లండన్: యూరప్‌ను ‘సూపర్‌ఫ్లూ’ వణికిస్తోంది. దీనిని హెచ్3ఎన్2 అని పిలుస్తారు. ఇది ఇన్‌ఫ్లుఎంజా జాతిలో భారీగా మార్పు చెందిన వేరియంట్. ‘సూపర్‌ఫ్లూ’ ఆకస్మిక పెరుగుదలతో ఆస్పత్రులన్నీ బాధితులతో నిండిపోతున్నాయి. ఇన్‌ఫ్లుఎంజా ఏ (H3N2)కు చెందిన ‘కే-స్ట్రెయిన్’ ఇప్పుడు యూకేలో దాదాపు 90శాతం ఫ్లూ కేసులకు కారణంగా నిలుస్తోంది. ఇది ఫ్రాన్స్, స్పెయిన్, ఇతర దేశాలకు కూడా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఆరోగ్య నిపుణులు దీనిని అత్యంత తీవ్రమైన ఫ్లూ వేవ్ అని హెచ్చరిస్తున్నారు. గత శీతాకాలంతో పోలిస్తే ఈసారి ఫ్లూ కేసులు మూడు రెట్లు పెరిగాయి.
ఈ సంక్షోభం యూకే ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆస్పత్రులలో పడకలు, సిబ్బంది కొరత ఏర్పడింది. పలు పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది అధికంగా గైర్హాజరవుతున్నారు. కొన్ని చోట్ల ఫ్లూ వ్యాప్తిని నిరోధించేందుకు, సామూహిక సమావేశాలను నిషేధించారు. ఫ్రాన్స్‌లోని ఆస్పత్రులలో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. స్పెయిన్‌లో ఫేస్ మాస్క్‌లు, ఫ్లూ మందులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. పలు ఫార్మసీలు ఈ డిమాండ్‌ను తట్టుకోలేక అవస్థలు పడుతున్నాయి.
ఈ సూపర్‌ఫ్లూ కారణంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఆస్పత్రులలో చేరుతున్నారు. ప్రజారోగ్య అధికారులు ఈ వ్యాప్తి కొద్దిరోజుల్లో గరిష్ట స్థాయికి చేరుకోనున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే శీతాకాల నెలల్లో మరిన్ని కేసులు నమోదువుతాయంటూ అంచనాలు వేస్తున్నారు. COVID-19 మహమ్మారి ముగిసిన కొన్నేళ్ల తర్వాత ఎదురైన ఈ సంక్షోభం యూరప్‌లో కల్లోలం సృష్టిస్తోంది. వివిధ ప్రభుత్వాలు పెరుగుతున్న కేసులను నియంత్రించేందుకు మరిన్ని వైద్య సదుపాయాలను సమకూరుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: బిడ్డ పుడితే... ఏడాదిన్నర సెలవు!


