ఆధారాల్లేవన్న బాబు గూటిచిలుక సీఐడీ
ప్రభుత్వ వేధింపులకు తలొగ్గిన ఫిర్యాదుదారు వాసుదేవరెడ్డి
సాక్షి, అమరావతి: చంద్రబాబు బరి తెగించి సాగించిన మద్యం దోపిడీ దందాకు టీడీపీ గూటి చిలుక సీఐడీ ‘పచ్చతర్పణం’ వదిలేసింది! ఆ కేసులో ఆధారాలు లేవని న్యాయస్థానానికి నివేదించింది. తద్వారా ఆ కేసు మూసివేతకు మార్గం సుగమం చేసింది. 2014–19లో టీడీపీ హయాంలో చంద్రబాబు సాగించిన అవినీతి దందాపై నమోదైన కేసుల మూసివేత కుట్రలో మరో అంకాన్ని ముగించింది. మద్యం దోపిడీ కేసులో నిందితుడైన చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో సీఐడీ ఆయన గూటి చిలుకగా మారిపోయింది. అదే అదనుగా తన మద్యం దోపిడీ కేసు అర్ధాంతరంగా మూసివేతకు చంద్రబాబు చకచకా పావులు కదిపారు.
నిందితుడైన ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో పోలీసు, సీఐడీ అధికారులతో ఆ కేసులపై సమీక్ష నిర్వహించి కుట్రకు తెరతీశారు. ఆ కేసును ఎలా క్లోజ్ చేయాలో ఆయనే దిశానిర్దేశం చేసినట్టు అప్పుడే స్పష్టమైంది. ఆ బాధ్యతను చంద్రబాబు తన ఆస్థాన న్యాయవాది సిద్ధార్థ లూథ్రాకు అప్పగించడంతోపాటు మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రస్తుత డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్‌లకు ప్రత్యేక బాధ్యతలు కేటాయించారు. మొత్తం రాజ్యాంగ వ్యవస్థలను బరితెగించి దుర్వినియోగం చేస్తూ మద్యం దోపిడీ కేసు మూసివేత ద్వారా కుట్రలో ఓ అంకాన్ని పూర్తి చేశారు.
చీకటి జీవోలతో మద్యం దోపిడీ...
రాష్ట్రంలో 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే చంద్రబాబు మద్యం దోపిడీకి తెగబడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతి గానీ కేబినెట్ ఆమోదం గానీ లేకుండానే 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు 216, 217 జారీ చేసింది.
తద్వారా 2015 నుంచి 2019 వరకు నాలుగేళ్లలో ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండికొట్టింది. ఇక 4,840 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు మరో 4,840 పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు, బార్లు అన్నీ టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. మిగిలిన డిస్టిలరీలకు కూడా అంతకుముందు ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చాయి. అంతేకాదు.. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా బాబు సర్కారే! ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి మరో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది.
మొత్తం మీద 2014–19లో రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై ఉన్నారు.
అబ్బే..! ఆధారాల్లేవ్
2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ కేసును అటకెక్కించింది. కేసు దర్యాప్తును నిలిపివేసింది. చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అప్పటి బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని వేధించి బెంబేలెత్తించింది. ఆయనపై కేసులు నమోదు చేసి లొంగదీసుకుంది. చంద్రబాబుపై గతంలో ఇచ్చిన కేసును వాపసు తీసుకోవాలని బెదిరించింది. అనంతరం పక్కాగా కుట్ర కథ నడిపింది. టీడీపీ హయాంలో మద్యం కుంభకోణంపై ఆధారాలు లేవని న్యాయస్థానానికి నివేదించింది. తద్వారా కేసు క్లోజ్ కావటానికి మార్గం సుగమం చేసింది.
దీనిపై స్పందించి సమగ్ర దర్యాప్తు కోరాల్సిన వాసుదేవరెడ్డి.. కూటమి ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గారు. ఆ మద్యం కేసు మూసివేతకు తనకు అభ్యంతరం లేదని తెలిపినట్లు సమాచారం. అంటే గతంతో తాను ఇచ్చిన ఫిర్యాదు, వాంగ్మూలాలకు వ్యతిరేకంగా ఆయన ప్రస్తుతం వ్యవహరించారు. తద్వారా ఆ కేసు మూసివేతకు ఆయన సహకరించారని తెలుస్తోంది. దాంతో చంద్రబాబు మద్యం దోపిడీ కేసు మూసివేతకు లైన్ క్లియర్ అయింది!


