నేడు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
నెల్లూరులో నీట మునిగిన పంటలు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు
సాక్షి, అమరావతి/నెల్లూరు (అర్బన్)/తిరుమల/సాక్షి, చెన్నై: తీవ్ర వాయుగుండం తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా గంటకు 5 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. సోమవారం సాయంత్రానికి ఇది చెన్నైకి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 130, కడలూరుకు 150, నెల్లూరుకు 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమేపీ బలహీనపడుతోంది. దీని ప్రభావంతో మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
స్తంభించిన ‘నెల్లూరు’
నెల్లూరు జిల్లాను దిత్వా తుపాను వణికిస్తోంది. వాయుగుండం బలహీన పడి నెల్లూరుకు దగ్గరగా వస్తున్న నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. మూడు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తుండగా, ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో జనజీవనం స్తంభించింది. సముద్రంలో అలలు ఎగిసి పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకువచి్చంది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. దీనికితోడు చలి కూడా ఎక్కువగా ఉంది. తుపాను ప్రభావంతో జిల్లాలో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
చేజర్ల మండలంలోని నల్లవాగుకు ప్రవాహం పెరగడంతో యనమదల, తూర్పుకంభంపాడు, తూర్పుపల్లి తదితర ఐదు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్దవాగుకు నీటి ప్రవాహం పెరిగింది. బొగ్గేరు, బీరాపేరుకు ఓ మోస్తరు వరద పెరిగింది. విడవలూరు మండలంలోని మలిదేవి డ్రైన్, పైడేరులకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే పలుచోట్ల చెరువులు నిండిపోయాయి.
అవి ఎక్కడ తెగిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమశిల నుంచి పెన్నానదిలోకి 35 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాల నిండా నీరు చేరడంతో నాట్లు, నారుమళ్లు కుళ్లిపోతాయేమోనని రైతులు భయపడుతున్నారు. నెల్లూరు శివారు ప్రాంతాలైన ఆర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, వైఎస్సార్ నగర్, పడారుపల్లి, కల్లూరుపల్లి, రాజీవ్ గృహకల్ప, సాయినగర్, జనార్ధన్‌రెడ్డినగర్ ప్రాంతాల్లో వర్షం నీరు నిలబడిపోయింది.
తిరుమలలో వర్షం
తుపాను కారణంగా తిరుమలలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శ్రీవారి ఆలయ ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. దట్టమైన పొగమంచు తిరుమల కొండలను కమ్మేసింది.
చెన్నైలో కుండపోత
బలహీన పడ్డ దిత్వా తుపాన్ తీవ్ర వాయుగుండంగా మారడంతో చెన్నైలో సోమవారం అనేక చోట్ల భారీ వర్షం పడింది. మంగళవారం మరింతగా భారీ వర్షాలు పడుతాయనే హెచ్చరికలతో చెన్నై, శివారు జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో చెన్నై తీరానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా రూపంలో చిరు జల్లుల వాన మొదలైంది.
ఇది చెన్నైకు 50 కి.మీ దూరంలో ఏడు గంటలకు పైగా కేంద్రీకృతం కావడంతో క్రమంగా వర్షం ప్రభావం పెరిగింది. చెన్నై, శివారులలోని తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. అర్ధరాత్రి సమయంలో లేదా మంగళవారం ఉదయం చెన్నె తీరానికి 30 కి.మీ దూరంలోకి తీవ్ర వాయుగుండంగా మారిన దిత్వా సమీపిస్తుందని, ఈసమయంలో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు జిల్లాలకు మంగళవారం రెడ్ అలర్ట్ ప్రకటించారు.


