పూర్తి సంయమనం పాటించాలని అమెరికాను కోరిన మధ్యప్రాచ్య దేశాలు
సైనిక చర్యకు దిగితే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని ఆందోళన
ఇరాన్‌పై దాడుల ఆలోచన లేదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ విషయంలో పూర్తి సంయమనం పాటించాలని అమెరికాతో సన్నిహితంగా మెలిగే పలు మధ్య ప్రాచ్య దేశాలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇరాన్‌పై దాడులు చేయొద్దని అమెరికాను కోరినట్లు అరబ్ దౌత్యవేత్త ఒకరు చెప్పారు. అయతొల్లా అలీ ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్‌పై సైనిక చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజులుగా సంకేతాలిస్తున్నారు.
నిరసనకారులపై దమనకాండ ఆపకపోతే భీకర దాడులకు దిగుతామని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల పట్ల ఈజిప్టు, ఒమన్, సౌదీ అరేబియా, ఖతార్ తదితర దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయాదేశాల అత్యున్నత దౌత్యవేత్తలు తాజాగా సమావేశమై చర్చించుకున్నారు. ఇరాన్‌పై ఇప్పుడు సైనిక చర్యకు పాల్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుందని పేర్కొన్నారు.
ఇప్పటికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను మరింత అస్థిరంగా మార్చొద్దని విన్నవించారు. మధ్యప్రాచ్య దేశాల విజ్ఞప్తిని ట్రంప్ మన్నించినట్లే కనిపిస్తోంది. ఆయన కొంత మెత్తబడ్డారు. ఇరాన్‌పై దాడులకు దిగే ఆలోచన లేదని ప్రకటించారు. సానుకూల సంకేతాలు రావడంతో గురువారం చమురు ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. 26 ఏళ్ల యువకుడు ఇర్ఫాన్ సుల్తానీకి విధించిన మరణ శిక్షను ఇరాన్ ప్రభుత్వం రద్దు చేయడంపై ఫాక్స్‌న్యూస్‌లో ప్రచురితమైన వార్తను ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టుచేశారు.
ఎప్పుడేం చేయాలో ట్రంప్‌కు తెలుసు
మరోవైపు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లెవిట్ భిన్న స్వరం వినిపించారు. ఇరాన్‌ను డీల్ చేసే విషయంలో అన్ని రకాల ఐచి్ఛకాలు ట్రంప్ చేతిలో ఇప్పటికీ ఉన్నాయని స్పష్టంచేశారు. ఎప్పుడేం చేయాలో ఆయనకు తెలుసని ఉద్ఘాటించారు. ఇరాన్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని వెల్లడించారు.
ఆగని ఆందోళనలు
ఇరాన్‌లో పరిస్థితులు కుదుటపడే సూచనలు కనిపించడం లేదు. ఖమేనీ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. జనం వీధుల్లోకి వచి్చ, ఖమేనీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటిదాకా కనీసం 2,637 మంది మరణించారు. వాస్తవ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని స్థానిక ప్రసార మాధ్యమాలు చెబుతున్నాయి.
ఆ ఆలోచన ఇంకా ఉంది
ఇరాన్ సైనిక చర్య అనే ఆలోచన ఇంకా ఉందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ పేర్కొన్నారు. గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశం జరిగింది. అమెరికాతోపాటు ఇరాన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మైక్ వాల్జ్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో ప్రజల ఊచకోతను ఆపడానికి ట్రంప్ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అందుకోసం అన్ని రకాల అవకాశాలను ఆయన ఉపయోగించుకుంటారని, ఆ విషయం ఇరాన్ నాయకత్వానికి బాగా తెలుసని స్పష్టంచేశారు.


