కొత్తవి దేవుడెరుగు.. ఉన్న పెన్షన్లే దాదాపు 5 లక్షలు తగ్గుదల
ఏడాదిన్నరగా పెండింగ్‌లోనే 2.5 లక్షల దరఖాస్తులు
అర్హత ఉన్నా.. పింఛన్ దరఖాస్తుకు అవకాశం లేక మరో 3 లక్షల మందికిపైగా ఎదురుచూపులు
రీ వెరిఫికేషన్ పేరుతో లక్ష దివ్యాంగ పింఛన్లపై వేలాడుతున్న కత్తి..
వలంటీర్ వ్యవస్థతో.. అవ్వాతాతల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటివద్దే సాగిన ప్రక్రియను రోడ్డుకీడ్చిన బాబు సర్కారు
పింఛన్ల పంపిణీని పార్టీ కార్యక్రమంలా మార్చేసి స్వీయ ప్రచారం..
ఎండావానలో అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువుల అవస్థలు
50 ఏళ్లకే పింఛన్ హామీకీ బాబు సర్కారు మంగళం
ఐదేళ్లలో 29.51 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం
అర్హులందరికీ సంతృప్త స్థాయిలో ప్రయోజనం చేకూర్చి మేలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ హయాంలో ఎన్నికల నాటికి అత్యధికంగా ఇచ్చిన పింఛన్లు 66.34 లక్షలు..! చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 1వతేదీ రాత్రి సమయానికి పంపిణీ చేసిన పెన్షన్లు 59.11 లక్షలు! పోనీ గత నెలలో చూసినా.. నవంబర్ 1న బాబు సర్కారు పంచిన పెన్షన్లు 61.64 లక్షలే!! అంటే.. గత 18 నెలల వ్యవధిలో ఏకంగా దాదాపు ఐదు లక్షల పింఛన్లు ఎగిరిపోయాయ్!
రాష్ట్రంలో దాదాపుగా తొలిరోజే పింఛన్లు తీసుకునే లబ్ధిదారులే అత్యధికంగా ఉంటారు. దీన్నిబట్టి ఎలా చూసినా గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే చంద్రబాబు సర్కారు వచ్చాక దాదాపు ఐదు లక్షల పింఛన్లు తగ్గినట్లు తెలిసిపోతోంది. మరి ఇది సుపరిపాలనా? ప్రజలకు మంచి చేసినట్లా? సూపర్ సిక్స్‌లు అమలు చేసినట్లా? కొత్త పెన్షన్లు ఇచ్చినట్లా? టీడీపీ కూటమి ప్రభుత్వం అవ్వాతాతలతోపాటు దివ్యాంగులనూ కనికరించడం లేదు. రీ వెరిఫికేషన్ పేరుతో నోటీసులిచ్చి దాదాపు లక్ష మంది దివ్యాంగులపై కత్తి వేలాడదీసింది! ఇలా ఒకవైపు పెన్షన్లు ఎగరగొడుతూ.. మరోవైపు ఈ నెలలో 8,190 మందికి కొత్త పింఛన్లు ఇచ్చినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెండు రోజుల క్రితం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం.
ఇక పింఛన్ల పంపిణీని చంద్రబాబు ప్రభుత్వం స్వీయ ప్రచార వేదికగా, పార్టీ కార్యక్రమంలా మార్చేసింది. గత ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటివద్దే గుడ్‌మార్నింగ్ చెప్పి మరీ వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఠంచన్‌గా పెన్షన్లు పంపిణీ సాగగా... ఇప్పుడు చంద్రబాబు సర్కారు అవ్వాతాతలను, దివ్యాంగులను, వితంతువులను రోడ్డుకీడ్చి పడిగాపులు కాసేలా చేసింది. ఉదయం పూట ఇవ్వాల్సిన పింఛన్లు కాస్తా సోమవారం తిరుపతిలోని జీవకోనలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో మధ్యాహ్నం 12:30 గంటలకు వానలో గుంపులుగా నిల్చోబెట్టి అరకొరగా అందజేశారు.

దరఖాస్తులకే దిక్కులేదు.. పంపిణీ పేరుతో పబ్లిసిటీ!
