చంద్రబాబు సర్కారు చేపట్టిన ‘రైతన్నా మీ కోసం’ అట్టర్‌ ఫ్లాప్‌ | AP GOVT intraduced Raithanna mee kosam big disaster | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారు చేపట్టిన ‘రైతన్నా మీ కోసం’ అట్టర్‌ ఫ్లాప్‌

Dec 2 2025 3:08 AM | Updated on Dec 2 2025 3:08 AM

AP GOVT intraduced Raithanna mee kosam big disaster

అన్నదాతల దగ్గరకు వెళ్లలేక మొహం చాటేసిన సీఎం, ఆయన బృందం

తొలిరోజే హడావుడి... మరునాటి నుంచి పత్తా లేని మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. 

మొదటి రోజే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన 

నిలదీస్తూ వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితి 

18 నెలల్లో ఏం మేలు చేశారంటూ కడిగేసిన అన్నదాతలు.. 

స్వయంగా పాల్గొంటానన్న చంద్రబాబు... తర్వాత రైతుల ఊసెత్తని వైనం 

యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసే బాధ్యత ఆర్‌బీకే సిబ్బందికి అప్పగింత 

ఏం చేశామని చెబుతాం...? ఏం మొహం పెట్టుకుని వెళ్తామన్న నేతలు

సాక్షి, అమరావతి:  ప్రకటన ఆర్భాటం... ఆచరణ అధ్వానం..! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల అమలు తీరు. ఈ కోవలోనే ‘రైతన్నా మీ కోసం’ అంటూ హడావుడి చేశారు. కానీ, హామీల ఎగవేత తప్ప ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేకపోవడం, అన్న­దాత సుఖీభవ అంటూ దగా చేయడం, విప­త్తుల వేళ ఆదుకోకుండా గాలికి వదిలేయడంతో తొలిరోజే అన్నదాతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. దీంతో రెండో రోజు నుంచే మొహం చాటేశారు. కనీసం కరపత్రాలు కూడా పంచే సాహసం చేయలేకపోయారు. ప్రతి నెల సామాజిక పింఛన్ల పంపిణీలో ఫొటో షూట్‌తో నా­నా హంగామా చేస్తున్న సీఎం చంద్రబాబు రైతుల గడప తొక్కలేకపోయారు.

 రైతుల కోసం ప్రాణం ఇస్తానంటూ ఎన్నికల్లో నమ్మబలికిన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అయితే పత్తా లేరు. వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సైతం కూడా రైతుల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలే కాదు చివరకు స్థానిక ప్రజా ప్రతినిధులకూ హాజరయ్యేందుకు ధైర్యం చాల్లేదు. ఫలితంగా ‘రైతన్నా మీ కోసం’ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. అసలు ఈ కార్యక్రమం కోసం పైసా కూడా విదిల్చ లేదంటేనే చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోంది. 

పంచసూత్రాల్లేవ్‌.. ఇంటింటికీ పోలేదు.. 
‘‘నేనూ రైతు బిడ్డనే. రాష్ట్రంలోని ప్రతి కర్షకుడి కష్టం నాకు తెలుసు. మీతో కలిసి నడవడానికి మీ సమస్యలు పరిష్కరించడానికి, మీకు పూర్తిగా అండగా ఉండేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం’’ అంటూ ‘రైతన్నా మీ కోసం’పై ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు గొప్పలు పోయారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వం గత ఏడాదిన్నరలో ఏం చేసిందో చెబుతామన్నారు. కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు, నేతలతో పాటు అధికారులు కూడా పాల్గొంటారని, తానూ రైతుల ఇళ్లకు వెళ్తానని సీఎం స్వయంగా ప్రకటించారు. రైతును రాజును చేసేందుకు పంచ సూత్రాల పేరిట ముద్రించిన కరపత్రాలను అందించడంతో పాటు ప్రత్యేకంగా తెచ్చిన   ఏపీఏఐఎంఎస్‌ (ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణ వ్యవస్థ) యాప్‌ను వారి మొబైల్‌ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయించి, దాని నిర్వహణపై అవగాహన కల్పించాలని  ఆదేశాలిచ్చారు. 

ఆచరణకు వచ్చేసరికి ఆరంభ శూరత్వంగా మిగిలిపోయింది. తొలి రోజు హడావుడి, హంగామా చేసినా రైతుల నుంచి కనీస స్పందన లేదు. సరికదా పలుచోట్ల తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచి్చంది. టీడీపీ నేతలు తప్ప కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీకి చెందిన ప్రజాప్రతినిదులు, నేతలు మచ్చుకైనా కనిపించలేదు. 

ఏ పంటకూ మద్దతు ధర లేదు.. ఇదే మీ నిర్వాకం 
‘‘మిరప మొదలు అరటి వరకు 18 నెలలుగా ఏ పంటకూ గిట్టుబాటు ధర కాదు కదా మద్దతు ధర కూడా దక్కలేదు. ధాన్యానికి సైతం తేమ శాతం వంకతో మద్దతు ధర దక్కకుండా చేస్తున్నారు. ఓ వైపు ధరలు పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం మద్దతు ధరకు సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు’’ అంటూ రైతన్నా మీ కోసంలో తొలిరోజే రైతులు ప్రజాప్రతినిధులను కడిగేశారు. మరోవైపు ‘ఉచిత పంటల బీమా ఎత్తేశారు. ప్రీమియం కట్టలేక బీమా చేయించుకోలేకపోయాం. వరుస విపత్తులతో పంటలు నష్టపోతే పైసా పరిహారం కూడా ఇవ్వలేదంటూ’ నిలదీశారు. 

ఎక్కడొచ్చింది అన్నదాత సుఖీభవ? 
అన్నదాత సుఖీభవ రెండు విడతల్లో పీఎం కిసాన్‌తో కలిపి రూ.14 వేలు జమ చేసినట్లు చెప్పి తప్పించుకుందాం అని కూటమి ప్రజాప్రతినిధులు భావించినా, ఆ సొమ్ము తమకు పడలేదంటే తమకు పడలేదని, తొలి విడతకు సంబంధించిన వినతులను కనీసం పట్టించుకోలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సమాధానం చెప్పలేక, రైతులను సముదాయించలేక జారుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో చేసేది లేక పాల్గొనలేదని పల్నాడుకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు. ‘‘అన్నదాత సుఖీభవ తొలి ఏడాది ఎగ్గొట్టాం. రెండో ఏడాది పీఎం కిసాన్‌తో కలిపి రెండు విడతల్లో రూ.14వేలు ఇవ్వడం తప్ప రైతులకు చేసిందేమి లేదు’’ అని కూటమి నేతలే బాహాటంగా చెబుతున్నారు. 

భజన మీడియా గప్‌చుప్‌.. 
సీఎం చంద్రబాబు బృందం కాలుబయటపెడితే చాలు.. అహో ఒహో అంటూ భజన చేసే పచ్చ మీడియా సైతం ‘‘రైతన్నా మీకోసం’’ గురించి ప్రస్తావించలేదు. దీంతోనే ఈ కార్యక్రమం ఎలా సాగిందో స్పష్టం అవుతోంది. రైతుల ఇళ్లకు వెళ్లినట్టు, వారు యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్టు రోజువారీ నివేదికలివ్వడం తప్ప ప్రత్యక్షంగా రైతుల ఇళ్లకు వెళ్లిన దాఖలాలు మచ్చుకైనా కని్పంచలేదు. మెజార్టీ గ్రామాల్లో రైతులనే అధికారులు పిలిపించుకుని యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి, లేదంటే మా ఉద్యోగాలు పోతాయంటూ బతిమిలాడిన పరిస్థితి నెలకొంది. 

రైతన్నా మీ కోసం ముగింపు సందర్భంగా ఈ నెల 3న ఆర్బీకేల పరిధిలో వర్కుషాపులు చేపట్టారు.  తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 
మా ఊరికి వస్తే నిలదీద్దామనుకున్నా.. ఎవరూ రాలేదు 
‘నా వయస్సు 60 ఏళ్లు.. గత 45 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది రెండు విడతల్లో రూ.10 వేలు వేసామని చెబుతున్నారు. నాకు పడలేదు. ఎవరికి పడ్డాయో కూడా తెలియదు. సొంతంగా ఏడు ఎకరాలు, కౌలుకు మూడు ఎకరాలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. అప్పు చేసి పెట్టుబడి పెట్టి టమాట, పత్తి, కూరగాయలు పండించా. అధిక వర్షాల కారణంగా పత్తి  2–3 క్వింటాళ్ల దిగుబడే రాగా, మిగిలిన పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. పత్తికి క్వింటా రూ.5 వేలకు మించి ఇవ్వడం లేదు. కేంద్రానికి తీసుకెళ్తే కొనే పరిస్థితి లేదు. ఏంచేయాలో పాలు పోవడం లేదు. రైతన్నా మీ కోసం కార్యక్రమంలో మా గ్రామానికి వస్తే నిలదీద్దామనుకున్నా. ఏ ఒక్కరూ మాఇంటికి వచ్చిన పాపాన పోలేదు.         
 -కె.తిమ్మయ్య, నలకలదొడ్డి, కర్నూలు జిల్లా 

బాబు సర్కారును రైతులు నమ్మడం లేదు 
మాటల గారడీ తప్ప రైతులకు కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. మద్దతు ధర దక్కక ఓవైపు అరటి, ఉల్లి, మొక్కజొన్న, సజ్జ రైతులు గగ్గోలు పెడుతుంటే ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో చంద్రబాబు అన్నదాతల గడప తొక్కలేదు. అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తానని నమ్మబలికి తొలి ఏడాది నిస్సిగ్గుగా ఎగ్గొట్టింది. రెండో ఏడాది రూ.10 వేలతో సరిపెట్టింది. కౌలు రైతులనైతే నిండా ముంచేసింది. అన్నింటా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం రైతన్నా మీ కోసం అంటూ ఆడుతున్న దొంగ నాటకాన్ని నమ్మే స్థితిలో రైతులు లేరు. 
– పి.జమలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement