లడఖ్: టూరిస్ట్ వీసా నిబంధనలను ఉల్లంఘించి, జమ్ము కశ్మీర్, లడఖ్‌లోని పలు ప్రాంతాలను సందర్శించాడన్న ఆరోపణలతో నిర్బంధించిన చైనా పౌరుడు హు కాంగ్‌టై కేసు పలు మలుపులు తిరుగుతోంది. నవంబర్ 19న ఢిల్లీకి చేరుకున్న 29 ఏళ్ల హు.. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ)లో తన పేరు నమోదు చేసుకోకుండానే లేహ్, జాంస్కార్, కశ్మీర్ లోయలోని నిషేధిత ప్రాంతాలలో తిరిగాడు.
అతని వీసాలో వారణాసి, ఆగ్రా తదితర గమ్యస్థానాల సందర్శనకు మాత్రమే అనుమతి ఉన్నప్పటికీ, ఈ నిబంధనలను ఉల్లంఘించి అతను పలు ప్రాంతాల్లో తిరిగాడని అధికారులు గుర్తించారు. హు కాంగ్‌టై తిరిగిన ప్రాంతాలలో శ్రీనగర్‌లోని హజ్రత్‌బాల్ మందిరం, శంక్రచార్య కొండ, ఆర్మీ విక్టర్ ఫోర్స్ ప్రధాన కార్యాలయానికి సమీపంలో ఉన్న అవంతిపోరాలోని బౌద్ధ శిథిలాలు తదితర సున్నిత ప్రదేశాలు ఉన్నాయి. అతని మొబైల్ ఫోన్ బ్రౌజింగ్ హిస్టరీలో సీఆర్‌పీఎఫ్, ఆర్టికల్ 370 రద్దు తదితర కీలక అంశాలకు సంబంధించిన శోధనలు కనిపించాయి.
ప్రస్తుతం హును.. బుడ్గామ్ జిల్లాలోని హుమ్‌హామా పోలీస్ పోస్ట్‌లో విచారిస్తున్నారు. విచారణ సమయంలో.. తాను బోస్టన్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రం చదివానని, గత తొమ్మిదేళ్లుగా అమెరికాలో ఉంటున్నానని, వీసా నిబంధనల ఉల్లంఘన గురించి తనకు తెలియదని చెప్పాడని సమాచారం. అయితే, అతని పాస్‌పోర్ట్‌లో అమెరికా, న్యూజిలాండ్ తదితర దేశాల సందర్శన వివరాలు ఉండడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపధ్యంలో హు కాంగ్‌టై మొబైల్ ఫోన్‌ను అధికారులు ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. తద్వారా అతను సున్నితమైన సమాచారాన్ని సేకరించి, లీక్ చేశాడో లేదో అనేది నిర్ధారించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అతని అనుమానాస్పద కదలికలు, బ్రౌజింగ్ హిస్టరీ వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసేందుకు భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. భారత్‌పై సుంకాలకు రెడీ?