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు ప్రక్రియ కూడా నిలిచిపోయింది. కొత్తగా 60 ఏళ్లు నిండినవారు, వితంతువులకు అర్హత ఉన్నా గత 18 నెలలుగా పింఛనుకు దరఖాస్తు కూడా చేసుకునే అవకాశం లేకుండా చేసింది. కనీసం ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా అందుబాటులోకి తేలేదు. ఒకవైపు దరఖాస్తులను తొక్కిపెడుతూ మరోవైపు పంపిణీ పేరుతో పార్టీ ప్రచార కార్యక్రమాలను రక్తి కట్టిస్తోంది. గ్రామాల్లో టీడీపీ నేతలంతా సచివాలయాల ఉద్యోగులతో కలసి పింఛన్ల పంపిణీలో పాల్గొని ఫోటోలు దిగి ప్రచారం చేయాలని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ కావడం గమనార్హం. దీనికి అనుగుణంగా టీడీపీ ప్రజా ప్రతినిధులు హడావుడి చేస్తున్నారు. పాత పింఛనుదారులకే ఇప్పుడే కొత్తగా ఇచ్చినట్లు ప్రచారం చేశారు.
పెండింగ్‌లో 2.5 లక్షల దరఖాస్తులు..
దాదాపు రెండున్నర లక్షల మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోగా చంద్రబాబు ప్రభుత్వం వాటిని ఏడాదిన్నరకుపైగా పెండింగ్‌లో పెట్టింది. మరోవైపు అర్హత ఉన్నప్పటికీ కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేక పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు సుమారు మరో 3 లక్షలమందికిపైగా ఉంటారని అంచనా.
50 ఏళ్లకే పింఛన్ హామీ గాలికి..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే రూ.నాలుగు వేల చొప్పున పింఛన్ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఒకపక్క ఉన్న పింఛన్లనే ఎగరగొడుతూ.. దరఖాస్తులను తొక్కిపెడుతూ నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్న
చంద్రబాబు సర్కారు 50 ఏళ్లకే పెన్షన్ హామీని గాలికి వదిలేసింది.
ఐదేళ్లలో 29.51 లక్షల కొత్త పెన్షన్లు
వైఎస్సార్ సీపీ హయాంలో వృద్ధాప్య పింఛను అర్హత వయసును 60 ఏళ్లకు తగ్గించడంతో మరింత మందికి ప్రయోజనం చేకూరింది. అర్హులు ఏడాదిలో ఏ రోజైనా సరే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునేందుకు గత ప్రభుత్వం అవకాశం కల్పించింది. చివరిగా 2024లో జనవరి ఆరంభంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అర్హులైన అవ్వాతాతలకు కొత్త పింఛన్లు మంజూరు చేసింది. ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా 29.51 లక్షల మందికి కొత్త పింఛన్లు మంజూరు చేసినట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) స్వయంగా ప్రకటించడం గమనార్హం.
ఇంటి పన్ను చెల్లిస్తేనే పింఛన్
ప్రత్తిపాడు రూరల్: ఇంటి పన్నుకు, పింఛన్లకు చంద్రబాబు సర్కారు ముడి పెడుతోంది. ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇస్తామని సచివాలయ సిబ్బంది హుకుం జారీ చేశారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలోని 23 గ్రామ పంచాయతీల్లో సోమవారం 11,463 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 10,500 మందికే పంపిణీ చేశారు. మండలంలోని పోతులూరులో పింఛన్ల పంపిణీలో ఇంటి పన్నులు వసూలు చేసినట్లు పలువురు లబ్ధిదారులు చెప్పారు. ఈ విషయాన్ని వారు స్థానిక వైఎస్సార్‌సీపీ నేత శెట్టి సత్తిబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
దీనిపై స్పందించిన సత్తిబాబు స్థానిక గ్రామ కార్యదర్శిని నిలదీశారు. అప్పటికే పింఛన్ల పంపిణీ ముగిసింది. సత్తిబాబు మాట్లాడుతూ..గ్రామంలో ఇంటి పన్ను కడితేనే పింఛన్లు ఇచ్చారని చెప్పారు. ఇలా బలవంతంగా ఇంటి పన్నులు వసూలు చేయడం గతంలో ఎన్నడూ జరగలేదని సత్తిబాబు అన్నారు. దీనిపై ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్‌బాబును వివరణ కోరగా, స్వచ్ఛందంగా ముందుకు వచి్చనవారి వద్ద మాత్రమే పన్ను వసూలు చేసి, రశీదులు ఇచ్చామని చెప్పారు.


