సౌదీ అరేబియా నుంచి సూడాన్, లిబియా వరకు పాకిస్తాన్ సైనిక ఉనికి, ఆయుధాల విక్రయ పరిధి క్రమంగా విస్తరిస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. సుడాన్‌కు యుద్ధ విమానాలు సహా ఆయుధాలను విక్రయించేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతోంది.
పాకిస్తాన్–సుడాన్ దేశాలు సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుడాన్‌లో సైన్యం, పారామిలిటరీ సంస్థ అయిన రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) మధ్య గత దాదాపు మూడేళ్లుగా తీవ్ర అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ సంఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మహిళలు, పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలను ఆర్ఎస్ఎఫ్ ఎదుర్కొంటోంది.
అరబ్, ఆఫ్రికా దేశాల్లో ఆయుధాల విక్రయాలు, సైనిక ప్రభావాన్ని విస్తరించడం పాకిస్తాన్ దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది. గతంలో పాకిస్తాన్ ప్రధానంగా అరబ్ దేశాల సాయుధ దళాలకు శిక్షణ అందించే పాత్రకే పరిమితమై ఉండగా, ఇప్పుడు నేరుగా ఆయుధాలు, యుద్ధ విమానాల ఎగుమతుల వైపు అడుగులు వేస్తోంది.
ఈ ఒప్పందంలో ప్రధానంగా చర్చకు వస్తున్నది JF-17 థండర్ యుద్ధ విమానం. ఇది పాకిస్తాన్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేలికపాటి, బహుళ-పాత్ర యుద్ధ విమానం. పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్, చైనాకు చెందిన చెంగ్డూ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ కలిసి దీనిని తయారు చేస్తున్నాయి. తాజా బ్లాక్-3 వెర్షన్‌లో ఆధునిక రాడార్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతికత, సుదూర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉన్నాయి.
ఒక్కో JF-17 యుద్ధ విమానం ధర సుమారు 25 నుంచి 30 మిలియన్ డాలర్లుగా అంచనా. ఇది పాశ్చాత్య దేశాల యుద్ధ విమానాలతో పోలిస్తే చాలా తక్కువ కావడంతో, పరిమిత రక్షణ బడ్జెట్ ఉన్న దేశాలకు ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.


