ప్రయాణికులకు క్షమాపణలు.. ఇండిగో పైలట్‌ భావోద్వేగం | IndiGo pilots emotional apology to passengers on flight | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు క్షమాపణలు.. ఇండిగో పైలట్‌ భావోద్వేగం

Dec 9 2025 10:10 AM | Updated on Dec 9 2025 10:29 AM

IndiGo pilots emotional apology to passengers on flight

న్యూఢిల్లీ: దేశీయ విమానయాన రంగం పలు సమస్యలతో సతమతమవుతున్న తరుణంలో ఇండిగో విమానానికి చెందిన కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ చేసిన హృదయపూర్వక క్షమాపణలు ఇంటర్నెట్‌లో అందరి ప్రశంసలు అందుకుంటోంది.  ఇండిగో విమానయాన సంస్థ వరుసగా ఏడవ రోజు కూడా విమానాల రద్దులు, అదనపు జాప్యాలతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్  అందించిన సందేశం సోషల్ మీడియాలో పలువురి హృదయాలను కదిలించింది.

కొత్త పైలట్ విశ్రాంతి నిబంధనల కారణంగా కాక్‌పిట్ సిబ్బంది కొరత ఏర్పడటం అనేది ఈ అంతరాయాలకు ప్రధాన కారణంగా నిలిచింది. దీనివల్ల ఇండిగో ఆదివారం ఒక్కరోజే 650కి పైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. కాగా కెప్టెన్ కృష్ణన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. అతను విమానం ముందు భాగంలో నిలుచుని, ప్రయాణికులతో  తమిళంలో మాట్లాడారు. ‘ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. మేము వీలైనప్పుడల్లా వివరాలను అప్‌డేట్ చేస్తాం. ధన్యవాదాలు’అని అన్నారు.

ప్రయాణికులు అతని నిజాయితీని హృదయపూర్వకంగా మెచ్చుకుంటూ చప్పట్లతో స్పందించారు. ఈ వీడియోకు జత చేసిన శీర్షికలో, కృష్ణన్ తన భావాలను మరింత వివరంగా పంచుకున్నారు.. ‘క్షమించండి. ఒక విమానం కారణంగా మీరు  మీకు ముఖ్యమైనదానిని కోల్పోయినప్పుడు అది ఎంత కష్టమో నాకు పూర్తిగా అర్థమైంది. నేను మీకు హామీ ఇస్తున్నాను.. మేము సమ్మెలో లేము. పైలట్లుగా మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ఇంటికి వెళ్లాలనుకుంటున్నాం’ అని అన్నారు.

ఈ వీడియోలో కెప్టెన్ కృష్ణన్ ప్రస్తుత ఇబ్బందులను అంగీకరించారు.  ఇక్కడ చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం తన హృదయం రోదిస్తోంది’ అని  అన్నారు. కోయంబత్తూరుకు వెళ్లాల్సిన విమానం ఆలస్యం అయినప్పుడు ప్రయాణికులు నిరాశకు గురైన వైరల్ క్లిప్‌లను తాను చూశానని అన్నారు.ఈ సమయంలో ప్రయాణికుల ఓపిక, మద్దతుకు ఆయన ప్రశంసించారు. చివరగా ఆయన ‘దయచేసి మా గ్రౌండ్ సిబ్బందిపై దయ చూపండి. వారు మిమ్మల్ని ఇంటికి చేర్చడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ పైలట్‌ చూపిన వినయాన్ని పలువురు మె​చ్చుకుంటున్నారు. 

ఇది కూడా చదవండి: లడఖ్‌లో చైనా గూఢచారి?.. ఫోరెన్సిక్ పరీక్షకు ఫోన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement