రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న శైలజానాథ్, వైఎస్సార్‌సీపీ నాయకులు
అనంతపురంలో కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా
శైలజానాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ
అనంతపురం: ఆరుగాలం పంటను పండించిన అనంత రైతన్న.. దాన్ని అమ్ముకోలేక పొలాల్లోనే ట్రాక్టర్‌తో దున్నేసే పరిస్థితి నెలకొందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆవేదన వ్యక్తంచేశారు. రైతును పూర్తిగా విస్మరించిన చంద్రబాబు సర్కార్ తీరును నిరసిస్తూ సోమవారం శైలజానాథ్ నేతృత్వంలో అనంతపురంలో అరటి రైతులు కదం తొక్కారు. ఓటీఆర్‌ఐ నుంచి కలెక్టరేట్ వరకూ అరటి గెలలతో వినూత్న నిరసన తెలిపారు.
అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శైలజానాథ్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో రైతులు వేలాది మంది పాల్గొన్నారు. అరటి గెలలను తీసుకొచ్చి కలెక్టరేట్ ఎదుట పడేశారు. ‘కేజీకి రెండు రూపాయలకు కూడా కొనుగోలు చేసే వారు లేరు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త శైలజానాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అరటి పంటలను తక్షణం ప్రభుత్వం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.


