అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరాన్‌లో నిరసనల్లో అరెస్టైన వందలాది మందిని ఉరి తీయాలని తొలుత అక్కడి ప్రభుత్వం భావించింది. ఈ పరిణామం అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే.. ఏమైందోగానీ వాటిని వాయిదా వేసింది. అయితే.. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు పూర్తిగా రద్దు చేసిందట. ఈ విషయాన్ని ట్రంపే స్వయంగా ప్రకటించారు.
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఇలా చెప్పుకొచ్చారు.. నిన్న జరగాల్సిన 800కిపైగా ఉరి శిక్షలను ఇరాన్ నాయకత్వం రద్దు చేసింది. ఈ పని చేసినందుకు ధన్యవాదాలు. ఈ చర్యతో వాళ్లపై గౌరవం పెరిగింది’’ అంటూ పోస్ట్ చేశారు. నిన్న మొన్నటిదాకా సైనిక చర్యకు ఉవ్విళ్లూరిన ట్రంప్.. హఠాత్తుగా ఇలా వెనక్కి తగ్గడం అమెరికా–ఇరాన్ సంబంధాల విషయంలో ఒక కొత్త మలుపు అనే చెప్పొచ్చు.
ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, రాజకీయ ఆంక్షలు, మహిళల స్వేచ్ఛ అణచివేత.. ఈ కారణాలతో ఇరాన్ వ్యాప్తంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ఖమేనీ ప్రభుత్వం గద్దె దిగాలని.. బహిష్కృత యువరాజు రెజా పహ్లావి తిరిగి ఇరాన్‌లో అడుగుపెట్టాలని నినాదాలతో ప్రధాన నగరాలను అట్టుడికి పోయేలా చేశారు. అయితే వేలాది మంది నిరసనకారులు అరెస్టు అయ్యారు. వాళ్లను విదేశీ శక్తులకు సహకరించే శక్తులుగా పేర్కొంటూ ఉరి తీయాలని ఖమేనీ ప్రభుత్వం, అక్కడి న్యాయవ్యవస్థ నిర్ణయించింది.
ఇదీ చదవండి: ఎప్పుడేం చేయాలో ట్రంప్‌నకు తెలుసు
‘‘ఇంటర్నెట్ బ్లాకౌట్ జరిగిన వెంటనే.. 3 వేల మంది విదేశీ గూఢచారులను అరెస్టు చేశాం. గూఢచర్యం నేరానికి ఇరాన్‌లో మరణశిక్ష ఉంటుంది. మేం అరెస్టు చేసిన విదేశీయులంతా నిరసనకారుల ముసుగులో అల్లర్లను రెచ్చగొట్టారు. వారంతా సుశిక్షితులైన ఉగ్రవాదులు’’ అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని మానవ హక్కుల సంస్థలు, అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి.
అమెరికా అధ్యక్షుడు కూడా ముందుగా ఇరాన్ చర్యలపై హెచ్చరికలు జారీ చేసి.. శిక్షలు అమలు చేస్తే సైనిక చర్యలు తీసుకోవచ్చని సూచించారు. అదే సమయంలో ఇరాన్‌తో చర్చలు ఉండొచ్చనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆందోళనకారుల విషయంలో వెనక్కి తగ్గబోమని ఇరాన్ ప్రకటించడంతో ఆయన మరోసారి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అయితే ఈ విషయంలో ఇరాన్ అనూహ్యంగా వెనక్కి తగ్గడం, ట్రంప్ ధన్యవాదాలు తెలపడం ఒక విధంగా ఉద్రిక్తతలను తగ్గించే సంకేతంగా కనిపిస్తోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అమెరికా-ఇరాన్ మధ్యవర్తిత్వం విషయంలో ఏం జరిగిందో ఎవరికీ స్పష్టత లేదు. గల్ఫ్ దౌత్యం చేశాయని ప్రచారం ఉంది. అయితే ఎలాంటి ఒప్పందం కుదిరిందో(అణు చర్చకు సంబంధించి), లేదంటే చర్చల పురోగతిలో ఇది ముందడుగు మాత్రమేనా? అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ తాను చేసిన ఒత్తిడి వల్లే ఇరాన్ ఈ నిర్ణయం వెనక్కి తీసుకుందని కలరింగ్ ఇచ్చుకునే అవకాశం ఉంది. మరోవైపు.. అంతర్జాతీయంగా ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చి ట్రంప్‌ను వెనక్కి తగ్గేలా చేశామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించుకుంది కూడా.
కొసమెరుపు.. ఒకవైపు నిరసనకారుల మరణశిక్ష విషయంలో ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గగా.. వారందరినీ చంపేయాలంటూ అక్కడి మత పెద్ద ఒకరు ఫత్వా జారీ చేశారు. రాజధాని టెహ్రాన్‌కు చెందిన అహ్మద్ ఖటామీ అనే మతాధికారి శుక్రవారం ప్రార్థనల అనంతరం.. ‘‘ఇది దేవుని తీర్పు. అల్లాహ్ మా వెనక ఉన్నాడు. ఇరాన్ ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధానికి మానసికంగా సిద్ధంగా ఉంది’’ అంటూ జనం కోలాహలం మధ్య ప్రకటించాడు.


