వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు భారత్‌ను దెబ్బతీసేలాంటి నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ రైతుల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు ట్రంప్ సర్కారు భారత బియ్యం, కెనడియన్ ఎరువులతో సహా వ్యవసాయ దిగుమతులపై కొత్త సుంకాలను విధించే దిశగా యోచిస్తున్నది. సబ్సిడీ పొందిన విదేశీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్లను దెబ్బతీస్తున్నాయని, దేశీయ ధరలను దిగజారుస్తున్నాయని అమెరికన్ రైతులు వైట్ హౌస్ రౌండ్ టేబుల్ సమావేశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎదుట ఆరోపించారు.
రైతుల వినతిని పరిగణలోకి తీసుకున్న ట్రంప్ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ట్రంప్ అమెరికన్ రైతుల కోసం $12 బిలియన్ల (₹1,08,156 కోట్లు) బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ సందర్భంగా రైతులు నేరుగా ట్రంప్‌తో మాట్లాడారు. భారతదేశం లాంటి దేశాలు తమ బియ్యాన్ని యూఎస్ మార్కెట్‌లలోకి తక్కువ ధరలకు డంపింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. ఇది తమకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని పేర్కొన్నారు. వెంటనే ట్రంప్ స్పందిస్తూ తమ దేశ మార్కెట్లలోకి అన్యాయంగా వస్తువులను డంపింగ్ చేస్తూ, పలు దేశాలు తమను మోసం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.
లూసియానాలోని కెన్నెడీ రైస్ మిల్ సీఈఓ మెరిల్ కెన్నెడీ, డంపింగ్‌కు ప్రధాన కారకులుగా భారతదేశం, థాయిలాండ్, చైనాలను చూపించారు. చైనా బియ్యం అమెరికా ప్రధాన భూభాగానికి బదులుగా ప్యూర్టో రికో(టెరిటరీ)లోకి తరలిపోతున్నదని తెలిపారు. ఇది తమకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. అమెరికా రైతులకు అన్యాయమైన పోటీనిస్తున్న దేశాల పేర్లను రాయమని ట్రంప్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్‌ను ఆదేశించారు. భారతదేశం తన బియ్యం పరిశ్రమను చట్టవిరుద్ధమైన సబ్సిడీలతో ఎలా ప్రోత్సహిస్తుందో కెన్నెడీ వివరించడానికి ప్రయత్నించగా, ట్రంప్ అడ్డుకుంటూ తనకు దేశాల పేర్లు చెప్పాలని కోరారు.
ట్రెజరీ కార్యదర్శి బెస్సెంట్ భారతదేశం, థాయిలాండ్ చైనాలను ఎత్తిచూపారు. వెంటనే ట్రంప్ ఈ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వాణిజ్య ఒప్పందాల కోసం కెనడా, భారతదేశం రెండూ అమెరికాతో సంబంధాలను స్థిరీకరించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా డిప్యూటీ యూఎస్‌టీఆర్ రిక్ స్విట్జర్ నేతృత్వంలోని అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయ సీనియర్ ప్రతినిధి బృందం త్వరలో భారతదేశంతో వాణిజ్య చర్చలను తిరిగి ప్రారంభించనుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి దశను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: అవినీతి చీకట్లో.. దేశాల ఆర్థిక పతనం


