ఇరాన్, ఇజ్రాయెల్ నేతలకు పుతిన్ ఫోన్
మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకుంటున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని, సంబంధిత పక్షాలతో నిర్మాణాత్మక చర్చలను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో మాట్లాడిన పుతిన్.. ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో పరిస్థితులపై చర్చించారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది.
ప్రాంతీయ స్థిరత్వం, భద్రత కోసం రాజకీయ, దౌత్యపరమైన ప్రయత్నాలకు సానుకూలంగా ఉన్నామని చెప్పారు. అన్ని స్థాయిల్లో సంబంధాలను కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకరించారని క్రెమిన్ వెల్లడించింది. అదేవిధంగా, ఆర్థిక సమస్యల కారణంగా కొనసాగుతున్న నిరసనలను చల్లార్చి, దేశంలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్‌లో పుతిన్‌కు వివరించారని కూడా తెలిపింది.
ఐరాసతోపాటు ఇతర ప్రపంచ వేదికలపై ఇరాన్ వైఖరికి మద్దతు తెలిపేందుకు అంగీకరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పెజెష్కియాన్ ధన్యవాదాలు తెలిపినట్లు ఇరాన్ వార్తా సంస్థ తెలిపింది. ఇలా ఉండగా, ఇరాన్ అణు నిరాయు«దీకరణకు అంగీకరిస్తే ఈ సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం లభించినట్లేనని ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ చెప్పారని టాస్ పేర్కొంది. అలా జరక్కుంటే పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా తెలిపింది.


