వీఐపీ టికెట్ల జారీలో తీవ్రజాప్యం
తిరుమల/తిరుపతి క్రైమ్: తిరుమలలో వీఐపీ దర్శనం టికెట్లు జారీ చేసే సర్వరు సోమవారం స్తంభించింది. ఎస్‌ఎంఎస్‌లు వచ్చిన భక్తులకు పేమెంట్ చెల్లించడానికి వీలు కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఎంబీసీ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్లు కొనుగోలు చేయాలని టీటీడీ భక్తులకు సూచించింది. వారంతా ఎంబీసీ 34 వద్ద క్యూ కట్టడం గమనార్హం. ఇది బ్యాంకర్స్ ద్వారా తలెత్తిన సమస్యగా టీటీడీ గుర్తించింది.
ఇదిలా ఉండగా తిరుపతిలో సోమవారం ఓ హోటల్‌కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కపిల తీర్థం సమీపంలో ఉన్న రాజ్ పార్క్ హోటల్‌లో బాంబు పెట్టామని, కాసేపట్లో పేలిపోతోందని గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు మెయిల్ పంపారు. దీంతో సీఐ రామకిషోర్ బృందం, బాంబ్ స్క్వాడ్ హోటల్లోని గదులు, బాత్‌రూములు మొత్తం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ఎస్వీ యూనివర్సిటీలో బాంబు పెట్టామని ఉత్తుత్తి బెదిరింపులు చేసిన సంగతి తెలిసిందే.


