సీఎం చంద్రబాబుపై బొత్స ఆగ్రహం
ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట
సాక్షులను, ఫిర్యాదుదారులను బెదిరిస్తున్నారు
తద్వారా కేసులను మూసివేయించుకుంటున్నారు
ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాలని గవర్నర్‌కు విజ్ఞప్తి
న్యాయపోరాటానికి సిద్ధమని ప్రకటన
సాక్షి, అమరావతి: అవినీతి కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక వాటి నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసైన్డ్ భూముల కుంభకోణం కేసు, తాజాగా మద్యం కుంభకోణం కేసును మూసేయించుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ కేసుల్లో ఫిర్యాదుదారులైన అధికారులు కొందరిని లేని స్కాంలలో ఇరికించి.. భయపెట్టి.. ఫిర్యాదును వెనక్కి తీసుకునేలా చేస్తే, మరికొందరితో కూడా అడ్డదారుల్లో ఫిర్యాదులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు.
దర్యాప్తు సంస్థలు సైతం కేసుల మూసివేతకు సహకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్‌పై ఉన్న చంద్రబాబు ఇలాంటి చర్యలకు పాల్పడ్డం అత్యంత దుర్మార్గమన్నారు. దేశంలో ఎక్కడా ఇంతటి అధికార దుర్వినియోగాన్ని చూడలేదన్నారు. తక్షణమే చంద్రబాబు అధికార దుర్వినియోగాన్ని నిలువరించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు చర్యలపై న్యాయపోరాటం చేస్తామని కూడా బొత్స హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ముఖ్యాంశాలు..
కుట్రపూరితమే..
‘ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి కేసులు మూసివేయిస్తున్నారు. వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబునాయుడికి అలవాటే. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించి పక్కా ఆధారాలు, సాక్ష్యాలతో పలు కేసులు నమోదయ్యాయి. స్కిల్ స్కాం కేసులో ప్రాథమిక ఆధారాలు ఉండడంతో చంద్రబాబును కోర్టు జ్యుడిషియల్ రిమాండ్‌కు కూడా పంపింది.
ఆ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. ఇవికాక అసైన్డ్ ల్యాండ్ కేసు, అమరావతి రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ కేసు, ఉచిత ఇసుక పేరుతో దోపిడీచేసిన వ్యవహారంలో కేసు, ఫైబర్ నెట్‌లో వందలకోట్ల అవినీతికేసు సహా లిక్కర్ కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ కేసుల దర్యాప్తులో పురోగతి లేదు. దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని, ప్రతి క్షణం కేసులను నిర్వీర్యం చేయడానికి బాబు సర్కార్ ప్రయత్నిస్తోంది. ఈ ధోరణిని సహించబోము’ అని బొత్స స్పష్టం చేశారు.


