలో జీఎల్‌పీ–1 మందులు దోహదపడతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement