మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి శ్రీకృష్ణదేవరాయ హార్టీకల్చర్ కళాశాలలో సిబ్బంది దౌర్జన్యం
ఫీజు చెల్లించలేదని విద్యార్థులను బయటే నిలబెట్టిన వైనం
రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేదంటూ తేల్చి చెప్పిన యాజమాన్యం
టీడీపీ నాయకుడి కళాశాలలోనే విద్యార్థులకు ఇబ్బందులు
అప్పులు చేసి ఫీజులు కడుతున్న తల్లిదండ్రులు
అనంతపురం: టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన శ్రీకృష్ణదేవరాయ హార్టీకల్చర్ కళాశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఫీజులు చెల్లించేంత వరకూ తరగతులకు అనుమతించేది లేదని విద్యార్థులకు తేల్చిచెప్పింది. సోమవారం కళాశాల నిర్వాహకులు 50 మంది విద్యార్థులను నిర్ధాక్షిణ్యంగా గేటు బయటే నిలబెట్టారు. మొత్తం కోర్సు ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని, పరీక్ష ఫీజు చెల్లింపునకు అనుమతిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. చాలాసేపు కార్యాలయం బయటే వేచి ఉండి.. ఇక చేసేదేమి లేక ఇంటికి వెళ్లిపోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరుకాకే తమకీ దుస్థితి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
లోకేశ్ అనాలోచిత నిర్ణయాలతోనే ఈ దుస్థితి
సీఎం చంద్రబాబు తనయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుదేలైంది. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు అస్తవ్యస్తంగా మారింది. ప్రపంచస్థాయి విద్య, క్వాంటం సెంటర్లు అంటూ ప్రచారం మినహా కళాశాలలకు సకాలంలో ఫీజు మాత్రం రీయింబర్స్‌మెంట్ చేయడం లేదు. ఉన్నత విద్యపై సమీక్ష చేసినప్పుడల్లా అదిగో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తున్నాం.. ఇదిగో ఇచ్చేస్తున్నాం. అంటూ ‘ ఎక్స్’ ఖాతాలో ట్వీట్లు చేసుకోవడంతోనే లోకేశ్ కాలం గడిపేస్తున్నారు. ఈ తంతు గతేడాది జూన్ నుంచి జరుగుతోంది. ఈ ఏడాది నవంబర్ వచ్చినా బకాయిలు చెల్లించలేదు. ఫలితంగా అవి బకాయిలు కొండలా పేరుకుపోయాయి.
ఈ ఏడాది జూలైలో కచ్చితంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామని యాజమాన్యాలకు హామీ ఇచ్చిన లోకేశ్.. అక్టోబర్ చివరిలో కంటితుడుపుగా విదిల్చారు. ఆ తర్వాత ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తిగా చెల్లించేవరకు విద్యార్థులను తరగతులకు అనుమతించాలి. విద్యార్థులు ఫీజు చెల్లించాలని ఒత్తిడి చేయకూడదు’ అని కలెక్టర్ల ద్వారా ఉత్తర్వులు జారీ చేయించారు. అయినప్పటికీ ఆ ఆదేశాలను టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాటించడం లేదు. విద్యార్థుల నుంచి నిర్బంధంగా ఫీజులు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పల్లె రఘునాథరెడ్డి కళాశాల తీరుపై తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అవమాన భారంతో అప్పులు తెచ్చిమరీ ఫీజులు చెల్లిస్తున్నారు. పాత విద్యా సంవత్సరంలో రెండు త్రైమాసికాలు, ఈ విద్యా సంవత్సరంలో పూర్తయిన మూడు త్రైమాసికాలకు కలిపి అనంతపురం జిల్లాలో రూ.90 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నట్టు విద్యార్థులు చెబుతున్నారు.


